'మహా విజయం'.. మోడీ విజన్‌కు తార్కాణం: చంద్రబాబు
గతంలో ఎప్పుడూ ఇలా ఇంత పెద్ద ఎత్తున కూటములకు ప్రజలు మొగ్గు చూపిన ఎన్నికలు లేవు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయదుందుభి మోగించింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ కూటమి మహాయుతి 222 స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కింది. ఇది ఒకరకంగా ఆ రాష్ట్ర రాజకీయ ఎన్నికల చరిత్రలో అతి పెద్ద రికార్డు, చరిత్రాత్మకం కూడా. గతంలో ఎప్పుడూ ఇలా ఇంత పెద్ద ఎత్తున కూటములకు ప్రజలు మొగ్గు చూపిన ఎన్నికలు లేవు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం దక్కించుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేశారు. ఈ `మహా విజయం` ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజన్‌కు తార్కాణంగా పేర్కొన్నారు. ప్రజలకు ప్రధాని మోదీపై ఉన్న విశ్వాసాన్ని ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. ఆయన పట్ల ప్రజలకు విశ్వాసం కొనసాగుతోందని, దీనికి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చంద్రబాబు తెలిపారు.
ప్రజలపట్ల భక్తి, వ్యూహాత్మక దూర దృష్టి, నిఖార్సయిన, పారదర్శకమైన విధానాల అమలు ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఈ దేశాన్ని వికసిత భారత్ దిశగా నడిపిస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనికి ఎన్నికల ఫలితాలకు సంబంధిచిన ఓ స్క్రీన్ షాట్‌ను జోడించారు. ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహానికి ఈ ఎన్నికల ఫలితం తార్కాణమని పేర్కొన్నారు. బీజేపీకి, ఎన్డీయే మిత్రపక్షాలకు కూడా ఆయన అభినందనలు తెలిపారు.