మారిన సీన్.. పవన్ ఇంటికి వెళ్లి 2.30 గంటలున్న చంద్రబాబు!

పవన్ కల్యాణ్.. ఏపీ విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లటం.. అప్పటి తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరపటం తెలిసిందే.

Update: 2023-12-18 04:26 GMT

ఏపీ రాజకీయాలకు సంబంధించిన కీలక భేటీ హైదరాబాద్ లో చోటు చేసుకుంది. గడిచిన కొన్నిసార్లుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లటం.. అప్పటి తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరపటం తెలిసిందే. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరమన్న సామెతకు తగ్గట్లే.. తరచూ తన ఇంటికి వచ్చే పవన్ నివాసానికి తాజాగా చంద్రబాబే వెళ్లటం ఒక ఎత్తు.. దాదాపు రెండున్నర గంటల పాటు అక్కడే ఉండి.. తాజా రాజకీయ పరిణామాలు మాత్రమే కాదు.. ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన సుదీర్ఘ చర్చ వారిద్దరి మధ్య చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

పవన్ - బాబు భేటీ ముగిసిన తర్వాత జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజకీయాలు, ఇరు పార్టీలు సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై చర్చలు సంతృప్తికరంగా సాగాయి. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి వ్యూహాలు, మేనిఫెస్టోతో ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే అంశాల పైన చర్చలు సాగాయి. భవిష్యత్తు కార్యాచరణ పై ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ ప్రణాళిక గురించి మాట్లాడుకున్నాం. పూర్తి సమన్వయంతో వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ ను ఎలా సాధించాలి అన్నదాని పైన చర్చలు సాగాయి" అంటూ వ్యాఖ్యానించారు.

ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల సమయం కూడా లేని నేపథ్యంలో.. ఇరు పార్టీల మధ్య పొత్తు.. సీట్ల సర్దుబాటుకు సంబంధించిన కసరత్తును మొదలుపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పాలి. ఇటీవలచోటు చేసుకున్న పరిణామాలతో ఇరువురు అధినేతలు ఒక చోట కూర్చొని కుదుటుగా మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. తాజాగాజరిగిన భేటీ.. రానున్న రోజుల్లో జరిగే సమావేశాలకు కీలకంగా మారుతుందంటున్నారు.

ఇప్పటివరకు చంద్రబాబు ఇంటికి పలుమార్లు పవన్ కల్యాణ్ వెళ్లగా.. పవన్ ఇంటికి చంద్రబాబు వచ్చింది లేదు. తాజాగా పవన్ ఇంటికి బాబు రావటంతో.. ఇరువురి మధ్య అరమరికలు లేని బంధం ఉందన్న విషయాన్ని అందరికి తెలిసేలా చంద్రబాబు చేశారని చెప్పాలి. ఇటీవల కాలంలో టీడీపీ - జనసేన మధ్య పొత్తును బ్రేక్ చేయటానికి ఎన్ని రకాల వాదనల్ని తెర మీదకు తీసుకొస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ చిన్న అవకాశం కూడా ప్రత్యర్థులకు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. అందులో భాగంగానే పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లినట్లుగా చెబుతున్నారు.

అనధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సీట్లకు సంబంధించిన ప్రాథమిక చర్చలు జరిగాయని చెబుతున్నారు. 40-42 వరకు అసెంబ్లీ సీట్లను పవన్ అడుగుతుంటే.. టీడీపీ మాత్రం 20-25 వరకు ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో ఐదు పార్లమెంటు స్థానాల్ని తమకు కేటాయించాల్సిందిగా పవన్ అడుగుతుంటే.. రెండు సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. అభ్యర్థుల ఎంపిక.. సీట్ల సర్దుబాటు లెక్కల్ని ఒక్క సమావేశంతో కాకుండా.. రానున్న రోజుల్లో జరిగే చర్చల ఆధారంగా.. సర్వే రిపోర్టులను పరిగణలోకి తీసుకొని పొత్తుల ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ భేటీలో ఎన్నికల ప్రచారాన్ని ఎలా నిర్వహించాలన్న దానిపైనా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News