సెప్టెంబరు 1.. ‘ఏపీ సీఎం’ చరిత్రలో మరుపురాని రోజు

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ దేశంలో ప్రస్తుతం అత్యంత సీనియర్ నాయకుడు ఎవరంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే అని చెప్పాలి.

Update: 2024-08-30 09:42 GMT

కాలం అన్నాక ఆగదు.. క్యాలెండర్ లో తేదీలు మారిపోతుంటాయి.. నెలలు గడిచిపోతుంటాయి.. సంవత్సరాలు కరిగిపోతుంటాయి.. తిరిగి వెనక్కు చూసుకోలేనంత వేగంగా కాలం పరిగెడుతుంటుంది.. ఈ క్షణాన్ని.. ఈ రోజును సద్వినియోగం చేసుకున్నవారే చరిత్రలో నిలిచిపోతారు. అలాంటివారే చరిత్రను తిరగరాస్తుంటారు. దీనినే టైమ్ విలువను గుర్తించడం అంటారు. ఇక ప్రతి ఒక్కరికి జీవితంలో మరుపురాని రోజు అంటూ ఉంటుంది. అది పుట్టిన రోజు, పెళ్లి రోజు, ప్రేమకు ఆమోద ముద్ర పడిన రోజు.. వీటిలో ఏదైనా కావొచ్చు.

నాటి ఏపీ సీఎం.. నేటి ఏపీ సీఎం

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ దేశంలో ప్రస్తుతం అత్యంత సీనియర్ నాయకుడు ఎవరంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే అని చెప్పాలి. ఈ విషయంలో సీనియర్లు ఒకరిద్దరు పోటీకి ఉన్నా.. చంద్రబాబు స్థాయి వారిది కాదు. ఎందుకంటే.. 46 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం ఆయనది. 28 ఏళ్లకే ఉమ్మడి ఏపీ వంటి రాష్ట్రానికి మంత్రి అయిన ఘనత. మహా నటుడు ఎన్టీఆర్ కు అల్లుడు అయిన ప్రత్యేకత. ఇక రాజకీయ జీవితానికి వస్తే చంద్రబాబుది చెరగని ముద్ర. ఎందుకంటే.. ఉమ్మడి ఏపీకి సీఎంగా రెండుసార్లు వరుసగా పనిచేసిన ఆయన.. విభజిత ఏపీకి కూడా రెండుసార్లు (విడివిడిగా) సీఎంగా పనిచేసిన నాయకుడిగా నిలిచిపోతారు.

దాదాపు 20 ఏళ్లు సీఎం

చంద్రబాబు ఉమ్మడి ఏపీకి 1995-2004 మధ్య వరకు సీఎంగా వ్యవహరించారు. అంటే.. దాదాపు 9 సంవత్సరాల 3 నెలలు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ టర్మ్ లలో రెండుసార్లు ఆయన పూర్తిస్థాయి ఐదేళ్లు సీఎంగా లేకపోవడం గమనార్హం. ఇక 2014-19 మధ్య పూర్తికాలం విభజిత ఏపీకి సీఎంగా వ్యవహరించారు. ప్రస్తుతం రెండోసారి 2024 జూన్ నుంచి సీఎంగా ఉన్నారు. ఈ విడతలో ఐదేళ్లు కలుపుకొంటే ఆయన మొత్తం మీద దాదాపు 20 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నట్లు లెక్క. తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ దక్కని రికార్డుగా దీనిని చెప్పుకోవచ్చు. ఇక ప్రతిపక్ష నేతగానూ చంద్రబాబు దాదాపు ఇంతే కాలం. 1989-94, 2004-14, 2019-24 మధ్యన 20 ఏళ్లకు పైగా ఆయన ప్రతిపక్ష నేతగా లేదా ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడిగా ఉన్నారు. బహుశా ఇది కూడా రికార్డనేమో?

తొలిసారిగా సెప్టెంబరు 1న

చంద్రబాబు జీవితంలో మరుపురాని రోజు అంటే.. సెప్టెంబరు 1 అనే చెప్పాలి. 1995లో ఆయన ఇదే రోజున ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి, తనకు పిల్లనిచ్చిన మామ అయిన ఎన్టీఆర్ తో విభేదించిన చంద్రబాబు మెజారిటీ టీడీపీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని

అధికారం చేపట్టారు. అలా 1995 సెప్టెంబరు 1న ఆయన ఉమ్మడి ఏపీకి తొలిసారి సీఎం అయ్యారు. 1999లోనూ గెలిచారు. అయితే, 2004, 2009లో ఓటమి పాలయ్యారు. విభజిత ఏపీకి 2014లో తొలి సీఎంగానూ ఎన్నికై ప్రత్యేకత చాటుకున్నారు. కాగా, 1995లో చంద్రబాబు తన మామ ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేయడంపై అనేక విమర్శలున్నాయి. ప్రతిపక్షాలు దీనిని వెన్నుపోటు అని అభివర్ణిస్తుంటే.. టీడీపీ మద్దతుదారులు మాత్రం పార్టీని రక్షించుకునేందుకు ఇంతకు మించిన మార్గం లేదని సమర్థిస్తుంటాయి.

Tags:    

Similar News