బాబు పాల‌న‌పై 'గ్రాఫిక్‌' టాక్‌.. ఇది పెద్ద డేంజ‌రే... !

చంద్ర‌బాబు పాలనపై సోషల్ మీడియాలో మళ్లీ పాత టాకే వినిపిస్తోంది. ఇది చిత్రంగా ఉన్నా వాస్తవం.

Update: 2024-10-21 13:30 GMT

చంద్ర‌బాబు పాలనపై సోషల్ మీడియాలో మళ్లీ పాత టాకే వినిపిస్తోంది. ఇది చిత్రంగా ఉన్నా వాస్తవం. 2015- 2018 మధ్య సోషల్ మీడియాలో చంద్రబాబు పరిపాలనపై ఒక విధమైన ప్రచారం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వం అంటే డిజిటల్ ప్రభుత్వమని, గ్రాఫిక్ ప్రభుత్వమ‌ని పెద్ద ఎత్తున విమర్శలు, వ్యాఖ్యలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు అవే వ్యాఖ్యలు, విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ చిత్రమేమిటంటే టిడిపికి మద్దతు పలికే కొందరు సామాజిక మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఇదే బాట పట్టడం!! ఇదే దారిలో చంద్రబాబు సర్కారం టార్గెట్ చేయడం గమనార్హం.

పోనీ ఇక్కడ ఏమన్నా ప్రతిపక్షం జోక్యం ఉందా అంటే లేదనే చెప్పాలి. బలంగా టిడిపిని ప్రచారం చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు.. ``మళ్లీ గ్రాఫిక్ బాట‌లో మా బాబు`` అని హెడ్డింగులు పెడుతూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. దీనికి కారణం ఇటీవల అమరావతి విషయంలో చంద్రబాబు మళ్లీ గ్రాఫిక్ లను తెరమీదకు తీసుకొచ్చారు. పాత పద్ధతిలోనే అమరావతి నిర్మాణాలు కొనసాగుతాయని ఐకాన్ టవర్లు వంటివి, అదేవిధంగా నవ నగరాలు వంటివి కూడా పాత పద్ధతిలోనే జరుగుతాయని చెబుతూ వ‌చ్చారు.

2017-18 మధ్య ప్రదర్శించినటువంటి వీడియోలు చూపించారు. ఇవి జోరుగా వైరల్ అయ్యాయి. ఈ పరిణామాలు నేపథ్యంలో ప్రస్తుతం మళ్ళీ సోషల్ మీడియాలో చంద్రబాబు గ్రాఫిక్ పాలన అంటూ కామెంట్లు రావడం గమనార్హం. అయితే దీన్ని వైసిపి చేసిందని మొదట్లో టిడిపి నాయకులు భావించారు. కానీ ఆ తర్వాత మాత్రం ఇది సొంత మీడియా నుంచే వచ్చిన ట్రోల్స్‌ అని గుర్తించడంతో వెనక్కి త‌గ్గారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇప్పుడు అటువంటి విధానాలను పక్కనపెట్టి వాస్తవమైనటువంటి రూపకల్పన దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందనేది పార్టీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.

గతంలో ఇలా చేసే వైసీపీకి ఆయుధం అందించారని అంటున్నారు. రాజధాని అమరావతిలో లేని నిర్మాణాలను గ్రాఫిక్స్ రూపంలో చూపించి ప్రతిపక్షానికి అవకాశం కల్పించి, ఏకంగా రాజధాని నిర్మాణాలే లేకుండా చేసేలాగా చేశారని వారు అంటున్నారు. దీంతో ప్రస్తుతం జరగబోయే నిర్మాణాల విషయంలో గ్రాఫిక్లను ప్రదర్శించడం మానేసి నిర్మాణాలకు సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలు ప్రసారం చేయడం ద్వారా ప్రజల్లో బలమైన సంకేతాలు పంపించాలనేది వారు చెబుతున్న సూచన. మరి చంద్రబాబు ఏం చేస్తారనేది చూడాలి.

Tags:    

Similar News