ఎన్నికల్లో వచ్చే సీట్ల లెక్క చెప్పేసిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఒకలా.. ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ తీరు మరోలా ఉంటుంది

Update: 2023-10-14 04:42 GMT

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఒకలా.. ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ తీరు మరోలా ఉంటుంది. మీడియాకు సంబంధించి వారి లింకులు ఆసక్తికరంగా ఉంటాయి. ఉద్యమ సమయంలో తమ పార్టీని చూసే విలేకరుల్ని తరచూ కలిసే కేసీఆర్.. ఉద్యమానికి సంబంధించి తెలంగాణ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లోని అంశాలపై మీడియా ప్రతినిధుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆయన తీరులో చాలానే మార్పు వచ్చింది.

మొదటి టర్మ్ తో పోలిస్తే.. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి పేరుతో నిర్వహించే భేటీల్లో అత్యధికం కేటీఆర్ హ్యాండిల్ చేయటం కనిపిస్తుంటుంది. గతానికి భిన్నంగా.. ముఖ్యమంత్రి అయ్యాక మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే తీరుకు పుల్ స్టాప్ పెట్టేశారున ఒకవేళ.. తాను ఎవరినైనా కలవాలని భావిస్తే.. వారినే స్వయంగా తన అధికార నివాసానికో.. లేదంటే ఫాం హౌస్ కో పిలిపించుకోవటం తెలిసిందే.

మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే సంప్రదాయినికి ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రేకులు వేయగా.. ఆ బాధ్యతను మంత్రి కేటీఆర్ తీసుకున్నారని చెప్పాలి. కీలకమైన వేళల్లో ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులను తన వద్దకు ప్రత్యేక ఆహ్వానాలతో పిలిపించుకునే మంత్రి కేటీఆర్.. వారితో సుదీర్ఘంగా మాట్లాడటం ఒక అలవాటుగా చేసుకున్నారని చెప్పాలి. ఈ సందర్భంగా ఆయా మీడియా సంస్థలతో తమకున్న సంబంధాల మీద కూడా ఆయన ఓపెన్ గా మాట్లాడటం కనిపిస్తుంది.

తాజాగా అలాంటి సమావేశాన్నే ఏర్పాటు చేసిన మంత్రి కేటీఆర్.. బోలెడన్ని అంశాల మీద మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచే స్థానాల మీద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆసక్తికరంగా మారింది. 2018లో తమకు వచ్చినట్లే 88స్థానాల్లో గెలుపు ఖాయమన్న ధీమాను వ్యక్తం చేశారు. మొత్తం 119 సీట్లలో బీఆర్ఎస్ కు 88 స్థానాలు.. గులాబీ పార్టీ దోస్తు మజ్లిస్ ఆరు స్థానాల్లో గెలుపు ఖాయం కాగా.. మిగిలిన స్థానాల్లో విపక్షాలు గెలుస్తాయన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు చెప్పాలి. ఓపెన్ గా మజ్లిస్ గెలిచే స్థానాల గురించి మాట్లాడకున్నా.. మంత్రి కేటీఆర్ ఆలోచన అదేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేస్తానని తరచూ స్టేట్ మెంట్ ఇస్తున్న సీనియర్ నేత కమ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్.. ఈటెల గజ్వేల్ లోనే కాదు.. మరో యాబై చోట్ల పోటీ చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ.. నరేంద్ర మోడీలు సైతం తెలంగాణకు వచ్చి పోటీ చేయొచ్చని చెప్పుకొచ్చారు. త్వరలోనే చాలామంది ప్రముఖులు బీఆర్ఎస్ లో చేరతారని.. అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత.. గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల మధ్య తన్నులాట ఖాయమన్న జోస్యాన్ని చెప్పుకొచ్చారు మంత్రి కేటీఆర్. మరి.. ఆయన అంచనాలు ఎంతమేర నిజమవుతాయో చూడాలి.

Tags:    

Similar News