బాబు లాస్ట్ పంచ్ : జగన్ ని దించకపోతే .....!?

ఈ కూటమి ఏపీలో జగన్ ని గెలుస్తుందా అధికారం సంపాదిస్తుందా అంటే అది జనాలు డిసైడ్ చేయాల్సిన విషయం

Update: 2024-03-09 13:57 GMT

రాజకీయంగా చంద్రబాబు వేస్తున్న చివరి పాచికగా బీజేపీతో మరోసారి పొత్తుని అనుకోవాలి. బాబు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవంతో ముచ్చటగా మూడవసారి బీజేపీతో పొత్తుని కుదుర్చుకోగలిగారు. చంద్రబాబు బీజేపీ ప్లస్ పవన్ కళ్యాణ్ ఇలా ఒక కూటమిని అయితే క్రియేట్ చేయగలిగారు. ఈ కూటమి ఏపీలో జగన్ ని గెలుస్తుందా అధికారం సంపాదిస్తుందా అంటే అది జనాలు డిసైడ్ చేయాల్సిన విషయం.

అయితే బాబు తన వంతు ప్రయత్నంగా ఇది చేశారు అనుకోవాలి. ఆయన ఎటు నుంచి ఎటు తిరిగినా తనదైన రాజకీయ వ్యూహాలు ఇవే అన్నది కూడా స్పష్టం అవుతోంది. బీజేపీతో బాబు పొత్తు కుదుర్చుకుంటారు అని 2019 ఎన్నికలు అయిపోయి జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అంతా అంటూ వచ్చారు. మొత్తానికి 2024 ఎన్నికల షెడ్యూల్ కి కౌట్ డౌన్ స్టార్ట్ అయిన నేపధ్యంలో చివరాఖరులో ఈ పొత్తు కుదిరింది.

ఈ పొత్తు వెనక ఎవరు ఉన్నారు ఎవరి ఆశలు అవకాశాలు ఏమిటి అన్నది మరో చర్చ. బాబు వరకూ చూస్తే ఇలాగే చేయాలనుకున్నారు. 2014 నాటి సక్సెస్ ని రిపీట్ చేస్తామన్న సెంటిమెంట్ ని నమ్ముకున్నారు. ఈ పొత్తు రూపంలో బాబు చెల్లించిన మూల్యం ఏంటి అంటే ముప్పయి ఎమ్మెల్యేలు ఎనిమిది దాకా ఎంపీ సీట్లు బీజేపీ జనసేన కూటమికి. ఇది ఎక్కువా తక్కువా అంటే ఎవరికి తోచిన తీరున వారు విశ్లేషించుకోవచ్చు.

అయితే ఈ రోజుకు కూడా ఈ కూటమిలో ఉన్న మూడు పార్టీలలో మొత్తం 175 సీట్లకు 175 సీట్లలో అభ్యర్ధులను నిలబెట్టే సత్తా ఉన్న పార్టీ టీడీపీ అన్నది ఎవరైనా ఒప్పుకుంటారు అలాగే పోలింగ్ బూత్ లెవెల్ దాకా క్యాడర్ ఉన్న పార్టీ కూడా టీడీపీనే. నలభై శాతం ఓటు షేర్ ఉన్న పార్టీ కూడా అదే. మరి అలాంటి టీడీపీ 2019లో సొంతంగా పోటీ చేసి భారీగా ఓటు షేర్ తెచ్చుకున్న సీట్ల పరంగా దారుణమైన నంబర్ ని చూసింది. బహుశా ఇదే పొత్తులకు శ్రీకారం చుట్టే అంశం అయి ఉండాలి.

