సైఫ్ పై దాడి కేసు... పోలీసులకు హెల్ప్ చేసిన యూపీఐ పేమెంట్..!

ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఈ దర్యాప్తులో పోలీసులకు ఓ యూపీఐ పేమెంట్ హెల్ప్ చేసిందని అంటున్నారు!

Update: 2025-01-20 07:07 GMT

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అత్యంత భద్రత కలిగిన అపార్ట్ మెంట్ అని చెబుతున్న చోట, ఓ దుండగుడు నేరుగా సైఫ్ ఇంట్లోకి వెళ్లి కత్తితో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ సమయంలో పోలీసుల అదుపులో ఉన్న నిందితుడి గురించి పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి.

అవును.. సైఫ్ అలీఖాన్ పై దాడికి పాల్పడిన కేసులో నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ (30) ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అతడిని ముంబైలోని బాంద్రాలో గల కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం ఇతడిని ఐదు రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చింది. దీంతో... అతడిని బాంద్రా పీఎస్ కు తరలించారు పోలీసులు.

వాస్తవానికి సైఫ్ పై దాడి ఘటనకు సంబంధించిన కేసు నమోదైనప్పటి నుంచీ నిందితుడిని పట్టుకునేందుకు 30 బృందాలు శ్రమించినట్లు చెబుతుండగా.. ఒక్కో బృందంలో 10 మంది చొప్పున మొత్తం 300 మంది పోలీసులు పనిచేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో దాదాపు 600 సీసీటీవీ కెమెరాలను పరిశీలించినట్లు సమాచారం.

ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఈ దర్యాప్తులో పోలీసులకు ఓ యూపీఐ పేమెంట్ హెల్ప్ చేసిందని అంటున్నారు! పోలీసు విచారణలో నిందితుడు గురించి ఒక వ్యక్తి కీలక విషయాన్ని బయటపెట్టాడంట. అదేమిటంటే... మహ్మద్ షరీఫుల్ల్ తనవద్ద పరోటా, వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడని చెప్పాడట.

దీంతో... అతడు చేసిన యూపీఐ పేమెంట్ ద్వారా నిందితుడి నెంబర్ తెలుసుకున్న పోలీసులు.. దాని ద్వారా అతడున్న లొకేషన్ ను ట్రేస్ చేశారని.. ఆ విధంగా అతడు థానేలోనే ఉన్నట్లు గుర్తించారని.. ఈ సమయంలో పోలీసులను చూసి పారిపోవాలని చూసినా.. నిందితుడిని ఒక్కసారిగా చుట్టుముట్టారని.. అనంతరం అదుపులోకి తీసుకున్నారని కథనాలొస్తున్నాయి.

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... దోపిడీ చేయాలనే ఉద్దేశ్యంతో నిందితుడు సైఫ్ ఇంట్లోకి వెళ్లాడే కానీ.. అది నిజంగా సైఫ్ అలీఖాన్ అనే సెలబ్రెటీ నివాసం అనే విషయం అతడికి తెలియదంట. ఈ విషయాన్ని డీసీపీ వెల్లడించారు. అనంతరం సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు చూసి అతడు ఈ విషయాన్ని తెలుసుకున్నాడని అంటున్నారు.

ఇక నిందితుడిని కోర్టు ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో... విచారణలో భాగంగా ముంబై పోలీసులు అతడితో సోమవారం క్రైమ్ సీన్ రీక్రియేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఐదు రోజుల్లోగా దీనికి సంబంధించిన నివేదికను పోలీసులు బాంద్రా కోర్టుకు అందించాల్సి ఉంది.

Tags:    

Similar News