ట్రూడోకు పెద్ద ‘సిక్కే’.. అందుకే భారత్ తో కయ్యం

ట్రూడో నేతృత్వంలో 2025 అక్టోబరులో జరిగే ఫెడరల్‌ ఎన్నికలకు వెళ్తే ఓటమి ఖాయమని స్పష్టమైంది.

Update: 2024-10-15 17:30 GMT

న్యూడెమోక్రటిక్ పార్టీ (ఎన్డీపీ).. కెనడాలో బలమైన వర్గమైన సిక్కులకు చెందిన పార్టీగా పేరొందింది. ఇది గత నెలలో ట్రూడో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. ట్రూడో నేతృత్వంలో 2025 అక్టోబరులో జరిగే ఫెడరల్‌ ఎన్నికలకు వెళ్తే ఓటమి ఖాయమని స్పష్టమైంది.

పదేళ్లుగా అధికారం.. ప్రజల్లో.. సొంత పార్టీలోనూ వ్యతిరేకత.. అవినీతి ఆరోపణలు.. మళ్లీ ఎన్నికలు వస్తే గెలుపు కష్టమే.. దీంతోనే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రూటు మార్చారు. తాను అత్యంత బలపడాలంటే ఏం చేయాలా..? అని ఆలోచించారు. కొడితే పెద్ద షాటే కొట్టాలనుకున్నారు.. ఏకంగా 8 లక్షల మంది జనాభా ఉన్న ఆదరణ పొందే ప్లాన్ వేశారు. భారత్ ను టార్గెట్ చేసుకున్నారు.

ఎప్పటి ఘటన.. ఎలాంటి స్పందన..

కెనడా అంటే సిక్కులకు రెండే దేశం. భారత్ తర్వాత అక్కడే అత్యధికంగా 7.70 లక్షల మంది సిక్కులు ఉంటారు. కెనడా రాజకీయాల్లో వారిది ప్రధాన పాత్ర. అయితే, సిక్కు దేశం కోరుకునే ‘ఖలిస్థానీ’ ఉద్యమానికి వీరిలో కొందరు గట్టి మద్దతుదారులు. కెనడాలో సిక్కులు రాజకీయ పార్టీలను శాసించే స్థితిలో ఉన్నారు. మరోవైపు 2015 నుంచి ట్రూడో కెనడా ప్రధాని ఉన్నారు. నాడు ట్రూడోకు చెందిన లిబరల్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ,2017 నాటికే ఆయన ప్రజాభిమానం కోల్పోసాగారు. ఆ ఏడాది అగాఖాన్‌ సంస్థ నుంచి బహుమతుల రూపంలో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారన్న ఆరోపణలు వచ్చాయి. 2019లో ఎస్‌ఎన్‌సీ-లవలిన్‌ కుంభకోణం, బ్లాక్‌ ఫేస్‌ వివాదాలు ట్రూడో ప్రతిష్ఠను మంటగలిపాయి. ఆ ఏడాది లిబరల్ పార్టీ బలం బాగా తగ్గిపోయింది. మిత్రపక్షాలపై మద్దతు పొందాల్సి వచ్చింది. ట్రూడో పడడం లేదని 2020లో కెనడా ఆర్థిక మంత్రి బిల్‌ రాజీనామా చేశారు. పూర్తి మెజార్టీ సాధించే ఉద్దేశంలో మళ్లీ ఎన్నికలకు వెళ్తే ట్రూడో మరింత దెబ్బతిన్నారు. తిరిగి మైనార్టీ ప్రభుత్వమే ఏర్పాటు చేయాల్సి వచ్చింది. స్పెషల్‌ ఎలక్షన్స్ గా పేర్కొనే వీటిలో లిబరల్ పార్టీ అత్యంత పట్టున్న సీట్లనూ కోల్పోయింది. ఇన్ని ఎదురుదెబ్బలతోనే ట్రూడో తాజాగా నిజ్జర్ హత్య కేసును బయటకు తీశారనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి నిజ్జర్ హత్య జరిగి దాదాపు ఏడాదిన్నర అవుతోంది. మధ్యలోనే ఓసారి దీనిపై వివాదం రేగి సద్దుమణిగింది. మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చింది.

బలమైన నేతగా చెప్పుకొనేందుకు..

లిబరల్ పార్టీకి కెనడాలో ప్రత్యర్థి పార్టీ కన్జర్వేటివ్ లు. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న వీరు పుంజుకుంటున్నారు. ఇప్సాస్‌ విడుదల చేసిన పోల్స్‌ లో ట్రూడో కంటే కన్జర్వేటివ్ పార్టీ నేత పెర్రీ పోయిలీవ్ రే ముందున్నారు. ట్రూడోను 26 శాతం మంది మాత్రమే ప్రధానిగా కోరుకుంటే.. పెర్రీ వైపు 45 శాతం మంది నిలిచారు. గత జూలైలోనూ ట్రూడో ప్రభుత్వం పడిపోతుందనే ఊహాగానాలు వచ్చాయి. ఇదే సమయంలో సిక్కుల ఆధిపత్యం ఉండే

న్యూ డెమోక్రటిక్‌ పార్టీ (ఎన్డీపీ) సెప్టెంబరులో ట్రూడో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. ఇప్పుడు మళ్లీ ఎన్డీపీతో కలిసేందుకు ట్రూడో భారత్‌ ను టార్గెట్ చేశారు. రెండు రోజుల కిందట కెనడా పార్లమెంట్‌ హాల్‌ లో ట్రూడోకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ జరిగింది. పెద్దఎత్తున ఎంపీలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ట్రూడో నేతృత్వంలో 2025 అక్టోబరులో జరిగే ఫెడరల్‌ ఎన్నికలకు వెళ్తే ఓటమి ఖాయమని స్పష్టమైంది. అందుకనే ఎన్డీపీ రాగం అందుకున్నారు ట్రూడో.

అందరూ ఖలిస్థానీలు కాదు

సిక్కులు బ్రిటన్, ఆస్ట్రేలియాలోనూ అధికంగానే ఉన్నారు. అయితే, కెనడాలో మాత్రం వీరి సంఖ్య 7.70 లక్షలుగా ఉంది. ఆ దేశంలో నాలుగో అతి పెద్ద జాతి సిక్కులు. వీరిలో కొందరు బలమైన వ్యక్తులు ఖలిస్థాన్ కు మద్దతు పలుకుతున్నారు. ఇలాంటివారి కోసం ట్రూడో ఖలిస్థానీ అనుకూల వైఖరి ప్రదర్శిస్తూ భారత్‌ తో సంబంధాలను తెగేదాక లాగుతున్నారు.

కొసమెరుపు: భారత్‌ కు వచ్చిన రెండుసార్లు ట్రూడోకు చేదు అనుభవాలే మిగిలాయి. 2018లో పంజాబ్‌ మంత్రి హత్యకు కుట్రపన్నిన జస్పాల్‌ అత్వాల్‌ ను కెనడా హై కమిషనర్‌ డిన్నర్‌ కు పిలవడం వివాదాస్పదమైంది. నిరుడు జీ20 సమావేశాల అనంతరం ట్రూడో తిరుగు ప్రయాణం బాగా ఆలస్యమైంది. ఆయన అధికారిక విమానాల్లో సమస్య తలెత్తడమే దీనికి కారణం. కాగా, నిజ్జర్ హత్య అనంతరం భారత్‌ తో చర్చల్లో ఉన్న భవిష్యత్ వాణిజ్యం ఒప్పందాన్ని ట్రూడో పట్టించుకోవడం మానేశారు.

Tags:    

Similar News