బీఆర్ఎస్ కి వచ్చేది ఒక్కటేనా...!?

గత వైభోగాలు అన్నీ కాలగర్భంలో కలసిపోయాయి. నిరుడు విరిసిన హిమ సుమములు వాడిపోయాయి.

Update: 2024-03-12 06:26 GMT

గత వైభోగాలు అన్నీ కాలగర్భంలో కలసిపోయాయి. నిరుడు విరిసిన హిమ సుమములు వాడిపోయాయి. అధికార దర్పం దర్జా అంతా ఒకే ఒక్క ఓటమితో పాతాళానికి జారిపోయాయి. ఇపుడు తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీ తీరు చూస్తే చాలా ఇబ్బందికరంగా మారింది అని అంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఎన్ని సీట్లు వస్తాయంటే సర్వేశ్వరులు అంతా ఒకటి లేదా రెండు అని మాత్రమే చెబుతున్నారు అంటే బీఆర్ఎస్ దైన్యం వర్ణించతరమా అని అంటున్నారు.

బీఆర్ఎస్ ఆషామాషీ పార్టీ కాదు, పదేళ్ళు తెలంగాణాలో అధికారం చలాయించిన పార్టీ. చక్రాలు గిర్రున తిప్పిన పార్టీ. ఇక కేసీఆర్ అంటే పొలిటికల్ గా ఒక బ్రాండ్ అన్నట్లుగా కధ సాగింది. అలాంటి కేసీఆర్ ఇపుడు తెలంగాణా రాజకీయాల్లో జీరో అయ్యారు అని అంటున్నారు. తెలంగాణాలో అధికారంలో కాంగ్రెస్ ఉంది. అది ఒక జాతీయ పార్టీ. ఆ పార్టీ ఓడినా పదేళ్ళు రాజకీయంగా ఇబ్బందులు పడినా ఒక్క చాన్స్ తో మళ్లీ అధికారం పట్టేసింది.

సో కాంగ్రెస్ కి ఇబ్బంది ఏమీ లేదు. ఇక మరో జాతీయ పార్టీగా బీజేపీ ఉంది. బీజేపీకి ఇపుడు తెలంగాణాలో పొలిటికల్ గా ఉన్న శూన్యత కలసి వస్తోంది అని అంటున్నారు. బీఆర్ఎస్ కుంగిపోవడంతో ఆ లోటుని భర్తీ చేయాలని కమలం పార్టీ చూస్తోంది. బీఆర్ఎస్ ఓటమిని అడ్వాంటేజ్ గా తీసుకుని బీజేపీ గట్టిగా ఎదగాలని చూస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే బీఆర్ఎస్ నూటికి ఎనభై శాతంగా తగ్గిపోయింది. ఆ క్షీణత అలా అలాగే కంటిన్యూ అవుతోంది. అది కాస్తా లోక్ సభ ఎన్నికల తరువాత మరింతంగా ఉంటుందని లోక్ సభ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ దుకాణం పూర్తిగా బంద్ అవుతుంది అని అంటున్నారు.

బీఆర్ఎస్ లో ప్రస్తుతం ఎంపీ సీట్లకు పోటీ చేసే వారు కరవు అయ్యారు అని అంటున్నారు. ఒకపుడు అయితే బీఆర్ఎస్ లో సీట్ల కోసం క్యూ కట్టేవారు బీ ఫారాలు ఎవరికి వస్తాయో అని తెగ టెన్షన్ పడేవారు. ఇపుడు టికెట్ ఇస్తామంటే ముఖం చాటేస్తున్నారు.

ఇక బీఆర్ ఎస్ పూర్వ రూపం టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించింది. ఆనాడు చూస్తే కేసీఆర్ తప్పితే ఎవరూ లేరు. కానీ ఆ టైం లో కూడా టికెట్ల కోసం ఎంతో మంది ఆశపడేవారు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే చాలు అన్నట్లుగా ఉండేవారు. అలాంటిది పదేళ్లు అధికారం చూసి పాతికేళ్ల వయసు కలిగిన బీఆర్ఎస్ లో ఈ దీన పరిస్థితి ఏంటి అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.

