తమిళ నటుడు విజయ్‌కి కేంద్ర ఎన్నికల సంఘం గుడ్‌న్యూస్

మధ్యలో రౌండ్‌గా ఎరుపురంగులో లోపల శిరీష పుష్పం, చుట్టూ 28 నక్షత్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో ఐదు నీలం, మిగతావి పచ్చ రంగులో ఉన్నాయి.

Update: 2024-09-08 09:08 GMT

తమిళ సినిమాల్లో సక్సెస్ అయిన దళపతి విజయ్.. ఇటీవల రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఏదో ఒక పార్టీలో చేరకుండా.. ఆయనే సొంతంగా పార్టీని స్థాపించారు. తమిళగ వెట్రి కళగం (టివీకే) పేరిట పార్టీని ప్రకటించారు. దానికి సంబంధించిన పార్టీ జెండాను సైతం విడుదల చేశారు. ఇప్పుడు ఆయనకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

గత నెలలోనే విజయ్ తన పార్టీకి చెందిన జెండాను సైతం విడుదల చేసి ఆవిష్కరించారు. జెండాలో పైన, కింది భాగంగా ఎరుపు రంగు ఉండగా.. మధ్యలో పసుపు రంగు ఉంది. మధ్యలో రౌండ్‌గా ఎరుపురంగులో లోపల శిరీష పుష్పం, చుట్టూ 28 నక్షత్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో ఐదు నీలం, మిగతావి పచ్చ రంగులో ఉన్నాయి. శిరీష పుష్పానికి రెండు వైపులా ఏనుగు రూపాలు ఉన్నాయి.

‘తమిళగ వెట్రి కళగం’ని రాజకీయ పార్టీగా నమోదు చేయాలని ఫిబ్రవరి 2వ తేదీన భారత ఎన్నికల సంఘానికి విజయ్ దరఖాస్తు చేశాడు. దేశ ఎన్నికల సంఘం దీనిని చట్టబద్ధంగా పరిగణించి.. పార్టీగా ఆమోదించాలని అందులో విజ్ఞప్తి చేశారు. దాంతో ఆయన చేసిన అభ్యర్థనను కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. పోల్ ప్యానెల్‌కు చేసిన అభ్యర్థనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల్లో పాల్గొనవచ్చని సూచించింది.

ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. మొదటి విజయం సాధించామని, ఇక ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ మొదటి రాష్ట్ర స్థాయి సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన ఉంటుందన్నారు. ఇప్పటివరకు మన కోసం మనం శ్రమించామని, ఇకపై తమిళనాడు, తమిళుల ఉన్నతి కోసం శ్రమిద్దాం అంటూ పిలుపునిచ్చారు. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలో దిగడమే అని వెల్లడించారు.

Tags:    

Similar News