జగన్ వర్సెస్ బాబు పవన్ : లక్షతో కొట్టెదెవరు ?
ఈసారి ఎన్నికల్లో చిత్రమైన మాట వినిపిస్తోంది. అత్యధిక ఓట్ల తేడాతో గెలుపు కాకుండా లక్ష మెజారిటీకి ఒక్క ఓటు తక్కువ పడకూడదు అని పట్టుబట్టి కూర్చున్నారు.
ఈసారి ఎన్నికల్లో చిత్రమైన మాట వినిపిస్తోంది. అత్యధిక ఓట్ల తేడాతో గెలుపు కాకుండా లక్ష మెజారిటీకి ఒక్క ఓటు తక్కువ పడకూడదు అని పట్టుబట్టి కూర్చున్నారు. ఎవరు మొదలెట్టారో తెలియదు కానీ ప్రధాన పార్టీల అధినేతలు అందరిదీ ఒక్కటే టార్గెట్ గా ఉంది. లక్ష మెజారిటీ సాధించడమే ఆ లక్ష్యం.
లక్ష మెజారిటీ రావాలంటే ఎలా సాధ్యం అన్నది చూడాల్సి ఉంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు లక్షలకు పైగానే ఓట్లు ఉంటాయి. ఇందులో లక్షా ఎనభై వేల దాకా ఓట్లు పోల్ అయినా అందులో లక్ష మెజారిటీ దక్కడమంటే ప్రత్యర్ధి పార్టీకి ఏ ఏ ముప్పయి నలభై వేల ఓట్లు మాత్రమే రావాలి.అంటే మొత్తం పోల్ అయిన ఓట్లలో అత్యధిక శాతం ఒకరికే రావాలి ప్రత్యర్ధి పోటీ నామమత్రంగా ఉండాలి.
అది అసలు వీలు అవుతుందా. అంటే ఒక్కసారి ఏపీలోని ప్రధాన పార్టీల అధినేతలు పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లాల్సిందే. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోటీ చేస్తున్న పులివెందులలో ఈసారి లక్ష మెజారిటీ తగ్గకుండా వస్తుందని ఆయన సతీమణి భారతి ధీమాగా చెప్పారు.
ఆమె తన భర్త తరఫున ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. పులివెందులను ఆమె చుట్టేస్తున్నారు. ఇదిలా ఉంటే పులివెందులలో జగన్ 2019లో తొంబై వేల పై దాటి మెజారిటీ వచ్చింది. ఈసారి ముఖ్యమంత్రిగా మరో పదివేలు అదనంగా ఓట్లు యాడ్ అవుతాయని ఆమె అంటున్నారు. మరి రాజకీయం చూస్తే అలా ఉందా అంటే పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు మీద దుమారం రేపుతున్నాయి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు.
జగన్ సొంత చెల్లెలు షర్మిల కడప ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. పులివెందులలో టీడీపీ నుంచి బీ టెచ్ రవి పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సతీష్ రెడ్డి ఈసారి వైసీపీలో ఉన్నారు. ఇక బీ టెక్ రవి సత్తా చాటుతామని అంటున్నారు. ఈసారి జగన్ మెజారిటీ వీలైనంత వరకూ తగ్గించాలని టీడీపీ చూస్తోంది. మరి లక్ష ఓట్లు కనుక జగన్ కి దక్కితే మాత్రం రికార్డు క్రియేట్ చేసినట్లే అంటున్నారు.
మాజీ సీఎం చంద్రబాబు కుప్పం తీసుకుంటే ఈసారి లక్ష మెజారిటీ అని చంద్రబాబు కూడా చెబుతున్నారు. అయితే గత కొన్ని ఎన్నికల నుంచి ఆయన మెజారిటీ తగ్గుతూ వస్తోంది. ఆయన ఈసారి ఎనిమిదవ సారి పోటీలో ఉన్నారు. అయితే కుప్పంలో రెండున్నర లక్షల ఓట్లలో లక్ష మెజారిటీ టీడీపీదే అంటే వైసీపీ పోటీ నామమాత్రం కావాలి. కానీ లోకల్ బాడీ ఎన్నికల నుంచి అక్కడ వైసీపీ గట్టి పడింది అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
దానికి తోడు బీసీ అభ్యర్ధిగా ఉన్న భరత్ ని వైసీపీ పోటీకి నిలబెట్టింది. ఆయన సామాజిక వర్గం ఓట్లు డెబ్బై వేల దాకా ఉన్నాయి. అలాగే మొత్తం ఓట్లలో బీసీ ఓట్లు లక్షన్నరకు పైగా ఉన్నాయి. దీంతో బీసీ కార్డు వైసీపీ తీసింది. బీసీల కోటలో ఓసీల పోటీ అంటోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ చంద్రబాబుని ఓడించాలని పట్టుదల మీద ఉన్నారు.
మరో వైపు టీడీపీ తరఫున ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మొత్తం తాను అయి చూసుకుంటున్నారు. ఆయన లక్ష ఓట్ల మెజారిటీని టీడీపీకి తీసుకుని వస్తామని అంటున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా కుప్పంలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబుకు లక్ష ఓట్లు వస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది.
మరో హాట్ సీటు పిఠాపురం ఉంది. అక్కడ లక్ష ఓట్లు పవన్ కి అని అంటున్నారు జనసేన నేతలు. ఇక్కడ మొత్తం ఓటర్లు రెండు లక్షల ముప్పయి ఆరు వేల మంది దాకా ఉన్నారు. కచ్చితంగా పోల్ అయ్యేవి లక్షా ఎనభై వేల దాకా అని లెక్క వేస్తున్నారు. ఇందులో పవన్ కే లక్షా ముప్పయి వేల దాకా వస్తాయా అన్న చర్చ అయితే ఉంది.
కాపులు డెబ్బై వేల ఓట్లు పవన్ కే అని టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వర్మ అంటున్నారు. నాగబాబు అయితే పిఠాపురంలో పీట వేసుకుని మరీ కూర్చుని ఎన్నికల వ్యూహాలను రూపకల్పన చేస్తున్నారు. మరో వైపు చూస్తే వైసీపీ నుంచి బలమైన నేత వంగా గీత ఉన్నారు. ఆమె సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు.
ఆమె తరఫున వైసీపీ అతి పెద్ద మోహరింపునే చేస్తోంది. ప్రతీ మండలానికీ సీనియర్ నేతలను ఉంచి మరీ ఎన్నికల వ్యూహ రచన చేస్తోంది. ఇక కాపు పెద్ద ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురంలో మకాం వేసి మరీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇక్కడ పవన్ కి లక్ష మెజారిటీ వస్తే వార్ వన్ సైడ్ అయినట్లే. ఆ పరిస్థితి ఉందా లేదా అన్నది చూడాల్సి ఉంది.