కూటమి పెద్దలూ వెయింటింగ్ ఇక్కడ అంటోంది మహిళా లోకం!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ అన్నవి ఎంతో కారణం అని చెప్పాలి.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ అన్నవి ఎంతో కారణం అని చెప్పాలి. ఎందుకంటే అప్పటికే వివిధ రకాలైన స్కీములను జగన్ ప్రభుత్వం ఠంచనుగా ఇస్తూ వస్తోంది. వాటిని అధిగమించాలి అంటే అంతకు మించి అన్నట్లుగా ఇస్తెనే తప్ప జనాలు తమ వైపు టర్న్ కారని భావించి సూపర్ సిక్స్ ని ప్రకటించారు.
నిజంగా ఇది ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవడానికి ఈ సూపర్ సిక్స్ హామీలు బ్రహ్మాస్త్రంగా పనిచేశాయి. అందులో చాలా పధకాలు మహిళల కోసమే ఉన్నాయి. ఇక అత్యంత ఆకర్షణీయంగా ఉన్న పధకం ఏదైనా వీటిలో ఉంది అంటే కేవలం 18 ఏళ్ళు వస్తే చాలు మహిళలకు అందరికీ నెలకు 1500 రూపాయలు ఇస్తామని ప్రకటించడం.
ఇది ఆడబిడ్డలకు సహాయం అన్నట్లుగా ప్రచారం చేశారు. ఈ లెక్కన మహిళల ఇంటికి నెలకు 1500 రూపాయలు వస్తాయి. అదే సంవత్సరానికి అయితే ఏకంగా 18000 రూపాయలు అవుతాయి. ఎన్నికల్లో ప్రచారం చేసినపుడు వైట్ కార్డుదారులు అని కూడా చెప్పలేదు. దాంతో అందరికీ వర్తిస్తుందని భావించారు.
ఇక 2024 ఎన్నికలలో ఓటర్ల జాబితా చూస్తే మొత్తం నాలుగు కోట్ల మంది ఓటర్లలో సగానికి సగం అంటే రెండు కోట్ల దాకా మహిళలు ఉన్నారు. మరి ఓటు హక్కునే ప్రమాణంగా తీసుకుంటే వీరంతా 18 ఏళ్ళు దాటిన వారే అవుతారు. ఆ విధంగా వీరందరికీ ఈ పధకం వర్తిస్తుంది అన్న మాట.
ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది. సూపర్ సిక్స్ లో ప్రభుత్వం రెండు పధకాలు ప్రకటించింది. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అంటూ ప్రకటించిన పధకం దీపావళి నుంచి అమలు అయింది. అలాగే సామాజిక పెన్షన్ పెంపు పధకం కూడా వర్తింపచేశారు.
కానీ ఆకర్షణీయమైన పధకాలను అలాగే ఉంచేశారు. ఇందులో మహిళలకు ఉచిత బస్సు పధకం ఒకటి అయితే నెలకు 1500 నగదు బదిలీ మరో పధకం. ఈ రెండింటిలో కూడా నెలకు 1500 రూపాయలు హ్యాపీగా ఖాతాలో పడతాయి అంటే ఎవరు వద్దు అంటారు. అందుకే మహిళా లోకం అంతా కళ్ళు కాయలు కాచేలా ఆ పధకం కోసం చూస్తున్నారు అని అంతటా ప్రచారం సాగింది.
అయితే లేటెస్ట్ గా సామాజిక మాధ్యమాలలో వచ్చిన ఒక పోస్టు ప్రభావంతో యావత్తు మహిళా లోకం అంతా నడుము బిగించి మరీ ఈ పధకం కోసం పోస్ట్ ఆఫీస్ ల మీద దండయాత్రకు మాదిరిగా వచ్చేశారు. అక్కడ సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేసుకుంటే జాతీయ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అనుసంధానం చేసుకుంటే ఇక నెలవారీ నగదు అలా ఖాతాలో పడుతుంది అన్న పోస్టులు చూసి వీరంతా అలా పోటెత్తారు అన్నమాట.
