గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ.. హైకోర్టు సంచలన తీర్పు!

కాగా తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో 25 మందికి పైగా అనర్హత పిటిషన్లలో విచారణను ఎదుర్కొంటున్నారు

Update: 2023-08-24 11:05 GMT

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును ప్రకటించింది. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా గద్వాల ఎమ్మెల్యేగా మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను ప్రకటించింది. ప్రస్తుతం గద్వాల ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్‌ఎస్‌ కు చెందిన కృష్ణమోహన్‌ రెడ్డిని అనర్హుడిగా తేల్చింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ సందర్భంగా కృష్ణమోహన్‌ రెడ్డి తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారని ఆయనపై కోర్టు వేటు వేసింది. ఈ సందర్భంగా ఆయన ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పు ఇచ్చింది.

2018 ఎన్నికల్లో గద్వాల నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కృష్ణమోహన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా డీకే అరుణ పోటీ చేశారు. కృష్ణమోహన్‌ రెడ్డి విజయం సాధించడగా డీకే అరుణ రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు ఆయన తప్పుడు అఫిడవిట్‌ కారణంగా పదవి కోల్పోవడంతో రెండో స్థానంలో ఉన్న డీకే అరుణకు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది.

అలాగే కృష్ణమోహన్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టు రూ. 3 లక్షల జరిమానా కూడా విధించింది. అందులోంచి రూ.50 వేలు డీకే అరుణకు ఇవ్వాలని తన ఆదేశాల్లో పేర్కొంది.

తాజాగా ఈ మధ్యే కొత్తగూడెం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై కూడా ఇలాగే అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా కోర్టు ప్రకటించింది. అయితే వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

కాగా డీకే అరుణ 1999లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గద్వాలలో ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్‌ సీటు దక్కకపోవడంతో సమాజవాదీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ వెంటనే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2009, 2014లోనూ గద్వాల నుంచే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో డీకే అరుణ ఓడిపోయారు.

కాగా తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో 25 మందికి పైగా అనర్హత పిటిషన్లలో విచారణను ఎదుర్కొంటున్నారు. ప్రజాప్రతినిధుల అనర్హత కేసులన్నింటినీ ఆగస్టు నెలాఖారులోగా తేల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే హైకోర్టు వరుసగా తీర్పులు వెలువరిస్తోంది.

ఇప్పటికే మంత్రులు.. కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్‌ తో పాటు పాతిక ఎమ్మెల్యేలు ఇలా అనర్హత వేటు కేసులు ఎదుర్కొంటున్నారు. ఇందులో 90 శాతం పైగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు.

అనర్హత కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, దేవరకొండ ఎమ్మెల్యే ఆర్‌ రవీంద్రకుమార్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌లతో పాటు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్, నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్, కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావు, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, వరంగల్‌ ఈస్ట్‌ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌ రావు, వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్, పటాన్‌ చెరువు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఉన్నారు.

Tags:    

Similar News

ఇక ఈడీ వంతు