నగ్న వీడియో కలకలం.. 29 మహిళా సీబీఐ అధికారులతో విచారణ!

మణిపూర్‌ లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

Update: 2023-08-17 07:25 GMT

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ లో తీవ్ర హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. స్థానిక తెగలైన మైతేయి, కుకీల మధ్య చోటు చేసుకున్న హింస పలు హత్యలకు, మహిళలపై అత్యాచారాలకు, ఇళ్ల దహనాలకు, ఆస్తుల విధ్వంసానికి దారితీసింది. మణిపూర్‌ లో అల్లర్లు చెలరేగి రెండు నెలలవుతున్నా ఇంకా వాటికి అడ్డుకట్ట పడటం లేదు. ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు, ఇద్దరు మహిళలను నడిరోడ్డుపై కొంతమంది పురుషులు వివస్త్రగా నడిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈ ఘటనపై తాజా పార్లమెంటు సమావేశాలు అట్టుడికి పోయాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని స్వయంగా తామే పరిశీలిస్తామని పేర్కొంది.

మణిపూర్‌ లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సీబీఐ బృందంలో ఏకంగా 53 మంది సభ్యులను నియమించడం విశేషం. వీరిలోనూ 29 మంది మహిళా అధికారులే కావడం మరో విశేషం.

ఏ కేసుకు సంబంధించి అయినా సీబీఐ విచారణ బృందంలో ఇంత పెద్దమొత్తంలో మహిళా అధికారులు ఉండటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. గతంలో ఏ కేసు విచారణ సందర్భంగానూ కూడా సీబీఐ విచారణ బృందంలో ఇంత మంది మహిళా అధికారులు లేరని చెబుతున్నారు.

కాగా సీబీఐ విచారణ బృందంలో ముగ్గురు డీఐజీలు లవ్లీ కతియార్, నిర్మలాదేవి, మోహిత్‌ గుప్తాతోపాటు ఒక ఎస్పీ రాజ్‌వీర్‌ ఉండటం విశేషం. అలాగే ఇద్దరు ఏఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు సీబీఐ బృందంలో ఉన్నారు. మణిపూర్‌ లైంగిక హింస విచారణకు సంబంధించి మొత్తం దర్యాప్తుకు సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ ఘనశ్యామ్‌ ఉపాధ్యాయ్‌ నేతృత్వం వహించనున్నారు.

వాస్తవానికి ఏదైనా కేసు విచారణకు సంబంధించి సీబీఐ ఇంతమంది అధికారులను నియమించదని చెబుతున్నారు. రాష్ట్ర అధికారుల సాయంతో కేసులను విచారిస్తుంది. అయితే మణిపూర్‌ పోలీసులపై తమకు నమ్మకం లేదని బాధితులు చెబుతుండటంతో పూర్తిగా సీబీఐతోనే విచారణ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే మణిపూర్‌ పోలీసుల పాత్రను నామమాత్రం చేసి సీబీఐ అధికారులను ఎక్కువమందిని ఇందులో చేర్చారు. తద్వారా దర్యాప్తులో పక్షపాతం లేకుండా సీబీఐ చర్యలు చేపట్టింది.

కాగా హింసకు సంబంధించి ఇప్పటికే సీబీఐ ఎనిమిది కేసులు నమోదు చేసింది. ఇందులో రెండు కేసులు మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసుకు సంబంధించినవి. అలాగే హింసాకాండకు సంబంధించి మరో తొమ్మిది కేసులను దర్యాప్తు చేసేందుకు సీబీఐ రెడీగా ఉంది. మొత్తం మీద 17 కేసులను సీబీఐ అధికారులు విచారించనున్నారు.

Tags:    

Similar News