సీఎం, డిప్యూటీ సీఎం ఓకే.. మ‌రి నేత‌ల సంగ‌తేంటి? సోష‌ల్ మీడియా దుమారం

కానీ వారిద్దరూ నిజాయితీగా ఉన్నంత మాత్రాన క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులను పట్టించుకోరా? అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశ్నలు కురుస్తున్నాయి.

Update: 2024-10-20 06:30 GMT

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు నిజాయితీగా ఉంటే సరిపోతుందా? ఇదీ ఇప్పుడు మేధావులు అడుగుతున్న ప్రశ్న. సోషల్ మీడియాలో గడిచిన వారం రోజులుగా ఇదే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కూటమి సర్కారు అవినీతి పాలనకు వ్యతిరేకమంటూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో అనేక అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు, అదే విధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ నిజాయితీగా ఉంటున్నారు అనడంలో సందేహం లేదని అంటున్నారు.

కానీ వారిద్దరూ నిజాయితీగా ఉన్నంత మాత్రాన క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులను పట్టించుకోరా? అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశ్నలు కురుస్తున్నాయి. అనేక జిల్లాల్లో ఇటు టిడిపి అటు జనసేన నాయకులు కూడా చెలరేగిపోతున్నారనేది సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి తెలుస్తోంది. తిరుపతి నియోజకవర్గం ఎమ్మెల్యేగా జనసేన పార్టీ నాయకుడు ఆరణి శ్రీనివాసులు వ్యవహరిస్తున్నారు. కానీ మద్యం దరఖాస్తులను చూస్తే తిరుపతి నియోజకవర్గంలో 122 దుకాణాలకు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చేందుకు సిద్ధపడితే అక్కడ పడిన దరఖాస్తులు 530 మాత్రమే.

దీనిలోనూ చాలామంది సిండికేట్ అయ్యారు అనేది స్థానికంగా వస్తున్న విమర్శలు. ఇక్కడ ఎవరి ప్రమేయం ఉందనేది బహిరంగంగానే చెబుతున్నారు. కాబట్టి ఇది అవినీతి కాదా? ఇక్కడ వాటాలు వేసుకుని కూటమి నాయకులు పంచుకోవడం లేదా? అనేది సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట. అదేవిధంగా అమలాపురం, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, విజయవాడ, ఒంగోలు తదితర ప్రాంతాల్లో కూడా టిడిపి నాయకుల హవా ఎక్కువగానే కనిపిస్తోంది. ప్రైవేటు మద్యం వ్యాపారులు దక్కించుకున్న లైసెన్సులను కూడా తమకు ఇచ్చేయాలంటూ తమ్ముళ్లు ఒత్తిడి చేస్తున్నారు.

ఇది అంతిమంగా పార్టీపై ప్రభావం చూపుతుంది అనేది నాయకులు చెబుతున్న మాట. ఇది అవినీతికి దారి తీయడం కాదా అన్నది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. ఈ నేపథ్యంలో పై స్థాయిలో ఉన్నటువంటి సీఎం డిప్యూటీ, సీఎంలు మంచివారే అయినా క్షేత్రస్థాయిలో నాయకులు చేస్తున్న దూకుడు కారణంగా వారు కూడా అభాసులయ్యే అవకాశం ఉందన్నది మేధావులు చెబుతున్నారు. మ‌రి చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు చ‌ర్య‌లు చేప‌డ‌తారా? నాయ‌కుల‌ను కంట్రోల్ చేస్తారా? అన్న‌ది చూడాలి. తాజాగా కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ అవినీతిని స‌హించ‌బోమ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News