ఈ మాట అనే హక్కుందా కేటీఆర్?
చేతిలో అధికారం ఉంటే ఒకలా.. చేతి నుంచి పవర్ చేజారిన తర్వాత మరోలాంటి మాటలు మాట్లాడతారన్న పేరును ఇప్పటికే తెచ్చుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.. మరోసారి తనవైపు వేలెత్తి చూపే వ్యాఖ్యలు చేశారు.
చేతిలో అధికారం ఉంటే ఒకలా.. చేతి నుంచి పవర్ చేజారిన తర్వాత మరోలాంటి మాటలు మాట్లాడతారన్న పేరును ఇప్పటికే తెచ్చుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.. మరోసారి తనవైపు వేలెత్తి చూపే వ్యాఖ్యలు చేశారు. ప్రతి విషయంలోనూ ప్రభుత్వాధినేతపై కస్సుమని లేచే ఆయన.. నిత్యం ఏదో ఒక సవాలు విసురుతూ ఉండటం మామూలైంది. రాజకీయం అన్న తర్వాత ఇలాంటివి మామూలే కదా? అని అనుకోవచ్చు. పదేళ్లు అధికారంలో ఉన్న వేళలో.. ఒక్క సందర్భంలో కాకుంటే ఒక్క సందర్భంలోనూ తానిప్పుడు చెబుతున్నవేమీ చేయని కేటీఆర్.. ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ ను చేయాలని కోరటంలో అర్థం లేదు.
మొన్నటికి మొన్న అసెంబ్లీ బయటకు వెళ్లి.. దారిన వెళ్లే వారిని ఆపి కరెంటు ఎవరి ప్రభుత్వంలో బాగుందో అడుగుదామా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు కేటీఆర్ వంతైంది. దొంగచాటుగా ఏదో రాసుకొని వచ్చి ఇదే జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగుల్ని మోసం చేశారని.. దానిపై చర్చకు అవకాశం కోరితే స్పీకర్ నో చెప్పారన్న కేటీఆర్.. ‘‘ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతల్ని నిలదీయాలి. స్వయంగా రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వచ్చి.. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. మీరు హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి? దమ్ముంటే..రాహుల్.. రేవంత్ రెడ్డిలు అశోక్ నగర్ కు రావాలి. మేమంతా వస్తాం. మీరు ఒక్క ఉద్యోగం ఇచ్చినట్లు అశోక్ నగర్ లో విద్యార్థులు చెబితే.. మేమంతా రాజీనామాలు పెట్టి వెళ్లిపోతాం’’ అంటూ సవాలు విసిరారు.
అంతేకాదు.. తమ ప్రభుత్వంలో ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లుగా చెప్పుకోవటం మోసం కాదా? అని ప్రశ్నించారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి సిటీ సెంట్రల్ లైబ్రరీకి రావాలని.. అక్కడికి వస్తే విద్యార్థులే తరిమి కొడతారన్నారు. అయితే.. ఇక్కడ కేటీఆర్ మాటలకు సంబంధించిన ఒక స్పష్టత ఇవ్వాలి. కేటీఆర్ చెప్పినట్లుగా కేసీఆర్ ప్రభుత్వంలో 30వేల ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు పూర్తి చేశారు కానీ.. నియామక పత్రాలు ఇవ్వలేదు. నియామక పత్రాలు ఇస్తే కానీ ఉద్యోగాలు రావు. అవి రావాలంటే ఆర్థిక శాఖలో అనుమతులతో పాటు.. వారి జీతాలకు సంబంధించిన నిధులకు సంబంధించిన పలు నిర్ణయాల్ని తీసుకోవాలి. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ కేసీఆర్ ఆ పని చేయలేదు.
రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చినంతనే.. ఎంపికై నియామక పత్రాలు అందుకోని 30 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇది పెద్ద విషయం కాదా? అన్నది ప్రశ్న. ఒకవేళ.. అది చాలా సింఫుల్ విషయమే అయితే.. కేసీఆర్ సర్కారులో ఆ ప్రక్రియను పూర్తి చేస్తే ఎవరు మాత్రం అడ్డుకునేవారు? చేతిలో అధికారం ఉన్నప్పుడు చేయని పని.. రేవంత్ చేసిన వైనాన్ని పక్కన పెట్టేసి.. రేవంత్ దొంగ పని చేసినట్లుగా వ్యాఖ్యలు చేయటంలోనే కేటీఆర్ రాజకీయం అర్థమవుతుంది.
ఇక.. తరచూ ముఖ్యమంత్రి రేవంత్ ను అక్కడకు రా.. ఇక్కడకు రా.. తాము కూడా వస్తామని చెప్పే కేటీఆర్.. తాము అధికారంలో ఉన్న పదేళ్లలో ఏ రోజైనా విపక్ష సభ్యులను తీసుకొని వెళ్లి.. ఇప్పుడు సవాలు విసిరినట్లుగా చేశారా? చేసి ఉంటే.. ఈ రోజున రేవంత్ ను సవాలు విసరటంలో అర్థముంది. అందుకు భిన్నంగా సవాలు విసరటం ద్వారా కేటీఆర్ తనను తాను తగ్గించుకుంటున్నారని చెప్పాలి. ఇలా పిలిచే నైతిక హక్కు కేటీఆర్ కు ఉందా? అన్నది పెద్ద ప్రశ్న. పదేళ్లు పవర్ లో ఉన్న వేళలో.. నేల మీద నడవని కేటీఆర్ అంటూ ఆయన మీద పెద్దఎత్తున విమర్శలు ఉన్నాయి. అలాంటి ఆయన.. ఈ రోజున ముఖ్యమంత్రి రేవంత్ అశోక్ నగర్ కు రావాలని సవాలు విసిరే కన్నా.. కాస్తంత టైమిచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.