రాడిసన్ హోటల్లో పని చేయని కెమేరాల లెక్క తేలింది!
రాడిసన్ హోటల్ కు యజమానిగా వ్యవహరిస్తున్న వివేకానంద.. తాను చేసుకునే పార్టీల కోసం రెండు రూంలను తన అవసరాలకు తగ్గట్లుగా మార్చుకున్నట్లుగా గుర్తించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారిన రాడిసన్ డ్రగ్స్ పార్టీ ఎపిసోడ్ లో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. ప్రముఖ తెలంగాణ బీజేపీ నేత.. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న యోగానంద కుమారుడే వివేకానంద కావటం.. అతగాడ్ని అరెస్టు చేయటం తెలిసిందే. రాడిసన్ హోటల్ కు యజమానిగా వ్యవహరిస్తున్న వివేకానంద.. తాను చేసుకునే పార్టీల కోసం రెండు రూంలను తన అవసరాలకు తగ్గట్లుగా మార్చుకున్నట్లుగా గుర్తించారు. అంతేకాదు.. రాడిసన్ హోటల్లో మరో కీలక అంశాన్ని గుర్తించారు.
హోటల్ మొత్తంలో 200 సీసీ కెమేరాలు ఉండగా.. అందులో 20 కెమేరాలు మాత్రమే పని చేస్తున్నాయని.. మిగిలిన 180 సీసీ కెమేరాలు పని చేయట్లేదన్న విషయాన్ని పోలీసు అధికారులు గుర్తించారు. దీనికి కారణం ఏమిటన్న విషయాన్ని పోలీసులు హోటల్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. వివేకానంద తరచూ నిర్వహించే పార్టీలకు వచ్చే వారెవరు? వారి వివరాల్ని రాబడుతున్నారు. 1200, 1204 గదులను వేదికగా చేసుకొని డ్రగ్స్ పార్టీని తరచూ నిర్వహించేవాడని గుర్తించారు.
ఇక.. వివేకానంద వినియోగించే కొకైన్.. ఇతర డ్రగ్స్ ను ఎలా సంపాదిస్తారు? ఎవరు అతనికి సప్లై చేస్తారు? అన్న కోణంలో విచారించి.. అబ్బాస్ ను అదుపులోకి తీసుకున్నారు. అతగాడిని విచారించే క్రమంలో వివేకానంద వాడే డ్రగ్స్ ను అబ్బాస్ సప్లై చేస్తున్న విషయాన్ని గుర్తించారు. అంతేకాదు.. వివేకానంద వద్ద కారు డ్రైవర్ గా పని చేసే ప్రవీణ్ ఈ డ్రగ్స్ ను తీసుకునే వారన్నారు. అంతేకాదు.. అబ్బాస్ కు ప్రవీణ్ డబ్బులు చెల్లించే వారని పేర్కొన్నారు.
ఈ క్రమంలో అబ్బాస్.. ప్రవీణ్ మధ్య నగదు లావాదేవీల్ని పోలీసులు గుర్తించారు. ఇప్పటికి అందుబాటులోకి రాకుండా ఉండిపోయిన రఘు చరణ్.. సందీప్.. నీల్.. శ్వేత.. యూట్యూబర్ లిషి తదితరుల ఆచూకీ లబించలేదు. స్టార్ హోటల్ అయిన రాడిసన్ లోని 200 కెమెరాల్లో కేవలం 20 శాతం కెమేరాలు ఎందుకు పని చేస్తున్నాయి? మిగిలిన వాటిని పని చేయకుండా ఉద్దేశపూర్వకంగానే అలా ఉంచారా? అన్న కోణంలో పోలీసుల విచారణ సాగుతోంది. రానున్న రోజుల్లో మరిన్ని సంచలన అంశాలు వెలుగు చూసే వీలుందన్న మాట వినిపిస్తోంది.