బిగ్ న్యూస్... జీజేఐ కు చంద్రబాబు క్వాష్ పిటిషన్ బదిలీ!
టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు ఈ రోజు వెలువరించింది
టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు ఈ రోజు వెలువరించింది. ఇందులో భాగంగా... జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వడం గమనార్హం. ఈ క్రమంలో... సెక్షన్ 17ఏ అన్వయించడంలో తమకు వేరువేరు అభిప్రాయాలు ఉన్నట్లు న్యాయమూర్తులు తెలిపారు.
అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో భిన్న తీర్పులు వెలువడ్డాయి. ఈ తీర్పులో భాగంగా 17ఏ వర్తింపుపై ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు! స్కిల్ కేసులో చంద్రబాబుకు సెక్షన్ 17-ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధబోస్ తీర్పు ఇవ్వగా.. 17-ఏ వర్తించదని జస్టిస్ బేలా ఎం.త్రివేది తీర్పు ప్రకటించారు. దీంతో తదుపరి చర్యల కోసం సీజేఐకు నివేదిస్తున్నామని చెప్పారు.
సెక్షన్ 17-ఏ వర్తిస్తుంది - జస్టిస్ అనిరుద్ధబోస్ :
ఈ సందర్భంగా ముందుగా జస్టిస్ బోస్ తీర్పు వెలువరిస్తూ... ఈ కేసులో 17ఏ వర్తిస్తుందని, చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందని అన్నారు. ఇదే సమయంలో... గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్ కు వర్తింపజేయరాదని తెలిపారు. అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్ ను కొట్టేయలేమని స్పష్టం చేశారు. అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదని వెల్లడించారు.
చంద్రబాబుకు 17-ఏ వర్తించదు - జస్టిస్ బేలా త్రివేది:
అనిరుద్ధ బోస్ ఇచ్చిన తీర్పుతో విభేదించిన బేలా త్రివేది... ఈ కేసులో చంద్రబాబుకు 17-ఏ వర్తించదని అన్నారు. ఇదే సమయంలో… 2018లో వచ్చిన సవరణ ఆధారంగా కేసును క్వాష్ చేయలేమని తెలిపారు. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే అని.. అవినీతి నిరోధక చట్టానికి 17-ఏ ను ముడిపెట్టలేంని క్లారిటీ ఇచ్చారు.
ఇదే సమయంలో… నేరానికి పాల్పడటానికి అధికారాన్ని అడ్డుపెట్టుకున్న వారికి 17-ఏ రక్షణగా ఉండకూడదని.. అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష్యసాధింపుకు గురి కావద్దని మాత్రమే అని తీర్పు ఇచ్చారు.
సీజేఐ ముందుకు...:
కాగా... గవర్నర్ అనుమతి లేకుండా ఏపీ సీఐడీ తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టేయాలంటూ సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్.ఎల్.పీ) వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ కు సంబంధించి ఆయన తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, హరీశ్ సాల్వే.. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
ఈ కేసును జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించి అక్టోబరు 17న తీర్పు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై తీర్పు వెలువరిస్తూ... భిన్నాభిప్రాయాలు వెల్లడించారు! దీంతో... తదుపరి చర్యల కోసం సీజేఐకు నివేదిస్తున్నామని చెప్పారు.