ఏ ఒక్క వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటూ చీలకూడదు అని బిగించి మరీ పొత్తులు కట్టించిన ఘనత బాబుదే. మరి ఈ పొత్తులు సక్సెస్ అవుతాయా లేదా అన్నది జనం చేతిలో ఉన్నా కీడెంచి మేలు ఎంచాలన్నది చూస్తే కనుక ఒక వేళ పొత్తుతో కూడా జగన్ ని ఓడించ లేకపోతే ఏమి జరుగుతుంది ఎవరికి ఎక్కువ రిస్క్ అంటే కచ్చితంగా టీడీపీకే అని చెప్పాల్సి ఉంటుంది. టీడీపీ ఒక విధంగా తన మొత్తం పార్టీని ఫణంగా పెట్టి ఈ పొత్తులకు సిద్ధం అయింది అని భావించాలి.

ఈ పొత్తులలో జనసేన ఎన్నో కొన్ని సీట్లు తెచ్చుకుని అసెంబ్లీలో కొంత ఉనికిని చాటుకోవచ్చు. అలాగే బీజేపీ కొన్ని ఎంపీ సీట్లు గెలుచుకుని తన ప్రభుత్వాన్ని మళ్ళీ కేంద్రంలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఏపీలో పవర్ రాకపోయినా వారికి పెద్దగా ఏమీ ఉండదు. బీజేపీ జాతీయ పార్టీ. ఆ పార్టీ ఈ పొత్తు వల్ల ప్లస్ తప్ప మైనస్ లేదు. ఇక 2019లో ఒక్క సీటు గెలుచుకుని తాను పోటీ చేసిన రెండు సీట్లలో ఓడిన పవన్ కళ్యాణ్ కి కూడా ఈ పొత్తు బాగానే ఉపకరించవచ్చు.

ఈసారి ఎన్నికల్లో ఓడినా బీజేపీ జనసేన కలసి కూటమి కట్టి జగన్ మీద 2029 నాటికైనా గట్టిగా నిలబడి పోరాడే శక్తి సమకూర్చుకోవచ్చు. కానీ టీడీపీ పరిస్థితి ఏంటి అన్నదే చర్చ. ఒకవేళ ఇంత పొత్తు కట్టి కూడా టీడీపీ కూటమి ఓడితే పసుపు పార్టీకే తీరని దెబ్బ పడుతుంది అని అంటున్నారు. అంతే కాదు కోరి ఏపీలో బీజేపీ జనసేన ఉనికిని బలోపేతం చేసి తాను తెర వెనకకు తప్పుకునే దారుణమైన పరిస్థితులు రావచ్చు అని అంటున్నారు. మరో అయిదేళ్లు వైసీపీతో జగన్ తో యుద్ధం అంటే కష్టమైన వ్యవహారమే అవుతుంది.

దాంతో బాబు తన చివరి అస్త్రాన్ని తీశారు. తనదైన పొలిటికల్ మ్యాజిక్ ని చూపించారు. లాస్ట్ పంచ్ ఇదే అని చూపించారు. మరి ఈ లాస్ట్ పంచ్ టీడీపీది చంద్రబాబుది అయితే ఈసారి సక్సెస్ కిక్ ఎవరిది అన్నదే పెద్ద ప్రశ్న. దీనికి జవాబు జనాలే చెప్పాలి. బాబు మాత్రం రాజకీయ పందెమే కట్టారు.

ఏకంగా టీడీపీలోని సీనియర్లు ముఖ్య నేతల ఆశలను సైతం పక్కన పెట్టి ముప్పయి ఎమ్మెల్యే సీట్లను మిత్రులకు ఇస్తున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే కూటమిలో అందరికీ హ్యాపీ. కానీ ఇంతటి భారీ రిస్క్ ఫెయిల్ అయితే మాత్రం ఆ రిజల్ట్ ని గట్టిగా భరించాల్సింది, మోయాల్సింది టీడీపీ తప్ప మరోటి కానేకాదు. సో బాబు కదిలే యుద్ధానికి అటు మోడీ ఇటు పవన్ అండగా అంటోంది ఏపీ రాజకీయ విశ్లేషణ.

Tags:    

Similar News