టీడీపీ జనసేన క్యాడర్ ఒక్కటి కావాలి... బాబు పిలుపు !
ఏపీలో టీడీపీ జనసేన క్యాడర్ ఒక్కటిగా నిలవాలని రేపటి కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీకి వ్యతిరేకంగా పోరాడాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు ఇచ్చారు
ఏపీలో టీడీపీ జనసేన క్యాడర్ ఒక్కటిగా నిలవాలని రేపటి కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీకి వ్యతిరేకంగా పోరాడాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు ఇచ్చారు. విజయనగరం జిల్లా పొలిపల్లిలో జరిగిన యువగళం పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీని ఓడించేందుకే జనసేనతో పొత్తు కలిపామని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ పొత్తు అని అన్నారు.
ఇది చారిత్రాత్మకమైన పొత్తు అన్నారు. పై స్థాయిలో జనసేన టీడీపీ హై కమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దిగువ స్థాయిలో క్యాడర్ అంతా ఒక్కటిగా కలసి పనిచేయాలని ఆయన కోరడం విశేషం. ఏపీలో వైసీపీ ఓటమికి ప్రతీ కార్యకర్త కంకణం కట్టుకోవాలని బాబు కోరారు.
ఏపీలో వైసీపీ ఎందుకు ఓడిపోవాలో కూడా బాబు చెప్పారు. ప్రజలు కంటి నిండా నిద్రపోవాలంటే వైసీపీ ఓడాలని అన్నారు. రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలంటే వైసీపీ ఓడాలని, ఆడబిడ్డలకు రక్షణ ఉండాలన్నా వైసీపీ ఓడి తీరాల్సిందే అని బాబు గట్టిగా చెప్పారు. ఏపీని వైసీపీ నుంచి విముక్తి చేసే బాధ్యత అంతా తీసుకోవాలని ఆయన కోరారు.
వైసీపీ లేని రాష్ట్రాన్ని చూడడం అందరి కర్తవ్యం కావాలని బాబు అంటున్నారు. విశాఖ గురించి మాట్లాడుతూ ఆర్ధిక రాజధానిగా తమ పాలనలో చేశామని అలనాటి విశాఖను ఏమీ కాకుండా వైసీపీ ప్రభుత్వం చేసిందని చివరికి గంజాయి రాజధానిగా మార్చేసింది అని చంద్రబాబు విమర్శించారు.
ఏపీలో వైసీపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు జోస్యం చెప్పారు. ఎపుడు ఎన్నికలు జరిగినా వైసీపీ ఓటమి ఖాయమని అది ప్రజల నిర్ణయం అని ఆయన అంటున్నారు. దానికి నాందిగా యువగళం వేదిక మీద ప్రజా గర్జనకు పిలుపు ఇస్తున్నామని అన్నారు.
ఏపీలో అధికారంలోకి వచ్చేది నూరు శాతం టీడీపీ జనసేన కూటమి అని బాబు అన్నారు. మరో వైపు చూస్తే యువగళం సభ సూపర్ సక్సెస్ అయిందని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ఇదే స్పూర్తితో అమరావతి తిరుపతిలలో పవన్ తో కలసి మరో రెండు సభలు నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పారు. ఏపీలో జనసేన టీడీపీ ఐక్యంగా ముందుకు సాగుతాయని ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
ఆరు నూరు అయినా వచ్చేది తమ కూటమి ప్రభుత్వమే ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని, యువగళం సభకు జనాలు పోటెత్త డానికి కారణం కూడా అదే అని బాబు అన్నారు. మొత్తానికి జగన్ పోవాలి బాబు రావాలీ అంటూ టీడీపీ క్యాడర్ నినాదాల మధ్య చంద్రబాబు ఉద్వేగభరితమైన స్పీచ్ ఇచ్చారు.