కక్ష సాధింపు చర్యలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!
అవును... ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు చంద్రబాబు.
ఏపీలో కూటమి అధికారంలోకి రావడం ఒకెత్తు అయితే... గతంలో ఎప్పుడూ గెలవని స్థానాల్లో సైతం వారిని ప్రజలు గెలిపించారు. అంటే... ఇది చంద్రబాబు & కో పై ప్రజలు పెట్టుకున్న భారీ నమ్మకంగానే చూడాలి! ఈ సమయంలో.. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఇకపై బారికేడ్లు ఉండకూడదని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు చంద్రబాబు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు బూత్ స్థాయి కార్యకర్తలు సైతం పాల్గొన్న ఈ టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా కిందిస్థాయి నుంచి ఎవరు ఎక్కడ ఎలా పార్టీ కొసం పనిచేశారో వారికే పదవులు దక్కేలా అధ్యయనం ప్రారంభించామని అన్నారు. నేతలు - కార్యకర్తల మధ్య సాధికారతే పార్టీకి బలమైన పునాది అని తెలిపారు.
ఈ సందర్భంగా కార్యకర్తలకు, నేతలకు పలు హామీలు ఇచ్చారు చంద్రబాబు. ఇందులో భాగంగా... మూతపడ్డ అన్న క్యాంటిన్లు వందరోజుల్లో తెరిపించే కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఇదే సమయంలో... పార్టీ కోసం కష్టపడిన వారి కోసం త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు.
ప్రధానంగా గత 20 ఏళ్లలో ఎప్పుడూ గెలవని సీట్లలో కూడా ప్రజలు టీడీపీని గెలిపించి, అధికారం కట్టబెట్టారంటే అది వారు మనపై పెట్టుకున్న నమ్మకమని.. అది కాపాడు కోవాలని తెలిపారు. ఇదే సమయంలో కూటమికి 93% స్ట్రైక్ రేట్, 57% పైగా ఓట్లు వచ్చాయనే విషయని.. ఇంతటి ఘనవిజయానికి కారణమైన ప్రతీ కార్యకర్త రుణం తీర్చుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయంటూ గత కొన్ని రోజులుగా ఇష్యూ వైరల్ అవుతున్న వేళ ఆ విషయాలపైన స్పందించారు బాబు. ఇందులో భాగంగా.. అధికారం ఉందని కక్ష సాధింపులు చేయవద్దని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టవద్దని సూచించారు. అంతా బాధ్యతగా, చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజలు మళ్లీ అవకాశం ఇస్తారని తెలిపారు.