అయితే ఇది ఫేక్ పోస్టు అని తరువాత తెలిసింది. అయినా మహిళలు ఎక్కడా తగ్గడం లేదు. ఎందుకైనా మంచిది పోస్టాఫీసులలో అకౌంట్ ఉంటే డబ్బులు వేస్తారు అన్న నమ్మకంతో ఖాతాలు ఓపెన్ చేసి మరీ ఇంటికి వస్తున్నారు. దీంతో పోస్టాఫీసుల్లో సందడి చేస్తున్నాయి. వారికి ఖాతాలు బాగా పెరుగుతున్నాయి.
సరే ఇదంతా ఫేక్ పొస్టు అని అనుకున్నా మహిళల ఆసలు వారి ఆరాటాలు అయితే ఫేక్ కావు కదా అని అంటున్నారు. ఏపీలో మొత్తం మహిళలలో ఈ పధకం పట్ల ఎంతటి ఆశలు ఉన్నాయో ఇపుడు కళ్లారా కనిపిస్తోంది. ఆరు నెలలు అయింది అని ఉగ్గబట్టి ఉంటారు, ఇపుడు ఫేక్ న్యూస్ అయినా నిజమనుకుని పరుగులు తీస్తున్నారు అంటే ఈ పధకం కోసం మహిళా లోకం అంతా వెయిటింగ్ ఇక్కడ అన్న సంకేతాలను కూటమి పెద్దలకు పంపిస్తున్నారు అనే అనుకోవాలి.
ఈ క్యూ లైన్లు ఆరు నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి కోసం ఓటేసిన పోలింగ్ బూతులను తలపిస్తున్నాయి. సో ఈ పధకం విషయంలో ఇప్పటిదాకా అయితే కూటమి ప్రభుత్వ పెద్దలు అయితే ఎక్కడా మాట్లాడింది లేదు, ఆ మధ్య దాకా ఉచిత బస్సు గురించి మంత్రులు త్వరలో అదిగో ఇదిగో అని అన్నారు. కానీ ఈ పధకం విషయంలో అయితే ఏ ఒక్క అప్ డేట్ అయితే రాలేదు.
కానీ ఎన్నికల్లో ఇచ్చిన ఈ పెద్ద హామీ ఆకర్షణీయమైన హామీ జనాలకు బాగా గుర్తు ఉంది అనడానికే ఈ భారీ క్యూలు అని కూటమి పెద్దలు అర్ధం చేసుకోవాలని అంటున్నారు. సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చాల్సిన అవసరాన్ని కూడా మహిళాలోకం క్యూలు కడుతున్న తీరు స్పష్టం చేస్తోంది అని అంటున్నారు
అయితే ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లకు పెట్టిన మాదిరిగా కేవలం వైట్ కార్డు హోల్డర్స్ కి అని ఎవైనా షరతులు పెట్టి ఇస్తుందా లేక వేరే విధంగా నిబంధనలు పెట్టి ఇస్తుందా అన్నది కూడా చూడాలి. అవన్నీ పక్కన పెడితే ఈ పధకాన్ని కచ్చితంగా అమలు చేసి తీరాలన్నది మాత్రం పోస్టాఫీసులకు పోటెత్తిన మహిళా లోకం ఆకాంక్షలు తెలియచేస్తున్నారు. మరి ఖజానాలో చూస్తే డబ్బు లేదని అంటున్నారు.
మిగిలిన పధకాలు వేరు. ఈ పధకం వేరు. పైగా ఎంతలా లబ్దిదారులను తగ్గించినా కోటి మంది మాత్రం కచ్చితంగా మిగలడం ఖాయం. కోటి మందికి ఏడాదికి 18 వేల రూపాయలు అంటే ఖజానాకు పెను భారమే అవుతుంది. అలాగని ఈ పధకం గురించి జనాలు అడగలేదనో వదిలేద్దామో అనుకుంటే ఈ రోజు పోస్టాఫీసుల వద్ద కట్టిన క్యూలు రేపటి రోజున వేరే చోట కూడా కడితే అపుడే అసలైన ఇబ్బంది అని అంటున్నారు. సో కూటమి పెద్దలూ వెయింటింగ్ ఇక్కడ అంటోంది మహిళా లోకం.