వాటికి పడిపోను అంటున్న బాబు...ఇంతకీ అవేంటి ?

లేటెస్ట్ గా ఢిల్లీలో హిందూస్థాన్ టైంస్ నిర్వహించిన నాయకత్వ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ తన ఓటమికి గల కారణాలు చెప్పేశారు.

Update: 2024-11-17 22:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలియని రాజకీయం లేదు. ఆయన ముందుగానే అన్నీ అంచనా వేసుకుంటారు. ఆయన ఆలోచనలు చాలా ముందుంటాయి. ఒక్కోసారి అవే ఆయన ముందర కాళ్ళకు బంధం వేస్తాయేమో తెలియదు. అంతే కాదు బాబు ఆలోచనలు కూడా జనానికి కనెక్ట్ కాకపోవడం వల్ల ఓడిన సందర్భాలు ఉన్నాయని అంటారు.

ఇదిలా ఉంటే 2014 నుంచి 2019 దాకా స్వర్ణాంధ్ర ప్రదేశ్ కోసం చంద్రబాబు ఎంతో కృషి చేశారు అని టీడీపీ వర్గాలు చెబుతాయి. చంద్రబాబు సైతం అటు సంక్షేమం ఇటు అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేశాను అని చెబుతూ వచ్చారు. తీరా చూస్తే 2019 ఎన్నికల్లో దారుణమైన ఓటమి టీడీపీని వరించింది. ఏకంగా 23 సీట్లకు ఆ పార్టీ పడిపోయింది.

ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదు అని నాడు బాబు సహా టీడీపీ నేతలు అంటూ వచ్చారు. ఇక బాబు ఓటమి పాలు అయ్యాక చాలా మంది మహిళలు ఆయనను పరామర్శించారు. వారంతా ఎందుకు ఓటమి వచ్చింది బాబుకు అని కూడా అన్నారు. బాబు అనేక సందర్భాలలో ఎందుకు ఓటమి పాలు అయ్యాను అని జనం వద్దనే చెప్పుకునేవారు.

అయితే బాబుకు తాజాగా ఎందుకు ఓటమి పాలు అయ్యానో అర్ధం అయింది అంటున్నారు. అంతే కాదు 2004, 2009 ఎన్నికల్లో కూడా ఎందుకు ఓటమి పాలు అయ్యానో కూడా అర్ధం అయింది అని అంటున్నారు. లేటెస్ట్ గా ఢిల్లీలో హిందూస్థాన్ టైంస్ నిర్వహించిన నాయకత్వ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ తన ఓటమికి గల కారణాలు చెప్పేశారు. తాను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా పొగడ్తలకు పడిపోయాను అని అందుకే ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యానని తన మీద తాను జరుపుకున్న నిఖార్సైన విశ్లేషణను వినిపించారు. అలాగే ప్రజలను నిర్లక్ష్యం కూడా కొంత చేసినట్లుగా కూడా ఒప్పుకున్నారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు మొహమాటస్తుడు అని అంటారు. ఆయన వద్దకు వెళ్ళి ఎవరైనా పదవుల విషయంలో కానీ ఏదైనా హామీ కానీ తీసుకుంటే ఆయన వారికి అవకాశాలు ఇచ్చేవారు. అలా బాబు చాలా మందిని తన చుట్టూ ఉంచుకునే వారు. వారంతా బాబుని పొగుడుతూ వచ్చారు. అలా గ్రౌండ్ రియాల్టీస్ బాబుకు తెలియకుండా పోయాయని కూడా అప్పట్లో అనుకున్నారు.

మనకేమి తిరుగులేదు అని చెప్పేవారు ఎక్కువ కావడం భజన బృందాలు చుట్టూ ఉండడం వల్లనే చంద్రబాబుకు ఓటములు వచ్చాయని కూడా విశ్లేషణలు ఉన్నాయి. ఇపుడు బాబు ఆ విషయాలను బాగా గ్రహించారు అని అంటున్నారు. ఆయన ఆచరణలో కూడా వాటిని అమలు చేసి చూపించారు.

ఆయన 2024 ఎన్నికల్లో టికెట్ల పమిణీ నుంచి మంత్రివర్గ విస్తరణ విషయంలోనూ మొహమాటాలకు ఈసారి తెర తీసేసారు అని చెబుతారు. అంతే కాదు నామినేటెడ్ పదవులు కూడా ఆయన చాలా జాగ్రత్తగా అన్నీ చూసి ఎంపిక చేయడం ద్వారా పార్టీలో కొత్త నాయకత్వాన్ని పెంచుతున్నారు.

ఇక బాబు 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి భారీ ఓటమిని మూటకట్టుకున్నారు. 2019లో బీజేపీని ఎన్డీయేను వీడి మరో తప్పు చేశారు అని చెబుతారు. ఈసారి అలా కాకుండా బాబు అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాబు రాజకీయ జీవితంలో ఒకసారి గెలిస్తే మళ్లీ గెలవరు అన్న పేరు ఉంది. ఈసారి దానిని బద్ధలు కొట్టి కొత్త రికార్డుని ఆయన నెలకొల్పాలని పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. ఈసారి పొగడ్తలకు కూడా పడిపోను అని బాబు అంటున్నారు. సో బాబు వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిస్తే మాత్రం ఆయన తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నట్లే అని అంటున్నారు.

Tags:    

Similar News