బాబు జగన్ కలుస్తారా ? ఏపీకి ఇదే లాస్ట్ చాన్స్ !
ఏపీ విభజన తరువాత కునారిల్లింది. ఏపీ మళ్ళీ మామూలుగా మారాలంటే కేంద్ర సాయం తప్పనిసరి.
ఏపీ విభజన తరువాత కునారిల్లింది. ఏపీ మళ్ళీ మామూలుగా మారాలంటే కేంద్ర సాయం తప్పనిసరి. పదేళ్ల పాటు ఏపీని టీడీపీ వైసీపీ ఏలాయి. చంద్రబాబు జగన్ లకు విశాల హృదయంతో ప్రజలు అవకాశం ఇచ్చారు. ఎవరికీ అన్యాయం చేయలేదు. ఇపుడు మరోసారి చంద్రబాబుని సీఎం గా చేశారు. అంతమాత్రం చేత జగన్ ని తగ్గించినట్లు కాదు.
ఇక ఏపీకి అయిదేళ్ల పాటు సీఎం గా పనిచేసిన జగన్ కి అయిదు కోట్ల మంది ప్రజల బాధ్యత ఉంది. అలాగే 164 సీట్లతో కూటమి గద్దెనెక్కింది. దాని అధినాయకుడిగా చంద్రబాబుకు కూడా ఏపీని నవ శకం దిశగా నడిపించాల్సిన గురుతర బాధ్యత ఉంది. ఇక కూటమిలో ఉన్న జనసేన అధినేత పవన్ కూడా సరే సరి. ఈ బాధ్యతలో భాగస్వామిగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఇదంతా ఎందుకు అంటే ఏపీ ఇపుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అదేదో పాత సినిమాలో నూతన్ ప్రసాద్ చెప్పిన డైలాగ్ ఒకటి ఉంది దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని. అలాగే ఏపీ కూడా నిజంగానే ఉంది.
ఈ నేపధ్యంలో కేంద్రం ఏపీని ఆదుకోవాలి. కేంద్రంలో ఇప్పటికి రెండు సార్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం లో ఉంది కానీ ఏపీకి చేసిన సాయం పెద్దగా లేదు అన్న విమర్శలు ఉన్నాయి. గత రెండు టెర్ములు కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రావడంతో ఏపీని పట్టించుకోకపోయినా ఏమీ పరవాలేదు అనుకోవచ్చు.
కానీ ఈసారి అలా కానే కాదు ఏపీలో టీడీపీ జనసేన కలిపి 18 మంది ఎంపీల మద్దతు కేంద్రానికి ప్రాణ అవసరంగా ఉంది. ఈ మద్దతుతోనే కేంద్రం నిలబడింది. మూడవసారి మోడీ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ ఏపీకి కేంద్రం ఏమి చేస్తోంది అంటే ఉదారంగా అప్పులు ఇవ్వడమే అని సెటైర్లు పడుతున్నాయి.
ఏపీకి అప్పులు ఇచ్చి అదే మేము చేసిన మేలు అంటే ఎలా అని ఏపీ ప్రజలు అంటున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన మాదిగానే కేంద్ర పథకాలకు నిధులు ఇచ్చి ఏపీకి ఏదో చేశామని తెగ ఊదరగొడుతున్నారు. కానీ ఏపీలోని రాజధానికి స్పెషల్ గ్రాంట్ ఇవ్వలేదు. తాజా కేంద్ర బడ్జెట్ లోనూ ప్రపంచ బ్యాంక్ రుణం అని చెబుతున్నారు.
అలాగే పోలవరం నిధులు ఎన్ని ఇస్తారో కూడా ఇదమిద్దంగా తేల్చలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడానికి ఏపీలో రాజకీయం కూడా కారణం అని అంటున్నారు. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నా వైసీపీ అధికారంలో ఉన్నా రెండు పార్టీలు తమలో తాము కలహించుకుని కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ వస్తునాయి.
అలా ఏపీ ప్రయోజనాల మీద కలసికట్టుగా డిమాండ్ చేయడం అన్నది మరచి పోతున్నాయి. ఈ రోజున చూసుకున్నా 11 మంది వైసీపీ ఎంపీలు రాజ్యసభలో బీజేపీకి ప్రాణ అవసరంగా ఉన్నారు. అంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నా ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు చట్టం కావాలన్నా టీడీపీ వైసీపీ జనసేనల మద్దతు ఎంత అవసరమో అందరికీ అర్ధం అవుతోంది.
అయినా సరే కేంద్రం ఏపీకి ఏమీ చేయకుండా ఈ విధంగా వ్యవహరించడం అంటే అది పూర్తిగా ఏపీలోని రాజకీయ పార్టీల తప్పిదమే అవుతుందని అంటున్నారు. బాబుని నాలుగు సార్లు, జగన్ ని ఒకసారి సీఎంలుగా చేసిన ఏపీ ప్రజల పట్ల వారు కృతజ్ఞతగా ఉండి కేంద్రం మీద కలసికట్టుగా పోరాడాలని అంటున్నారు.
ఏపీని ఆదుకోకపోతే మా మద్దతు ఉండదని ఈ రెండు పార్టీలు ఒకే స్వరంతో ఖరాఖండీగా చెబితేనే తప్ప కేంద్రం దిగి రాదు అని అంటున్నారు. ఏపీ ఇప్పటికే చాలా నష్టపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది లాస్ట్ చాన్స్. ఈ అయిదేళ్లలో ఏపీని బాగు చేసుకోకపోయినా కేంద్రం ఏపీ మీద దయ చూపకపోయినా ఏపీ సంక్లిష్ట సమస్యల నుంచి సంక్షోభం దిశగా ప్రయాణించడం ఖాయమని అంటున్నారు.
అందుకే కేంద్రాన్ని చంద్రబాబు జగన్ పవన్ ముగ్గురూ కేవలం ఏపీ ప్రయోజనాలే అజెండాగా చేసుకుని నిలదీయాలని అంతా కోరుతున్నారు. ఈ విషయంలో అంతా ఒక్కటిగా ఉండాలని తమిళనాడుని స్పూరిగా తీసుకోవాలని కోరుతున్నారు.