బీఆర్ఎస్ కు పేర్లు కూడా తలనొప్పేనా ?

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎన్నికల గుర్తులే కాదు కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్ధుల పేర్లు కూడా ఇబ్బందులు పెడుతోంది.

Update: 2023-11-18 07:43 GMT

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎన్నికల గుర్తులే కాదు కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్ధుల పేర్లు కూడా ఇబ్బందులు పెడుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్ధుల గుర్తు కారును పోలినట్లుండే రోడ్డురోలర్, జీపు గుర్తులు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాయో అందరికీ తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో జనాలు కారుగుర్తుకు ఓట్లేయబోయి రోడ్డురోలర్ లేదా జీపు గుర్తుకు ఓట్లేసిన విషయం అందరికీ తెలిసిందే. 2018 ఎన్నికల్లో ఇలాంటి కన్ఫ్యూజన్ బీఆర్ఎస్ ను దారుణంగా దెబ్బతీసింది.

దాదాపు తొమ్మిది నియోజకవర్గాల్లో రోడ్డురోలర్ కు పడిన ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్ధి ఓడిపోయిన ఓట్ల తేడా కన్నా ఎక్కువ. అందుకనే రోడ్డురోలర్, ట్రాక్టర్, జీపు లాంటి గుర్తులను ఎన్నికల గుర్తులుగా తొలగించాలని కేసీయార్ కోర్టులో పోరాడినా ఉపయోగం కనబడలేదు. ఇపుడు తాజా సమస్య ఏమిటంటే గుర్తులే కాదు కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్ధుల పేర్లతోనే మరికొందరు పోటీలో ఉండటం. దాదాపు 14 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిపేరు, ఇండిపెండెంటుగా పోటీచేస్తున్న అభ్యర్ధిపేరు ఒకటే.

ఎల్బీనగర్ నుండి బీఆర్ఎస్ తరపున దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పోటీచేస్తుంటే ఇండిపెండెంట్లుగా దేవిరెడ్డి సుదీర్ రెడ్డి, డీ సుధీర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇబ్రహింపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి పోటీచేస్తుంటే ఇండిపెండెంటుగా కిషన్ రెడ్డి నిలిచారు. ఉప్పల్ లో బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ తరపున పోటీచేస్తుంటే ఇండిపెండెంటుగా మన్నె లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు. మహేశ్వరంలో కాంగ్రెస్ తరపున కే లక్ష్మారెడ్డి పోటీలో ఉంటే జనశంఖారావం పార్టీ అభ్యర్ధి పేరు కూడా కే లక్ష్మారెడ్డే. బీఆర్ఎస్ తరపున పీ సబిత బరిలో ఉంటే ఇండిపెండెంటుగా ఎం సబిత పోటీ చేస్తున్నారు.

కొడంగల్ లో బీఆర్ఎస్ తరపున పట్నం నరేందరరెడ్డి పోటీచేస్తుంటే ఇండిపెండెంటుగా ప్యాట నరేందరరెడ్డి బరిలో ఉన్నారు. నారాయణపేటలో బీఆర్ఎస్ తరపున ఎన్ రాజేందరరెడ్డి రంగంలో ఉంటే ఇండిపెండెంటుగా కే రాజేందరరెడ్డి పోటీచేస్తున్నారు. దేవరకద్రలో బీఆర్ఎస్ తరపున ఏ శ్రీనివాసరెడ్డి పోటీచేస్తుంటే ఇండిపెండెంట్ పేరు కూడా ఏ శ్రీనివాసరెడ్డే. కొల్హాపూర్లో బీ హర్షవర్ధనరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధి అయితే స్వతంత్ర అభ్యర్ధిగా ఏ హర్షవర్ధనరెడ్డి పోటీలో ఉన్నారు. ఇలా మొత్తం 16 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులకు, రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులకు ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News