మూడు నెలల క్రితం కేసీఆర్ ఇపుడు కేసీఆర్ కూడా ఒక్కరే. కానీ ఇపుడు ఆయన మాజీ సీఎం. అందుకేనా ఆయన ముఖం చూడడానికి కూడా ఎవరూ రావడం లేదు అని అంటున్నారు. ఇక తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఒక ఫైర్ బ్రాండ్. ఆయన మాటల మాంత్రికుడు. కేసీఆర్ కి సమఉజ్జీగా గా మారారు. ఇక కేంద్రంలో నరేంద్ర మోడీ ఉన్నారు. ఆయన రాజకీయం దూకుడుగా ఉంటుంది. మోడీ కూడా మరొక ఫైర్ బ్రాండ్.

ఈ ఇద్దరి దెబ్బకు బీఆర్ఎస్ తట్టుకోలేకపోతోంది అని అంటున్నారు. కాంగ్రెస్ బీజేపీ రెండూ చేసే పాలిటిక్స్ తో బీఆర్ ఎస్ పతనం అంచులకు చేరుతోంది అని అంటున్నారు. బీఆర్ఎస్ మళ్లీ లేచి కూర్చునే పరిస్థితి ఉందా అన్నది ఎక్కడ చూసినా అతి పెద్ద చర్చగా ఉంది.

ఇక తెలంగాణా రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. అనేక సర్వేలు తేల్చింది ఏంటి అంటే కాంగ్రెస్ కి ఈసారి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని. ఆ తరువాత కొన్ని సీట్లు బీజేపీకి వస్తాయని. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అంటే ఒక్కటే సీటు వస్తుందని తేల్చేస్తున్నాయి. ఆ సీటు మెదక్ అని అంటున్నారు.

ఈ మెదక్ ఎంపీ సీటు కూడా గెలవడం అన్నది సిద్దిపేట అసెంబ్లీ సీటులో వచ్చే మెజారిటీ మీద ఆధారపడి ఉంది అని అంటున్నారు. సిద్ధిపేట అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత సీటు అన్నది తెలిసిందే. ఇక మెదక్ పార్లమెంట్ పరిధిలో కూడా బీజేపీ బలంగా తయారు అయింది అని అంటున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ఓట్లను బీజేపీ చీల్చితే మెదక్ ఎంపీ సీటు కూడా గెలుచుకోవడం కష్టం అని అంటున్నారు.

ఇదిలా ఉంటే బీఆర్ఎస్ మూడు నెలలలో ఇంతలా ఇబ్బంది పడడానికి కారణం ఆ ముగ్గురే అంటున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ కాలు విరిగి రెస్ట్ తీసుకోవడం కూడా పార్టీకి శాపం అయింది. ఇక కేటీయార్ తీరు కూడా సరిగ్గా లేదు అంటున్నారు. అధికారంలో ఉన్నపుడు చక్రం తిప్పిన ఆయన ఇపుడు సవాళ్ళు చేస్తూ బిగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కానీ జనంలో విశ్వాసం పొందేలా పార్టీని బిల్డప్ చేయలేకపోతున్నారు అని అంటున్నారు. అదే విధంగా కుమార్తె కవిత కూడా పార్టీ కష్టకాలం కష్టపడాల్సింది పోయి ఇంకా మీడియా ముఖంగానే స్టేట్మెంట్స్ ఇస్తూ పోతున్నారు అని అంటున్నారు.

ఇలా ఒకే కుటుంబంలో తండ్రి, కొడుకు, కుమార్తె అధికారాంతమున పార్టీ కాడె వదిలేయడం వల్లనే గులాబీ పార్టీకి ఇన్ని తిప్పలు అని అంటున్నారు. బీఆర్ ఎస్ ఇప్పట్లో కోలుకోదా లేక ఎప్పటికీ కోలుకోదా అన్న భయాలు సందేహాలు క్యాడర్ లో వస్తున్నాయంటే ఈ ముగ్గురి వైఖరి కారణం అని అంటున్నారు

Tags:    

Similar News