రోజుకొక ఎమ్మెల్యే జంప్!

రాజకీయాల్లో జంపింగ్ జఫాంగులు ఎక్కువ అయిపోయారు. ఒకపుడు పార్టీ మారాలంటే సవా లక్ష ఆలోచనలు చేసేవారు

Update: 2024-06-24 15:30 GMT

రాజకీయాల్లో జంపింగ్ జఫాంగులు ఎక్కువ అయిపోయారు. ఒకపుడు పార్టీ మారాలంటే సవా లక్ష ఆలోచనలు చేసేవారు. ఇపుడు అలా కాదు ఎలాంటి బిడియం లేకుండా ఉన్న జెండా కింద పడేసి కొత్త జెండా పట్టుకుంటున్నారు. దానికి ముద్దుగా చెబుతున్న పేరు ప్రజల కోసం అని. తమను నమ్ముకున్న ప్రజలకు నిధులు కావాలి, అభివృద్ధి జరగాలి అందుకే పార్టీ మార్పు అని బోల్డ్ గా ఒక స్టేట్మెంట్ వదిలేసి అధికార పక్షంలోకి జంప్ చేస్తున్నారు.

అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లిపోవడమే వర్తమానంలో సాగుతున్న రాజకీయం. తమను ఫలానా గుర్తు మీద ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి పార్టీ మారడం వారిని మోసగించినట్లు అవుతుందని అసలు ఆలోచించలేక పోతున్నారు. ఇదిలా ఉంటే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటూ కూడా తెచ్చుకోలేక చతికిలపడింది. జీరో మార్కులను సాధించింది

దాంతో బీఆర్ఎస్ ఫ్యూచర్ మీద బెంగటిల్లి పార్టీ మారుతున్నారా లేక తమ రాజకీయం ఎపుడు అధికార పార్టీలోనే సాగాలని భావించి గోడ దూకుతున్నారా తెలియదు కానీ జంపింగులు అయితే ఒక రేంజిలో తెలంగాణాలో సాగుతున్నాయి. ఒకరి తరువాత మరొకరు అనుకుంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ కి దగ్గర అవుతున్నారు.

వరసగా రెండు రోజుల నుంచి చూస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు బీఅర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు. ఎన్నికలు జరిగి నిండా ఏడాది కాలేదు. ఇంకా నాలుగేళ్లకు పైగా అధికారం కాంగ్రెస్ చేతుల్లో ఉంది. మరి ఆనాటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందరు ఉంటారు అన్న చర్త అయితే సాగుతోంది.

ఇదిలా ఉంటే ఈ జంపింగులలో సైతం మరో తెలివి కనిపిస్తోంది. నాలుగేళ్ల పాటు అధికారాన్ని అనుభవించి 2028 ఎన్నికల ముందు ఎవరు అధికారంలోకి వస్తారో చూసుకుని ఆ టైం కి మళ్లీ అటు నుంచి ఇటు అయినా జంప్ చేయవచ్చు అన్న ఎత్తుగడ కూడా ఉంది అని అంటున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణాలో ఈ జంపింగుల వల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ రోజుకు 70 మంది దాకా పెరిగారు. కాంగ్రెస్ 2023 ఎన్నికల్లో గెలిచింది అరవై నాలుగు ఎమెంల్యేలను మాత్రమే. అంటే ఆరు నెలల తేడాలో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటు నుంచి ఇటు జంప్ అయ్యారు అన్న మాట. మరి రానున్న రోజులలో ఇంకా మారుతారు అని అంటున్నారు.

కాంగ్రెస్ వర్గాలు చెబుతున్న దానిని బట్టి చూస్తూంటే పాతిక మంది దాకా ఎమ్మెల్యేలు క్యూ కట్టి ఉన్నారట. అంటే బీఆర్ఎస్ కి ఉన్న 39 నంబర్ లో పాతిక మందిని తీసేసే కేవలం పద్నాలుగు మంది మాత్రమే మిగులుతరు అన్న మాట. అంటే ప్రతిపక్ష హోదాకి సరిపడా మ్యాజిక్ ఫిగర్ 12 అంటే దానికి బొటా బొటీగా బీఆర్ఎస్ కి మిగులుతారో లేదో తెలియడం లేదు అని అంటున్నారు.

ఇక బీఆర్ఎస్ ది చూస్తే అరణ్య రోదనగానే ఉంది. మా ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు కానీ నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్షా అని షబ్బీర్ అలీ లాంటి వారు అంటున్నారు. ఆనాడు బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నపుడు భట్టి విక్రమర్కకు కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా ఎమ్మెల్యేలను లాగేసినపుడు ఈ నీతిసూత్రాలు ఎక్కడికి వెళ్ళిపోయాయని ప్రశ్నిస్తున్నారు.

అంటే నాడు వారు చేశారు నేడు వీరు చేస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ వారూ వీరూ అడ్డినా ఎమ్మెల్యేలు అయితే ఆగేట్టు లేరు. వారంతట వారే అధికార పార్టీ వారికి టచ్ లోకి వచ్చి చేరిపోతామని అంటున్నారు. ఇదే ఇపుడు రాజకీయాల్లో వింత పరిస్థితి. ఈ ధోరణి ఎంతలా పెచ్చుమీరితే అంతలా ప్రజాస్వామ్యానికి విఘాతం ఏర్పడుతుంది అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే బీఆర్ఎస్ ఎన్నడూ లేనంతగా సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ పార్టీలో ఎవరు ఉంటారో ఎవరొ వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి ఉంది. ఇక పార్టీని నాలుగున్నరేళ్ల పాటు గట్టిగా నడపడం కష్టమే అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక వైపు తెలంగాణాలో పట్టు కోసం చూస్తోంది. మరో వైపు తెలంగాణాలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తన పట్టుని బిగిస్తోంది.

ఇలా రెండు జాతీయ పార్టీల మధ్య ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ నలిగిపోతోంది. బీఆర్ఎస్ ని ఎలిమినేట్ చేసే విషయంలో కాంగ్రెస్ బీజేపీ ఒకే అజెండాతో పనిచేస్తున్నాయా అన్నది కూడా ఉంది. మొత్తం మీద బీఆర్ఎస్ ప్రతీ రోజూ జంపింగ్ జఫాంగులను లెక్క వేసుకుంటూ చింతించడమే మిగిలిందా అంటే ప్రస్తుతానికి ఇంతే అనుకోవాల్సిందే.

Tags:    

Similar News