భయమేస్తోంది అంటున్న బాబు !

ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-07-27 03:15 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఎన్నికల వేళ సందర్భంగా కొన్ని హామీలను ఇచ్చామని అవి సూపర్ సిక్స్ హామీలు అని ఆయన అన్నారు. అయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చూస్తే భయంగా ఉందని బాబు అనడంతో సభలో ఒకింత గంభీర వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏ మాత్రం ముందుకు కదలలేని పరిస్థితి ఉందని బాబు అంటున్నారు ఆవేదన తనకు నిండుగా ఉందని ఆయన చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా కోరడం విశేషం.

ఒక వైపు ఏపీలో ఆర్ధిక వ్యవస్థ మీద అసెంబ్లీలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీ అప్పుల కుప్ప అయింది అని బాబు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం దీనిని కారణం అన్నారు. ఆర్ధిక విధ్వంసానికి పాల్పడ్డారు అని ఆయన అన్నారు. ఒక ప్రభుత్వానికి అధికారం అప్పగిస్తే వారు ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు దుర్వినియోగం చేస్తే ఎలా అని ప్రశ్నించారు.

ప్రజలకు ప్రజా ధనానికి ట్రస్తీలుగా ఉండాలని బాధ్యతగా మెలగాలి తప్పించి పెత్తందారులుగా ఉండకూడదని బాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలన మీద ఆయన నిప్పులు చెరిగారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ మీద శ్వేతపత్రం రిలీజ్ చేసిన బాబు ప్రజలను అర్ధం చేసుకోవాలని అప్పీల్ చేసారు.

అంటే సూపర్ సిక్స్ హామీలు ప్రస్తుతానికి అమలు చేయలేకపోతున్నామని ఆయన చెప్పకనే చెబుతున్నారా అన్న కొత్త చర్చకు తెర లేచింది. అదే సమయంలో జగన్ ఏపీలో అధికారంలోకి రావడానికి ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చిందని వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశం పెట్టి మరీ జగన్ చంద్రబాబు ప్రభుత్వాన్ని నిందించారు. అయిదేళ్ల పాటు హామీలు అమలు చేయాల్సిందే అన్నారు.

దానికి జవాబు అన్నట్లుగా చంద్రబాబు ఆర్ధికంగా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. దీని బట్టి చూస్తే ఆర్ధిక వ్యవస్థ బాగాలేదని బాబు చెబుతున్నది ప్రజలను కన్వీన్స్ చేయడానికేనా అన్న చర్చ సాగుతోంది.

అయితే ఏ ప్రభుత్వంలో అయినా ప్రజలు తమకు కావాల్సింది కోరుకుంటారు. ఇవ్వకపోతే వారు అర్ధం చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. అంతవరకూ ఎందుకు ప్రభుత్వంలో భాగంగా ఉండే ఉద్యోగులే తమ డిమాండ్ల విషయంలో ఎక్కడా తగ్గరు అని అంటారు. వారికి అన్నీ తెలిసినా తమ హక్కులుగా రావాల్సినవి ఇవ్వాల్సిందే అని అంటారని చెబుతారు.

మరి సగటు ప్రజలు ఎంతవరకూ అర్ధం చేసుకుంటారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మరో వైపు బాబు వంటి ఉద్ధండుడికి ఈ విషయాలు ఎన్నికల ముందు తెలియవా అన్న ప్రశ్నలూ ఉన్నాయి.ఆయన వైసీపీ సంక్షేమ పధకాల మీద ఒక వైపు విమర్శలు చేస్తూ రాష్ట్రం శ్రీలంక అవుతుందని సోమాలియా అవుతుందని అప్పట్లో చేసిన ప్రకటనలు చూసిన వారు అన్నీ తెలిసి బాబు సూపర్ సిక్స్ హామీలు ఎందుకు ఇచ్చారని కూడా అంటున్నారు. ఏది ఏమైనా బాబుకు ఇపుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా పరిస్థీతి ఉందని అంటున్నారు.

అదే సమయంలో బాబుకు అనుకూలంగా బలమైన మీడియా ఉండడం, కూటమిలో ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి వారు ఉండడం కేంద్రం అన్ని విధాలుగా వెన్ను దన్నుగా ఉండడం కలసివచ్చే పరిణామాలే అని అంటున్నారు. అయితే ప్రజలు అర్ధం చేసుకోవాలీ అంటే మాత్రం కష్టమే అని అంటున్నారు. వారు కొన్నాళ్ళ పాటు వేచి చూడడమే పెద్ద సాయం తప్ప పూర్తిగా పధకాల విషయంలో వారు తగ్గేది ఉండదనే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News