చంద్రబాబుకు గుండె సమస్య!

స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో అరెస్టు అయిన టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ పై విడుదలయిన సంగతి తెలిసిందే

Update: 2023-11-15 11:30 GMT

స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో అరెస్టు అయిన టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ పై విడుదలయిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో ఆయనకు ఏపీ హైకోర్టు బెయిల్‌ ఇచ్చింది. కంటికి ఆపరేషన్‌ చేయించుకున్న ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.

కాగా ఆయనకు పూర్తి స్థాయి బెయిల్‌ పై ఏపీ హైకోర్టులో నవంబర్‌ 15న విచారణ సాగింది. ఈ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాదులు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి కోర్టుకు వివరించారు. చంద్రబాబు కంటి ఆపరేషన్, ఆరోగ్య పరిస్థితి వివరాలను హైకోర్టుకు సమర్పించారు.

చంద్రబాబు కుడి కంటికి శస్త్రచికిత్స నిర్వహించారని కోర్టుకు నివేదించారు. ఆయన కోలుకోవడానికి తప్పనిసరిగా మందులు వాడాల్సి ఉంటుందన్నారు. ఐదు వారాల పాటు ఐ చెకప్‌ కోసం షెడ్యూల్‌ ఇచ్చారని తెలిపారు. కంటికి 5 వారాల పాటు ఇన్‌ట్రా ఆక్యులర్‌ ప్రెజర్‌ చెక్‌ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. 5 వారాల పాటు కంట్లో చుక్కల మందులు వేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు.

అలాగే చంద్రబాబు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని న్యాయవాదులు హైకోర్టుకు నివేదించారుు. ఆయన గుండె పరిమాణం పెరిగిందన్నారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో సమస్యలున్నాయని వెల్లడించారు. మధుమేహం అదుపులో ఉన్నా జాగ్రత్తలు పాటించాల్సి ఉందన్నారు. ఈ మేరకు ఆయనకు తగినంత విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించిన నివేదికను కోర్టుకు అందించారు. ఈ నేపథ్యంలో మిగిలిన వాదనలు నవంబర్‌ 16న వింటామని ధర్మాసనం తెలిపింది.

కాగా చంద్రబాబు ఆరోగ్యం చాలా రిస్కులో ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆయనకు గుండె సమస్య ఉందని అంటున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ అశ్వినీ ఎలర్జీ సెంటర్‌ కు చెందిన ప్రముఖ ఎలర్జీ చికిత్స నిపుణుడు, ఎలర్జీ ఆస్థమా నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ వ్యాకరణం నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు.

చంద్రబాబు వయసు ప్రస్తుతం 73 ఏళ్లని.. ఈ వయసులో మిగతావారితో పోలిస్తే వ్యాధినిరోధక శక్తి తక్కువ ఉంటుందని వ్యాకరణం నాగేశ్వరరావు వెల్లడించారు. ఇలాంటివారు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వారు తీసుకునే ఆహారంతోపాటు చుట్టూ పరిసరాల ప్రభావం కూడా ఉంటుందని చెప్పారు.

ఎక్కువ వెలుతురు, గాలి, వేడి వాతావరణంలో ఉండేచోట ఉంటే.. దాని ప్రభావం వ్యాధినిరోధక శక్తిపై పడుతుందని వ్యాకరణం నాగేశ్వరరావు వెల్లడించారు. ఫలితంగా కొత్త రోగాలు తలెత్తుతున్నాయన్నారు. వైరల్, ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ దాడి చేస్తాయని తెలిపారు. అలాగే ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉందన్నారు. దీన్ని శరీరం, ముఖంపై దద్దుర్లో... ఇంకో సమస్యగానో చూడకూడదని చెప్పారు. ఇప్పటికే చంద్రబాబుకు ఆటో ఇమ్యూన్‌ సమస్య ఉందని తెలిపారు. ఇలాంటి ఒత్తిడి వాతావరణంతో ఈ సమస్య మరింత పేట్రేగే ప్రమాదం ఉందని ఆయన వివరించారు.

చంద్రబాబు గుండె, మూత్రపిండాలు, మెదడు ఆరోగ్యాన్ని తీవ్రస్థాయిలో దెబ్బతీసే ప్రమాదం ఉందని వ్యాకరణం నాగేశ్వరరావు వెల్లడించారు. అలాగే డీహైడ్రేషన్‌ సమస్య చాలా తీవ్రమైందన్నారు. చర్మం ఎండిపోయి... శరీరంలో కీలకమైన మూలకాల స్థాయులు పడిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. అలాగే పెద్ద వయసు వారిలో విటమిన్‌ డి3 అంతంతమాత్రంగా ఉంటుందని గుర్తు చేశారు. కొన్నిరోజులు సూర్యకాంతి పడకపోతే సమస్య మరింత పెరుగుతుందని.. అప్పుడు విపరీతమైన ఎలర్జీలు రావడానికి ఆస్కారం ఉంటుందన్నారు.

చంద్రబాబు ఒత్తిడిలో కొనసాగితే ఆటో ఇమ్యూనిటీ, ఎలర్జీ పెరిగి యాంజియో ఎడిమాకు దారితీస్తుందని అంటున్నారు. దీని ఫలితంగా శరీరమంతా ఎర్రగా మారిపోయి పెదవులు, ముఖం, కళ్లు, పాదాలు వాస్తాయని చెబుతున్నారు. ఒక్కోసారి స్పృహ కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుందన్నారు. పైపైన మందులతో సరిపెడితే ప్రాణాపాయ పరిస్థితి తలెత్తవచ్చని పేర్కొంటున్నారు.

చంద్రబాబు ఇప్పుడున్న పరిస్థితిలో వైద్యుల పర్యవేక్షణ... ఏవో మందులు ఇవ్వడంతో సరిపెట్టకూడదని తెలిపారు. వెంటనే చంద్రబాబును ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఆయన శరీరంలో ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైట్లు, సోడియం, విటమిన్‌ డీ3, సి అన్ని స్థాయిలను తక్షణం పరీక్షించాల్సి ఉంటుందన్నారు. ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చిన వ్యక్తిని అదే గదిలో కొనసాగించడం ప్రమాదమేనన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే చంద్రబాబును ఆసుపత్రిలో చేర్పించాలని వ్యాకరణం నాగేశ్వరరావు సూచించారు. ఆయన్ను ఆసుపత్రిలో ఉంచి అన్ని రకాల పరీక్షలు చేస్తే... ఇంకా ఏయే సమస్యలు ఉన్నాయో బయటపడే అవకాశం ఉందన్నారు. చంద్రబాబును ఇదే పరిస్థితిలో వదిలేస్తే ఆటో ఇమ్యూన్‌ సమస్య పెరిగి మెదడు, గుండెపై ప్రభావం పడుతుందని వెల్లడించారు.

Tags:    

Similar News