ఫ్యాక్ట్ చెక్... విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తున్నారు!
ఎన్నికల సమయంలో కూటమి నేతలు విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కానివ్వమని గట్టిగా ఉపన్యాశాలు ఇచ్చారు;
'ఎన్నికల సమయంలో కూటమి నేతలు విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కానివ్వమని గట్టిగా ఉపన్యాశాలు ఇచ్చారు.. తీరా అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని పక్కనపెట్టేశారు.. నిన్నగాక మొన్న జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఈ విషయంపై పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. అంటే.. వీళ్లపై ప్రధాని మోడీ ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకొవచ్చు' అంటూ ఓ మీడియాలో కథనం ప్రచురితమైంది!
ఇదే సమయంలో... ‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం అంటూ కూటమి నేతలు ఇన్నాళ్లూ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని మరోమారు స్పష్టమైంది.. ఈ విషయంలో వెనకడుగు వేసేది లేదని, ప్రైవేటీకరణ అంశంలో తమ నిర్ణయంలో మార్పు లేదని, కేంద్రం మరోమారు స్పష్టం చేసింది.. అంటే ఈ కూటమి నేతలు ఓట్లకోసం జనాన్ని బురిడీ కొట్టించినట్లు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది’ అని వైసీపీ ఎక్స్ వేదికగా వెల్లడించింది.
అదే విధంగా... ‘చాపకింద నీరులా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ సాయం చేస్తున్నారని.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై క్లారిటీ కోసం పబ్లిక్ గ్రీవెన్స్ కు మాజీ ఉద్యోగి పాడి త్రినాథ్ లేఖ రాశారని.. ఆ లేఖపై స్పందిస్తూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో మార్పు లేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చిందని’ 'మరో పోస్ట్ లో తెలిపింది.
దీంతో... ఈ వ్యవహారంపై ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్’ స్పందించింది. ఇందులో భాగంగా... ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు విషప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని.. ఎన్డీయే ప్రభుత్వం శక్తివంచన లేకుండా విశాఖ ఉక్కు పరిరక్షణకు కృషి చేస్తోందని ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ఈ సందర్భంగా... విశాఖ ఉక్కును కేంద్రం అమ్మేస్తుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని చెప్పిన ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్... స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదని.. ఇప్పటికే కేంద్రమంత్రి దీనిపై స్పష్టత ఇచ్చారని.. విశాఖ ఉక్కు పునరుజ్జీనానికి కేంద్రం వేలకోట్ల ప్యాకేజీ ప్రకటించిందని.. ఎన్డీఏ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా విశాఖ ఉక్కు పరిరక్షణకు కృషి చేస్తోందని స్పష్టం చేసింది.