ఇంకా భారత్ లోనే కెనడా ప్రధాని.. విమానానికి ఏమైంది?
తాజాగా కెనడా రాజధాని ఒట్టావాలోని భారత దౌత్యకార్యాలయాన్ని మూసివేయాలని బెదిరింపు కాల్ వచ్చిందని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఢిల్లీలో జరిగిన జీ20 దేశాల సదస్సు కోసం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మనదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సదస్సు కోసం భారత్ కు వచ్చిన విదేశీ నేతలంతా సమావేశాలు ముగియగానే వెళ్లిపోయారు. అయితే కెనడా ప్రధాని ట్రూడో మాత్రం వెళ్లలేకపోయారు. ఇప్పటివరకు ఆయన ఇంకా భారత్ లోనే ఉండిపోయారు. ప్రధాని విమానంలో సాంకేతిక లోపాల వల్లే ఆయన కెనడా వెళ్లలేదని తెలుస్తోంది.
వాస్తవానికి ఆదివారమే అంటే సెప్టెంబర్ 10నే జస్టిన్ ట్రూడో కెనడాకు వెళ్లిపోవాల్సి ఉంది. విమానంలో లోపాలతో ఆగిపోయారు. సోమవారానికి ఆయన విమానం మరమ్మతులు పూర్తి కావాల్సి ఉంది. సోమవారం పూర్తయితే ఆయన బయలుదేరేవారు. అయితే అప్పటికి సాంకేతిక సమస్యలు పరిష్కారం కాలేదు. దీంతో మంగళవారం కూడా ఆయన మన దేశంలోనే ఉండిపోయారు.
దీంతో మరో విమానాన్ని కెనడా నుంచి రప్పిస్తున్నారని, ట్రూడో అందులో మంగళవారం సాయంత్రం స్వదేశానికి వెళ్తారని తెలుస్తోంది. కాగా కెనడాలో కొనసాగుతోన్న ఖలిస్థానీ సానుభూతిపరుల దుశ్చర్యలపై ఒకవైపు భారత్ ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు ఆ మిలిటెంట్ గ్రూపులు బరితెగించాయి. తాజాగా కెనడా రాజధాని ఒట్టావాలోని భారత దౌత్యకార్యాలయాన్ని మూసివేయాలని బెదిరింపు కాల్ వచ్చిందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అలాగే హై కమిషనర్ ను వెనక్కి రప్పించాలని ఆ కాల్ లో హెచ్చరించారు.
జీ20 సదస్సులో భాగంగా భారత ప్రధాని మోదీతో జస్టిన్ ట్రూడో సమావేశమైన రెండు రోజుల తర్వాత ఈ కాల్ వచ్చిందని చెబుతున్నారు. గత 48 గంటల్లో ఇది రెండో కాల్ అని అంటున్నారు. భారత్ పర్యటనలో ట్రూడో ఇబ్బందిగా కనిపించడానికి కూడా భారత ప్రభుత్వ వైఖరే కారణమని మిలిటెంట్ గ్రూప్ ఆరోపించింది. వెంటనే భారత్ లో ఉన్న కెనడా∙రాయబారిని వెనక్కి పిలవకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. ట్రూడో ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జీ20 సదస్సుకు వచ్చిన ట్రూడో పర్యటన ఆసాంతం అసౌకర్యంగానే కనిపించారు. అలాగే సదస్సు ముగిసిన వెంటనే ఆయన తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. కానీ, విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆయనతో సహా ఆ దేశ ప్రతినిధులంతా భారత్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది.