హైదరాబాద్ తో పోటీగా విశాఖ... బాబు మాస్టర్ ప్లాన్!
విశాఖపట్నాన్ని ఆర్ధిక రాజధానిగా చేయాలి అన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన.
విశాఖపట్నాన్ని ఆర్ధిక రాజధానిగా చేయాలి అన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన. ఆయన ఆ దిశగా విభజన ఏపీకి తొలి సీఎం గా అయిన నాటి నుంచి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. విశాఖ అభివృద్ధికి గ్రోత్ ఇంజన్ అని టీడీపీ కూటమి ప్రభుత్వం నమ్ముతోంది.
అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా చేస్తూనే విశాఖను కూడా ధీటుగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని గాడిన పెడుతున్నారు. రైల్వే జోన్ కి వచ్చే నెలలో శంకుస్థాపన చేస్తున్నారు.
అదే విధంగా భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రా సహా విశాఖ దశను మార్చే గేం చేంజర్ ని భావిస్తున్నారు. అలాగే మూలపేట ఎయిర్ పోర్టు పూర్తి చేయడంతో పాటు శ్రీకాకుళంలో మినీ ఎయిర్ పోర్టుని కూడా తీసుకుని వస్తే వెనకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి బాటన పడుతుందని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో సర్వీస్ సెక్టార్ గా ఉన్న ఐటీ పరిశ్రమలను విశాఖలో అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. అలాగే పారిశ్రామిక కేంద్రంగా మార్చాలన్నది ప్రణాళికగా ఉంది.
విశాఖ సిటీలో లో ప్రస్తుతం జనాభా ఇరవై ఆరు లక్షలుగా ఉంది. దానికి ఉత్తరాంధ్రా జిల్లాలతో అనుసంధనాం చేస్తూ కోటి జనాభాగా పెంచగలగాలని బాబు అధికారుల సమావేశంలో ఆదేశించారు. హైదరాబాద్ కి ధీటుగా విశాఖ ఎదగాలని ఆయన కోరుకున్నారు. ఈ రోజున హైదరాబాద్ కోటి మంది జనాభాతో ఉంది అంటే చుట్టు పక్కన ఉన్న ప్రాంతాలు అన్నీ హైదరాబాద్ లో కలిశాయి. అదే విధంగా విశాఖ వంటి మెగాసిటీలో ఇతర ప్రాంతాలు కనుక కలిస్తే కోటి జనాభాతో ఈ సిటీ కూడా ఏపీకి అద్భుతమైన నగరంగా మారుతుందని బాబు భావిస్తున్నారు అని అంటున్నారు
విశాఖను అభివృద్ధి చేసే విషయంలో అధికారులు తమ ఆలోచనలకు పదును పెట్టాలని రటన్ టాటా స్పూర్తితో పాటు బడా పారిశ్రామికవేత్త జీఎమ్మార్ సంస్థలను కూడా ఆదర్శంగా తీసుకుని విశాఖను నంబర్ వన్ గా చేయాలని కోరారు.
దీనిని బట్టి చూస్తే చంద్రబాబు ఏపీలోని అన్ని నగరాలను అభివృద్ధి చేయడంతో పాటు ఏపీకి వాటిని గ్రోత్ ఇంజన్లుగా వాడుకోవాలని చూస్తున్నారని అర్ధం అవుతోంది. రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి కాబట్టి అమరావతిని ఎంపిక చేసినా విశాఖ ప్రాముఖ్యతను కూడా విస్మరించకుండా అభివృద్ధి చేయడం ద్వారా ఏపీలో వీలైనన్ని మహా నగరాలను ఏర్పాటు చేసుకోవాలని తద్వారా ఏపీకి రానున్న కాలాలలో భారీగా ఆదాయం వస్తుందని బాబు భావిస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద బాబు మాస్టర్ ప్లాన్ ని చూసిన వారు అంతా విశాఖ దశ తిరిగినట్లే అని అంటున్నారు.