జనసేనలోకి టీడీపీ నేత... అవనిగడ్డను అలా ఫిక్స్ చేయనున్న పవన్!!

ఈ సమయంలో అనూహ్యంగా అవనిగడ్డ టీడీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ని అక్కడ నుంచి బరిలోకి దింపాలని భావిస్తున్నారని అంటున్నారు.

Update: 2024-04-01 05:12 GMT

రానున్న ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ - జనసేన కలిసి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. కూటమిలో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలు దక్కాయి. దీంతో... జనసైనికులు, కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు వార్తలొచ్చాయి. ఈ సమయంలో పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అక్కడ టీడీపీ ఇన్ ఛార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ ఇంటికి వెళ్లి బ్లెస్సింగ్స్ తీసుకుని ప్రచారం ప్రారంభించారు.

ఇక మిగిలిన 20 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థిని ప్రకటించకుండా సందిగ్దంలో పెట్టిన నియోజకవర్గాల్లో అవనిగడ్డ మిగిలిపోయింది! మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరిని అవనిగడ్డ నుంచి పోటీ చేయమని.. మచిలీపట్నం లోక్ సభ స్థానాన్ని వంగవీటీ రాధకు ఇవ్వాలని పవన్ భావిస్తున్నారనే చర్చ రాజకీయా వర్గాల్లో వినిపించింది. అయితే... అందుకు బాలశౌరి ఏమాత్రం అంగీకరించలేదని.. దీంతో అవనిగడ్డ పెండింగ్ లోనే కొనసాగుతుందని చెబుతున్నారు.

ఈ సమయంలో అనూహ్యంగా అవనిగడ్డ టీడీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ని అక్కడ నుంచి బరిలోకి దింపాలని భావిస్తున్నారని అంటున్నారు. అయితే... ఆ టిక్కెట్ జనసేన ఖాతాలో ఉండటంతో... ఆయన ఈ రోజు జనసేనలో చేరి ఆ టిక్కెట్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది! ఈ మేరకు పవన్ కల్యాణ్.. ఇప్పటికే బుద్దప్రసాద్ తో మాట్లాడారని.. అవనిగడ్డ టిక్కెట్ ఆఫర్ చేశారని అంటున్నారు.

దీంతో... అవనిగడ్డలో జనసేనకు ఇప్పటికీ సరైన అభ్యర్థి లేకపోవడం ఆశ్చర్యంగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి! కూటమిలో భాగంగా ఇంతకాలం పార్టీకి పనిచేసిన జనసైనికుల్లో ఒకరికి టిక్కెట్ ఇచ్చి, టీడీపీ నేతల మద్దతు ఎలాగూ ఉంటుంది కాబట్టి.. మండలి వంటి సీనియర్ల సూచనల్తో ఆ టిక్కెట్ ను సెట్ చేయాల్సిందని చెబుతున్నారు. ఏది ఏమైనా... జనసేనకు అవనిగడ్డ సమస్య ఈ దెబ్బతో తీరిపోయినట్లే అని అంటున్నారు పరిశీలకులు.

కాగా... 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలిచిన బుద్ధప్రసాద్ కి ఈ నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఇక్కడ జనసేనకు సరైన కేడర్, సరైన అభ్యర్థి లేకపోవడంతో... సర్వే ఫలితాల ఆధారంగా పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది! రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీచేసిన బుద్ధప్రసాద్ 5,985 ఓట్ల మెజారిటీతో గెలవగా... 2019 ఎన్నికల్లో సమీప వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు చేతిలో 20,725 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.

ఏది ఏమైనా... పవన్ కాకుండా జనసేనకు మిగిలిఉన్న 20 స్థానాల్లోనూ.. తిరుపతి, భీమవరం, విశాఖ సౌత్ లతో పాటు తాజాగా అవనిగడ్డ టిక్కెట్ కూడా వలస నేతలకు కేటాయిస్తారని తెలుస్తుండటం ఆసక్తిగా మారింది!

Tags:    

Similar News