కేంద్ర మంత్రిగా రామ్మోహన్ ...బాబు రియాక్షన్ !
కింజరాపు ఎర్రన్నాయుడు రాజకీయ వారసుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు.
కింజరాపు ఎర్రన్నాయుడు రాజకీయ వారసుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. తండ్రి తగ్గ తనయుడిగా ఉంటూ హ్యాట్రిక్ ఎంపీగా శ్రీకాకుళం నుంచి గెలిచిన రామ్మోహన్ మోడీ మంత్రివర్గంలో క్యాబినెట్ హోదా కలిగిన మంత్రిగా చేరారు
ఉన్నత విద్యావంతుడైన రామ్మోహన్ అతి పిన్న వయసులో అంటే 36 ఏళ్ల వయసులో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వారిగా రికార్డుకు ఎక్కారు. ఇదిలా ఉంటే బేజేపీ ఉద్ధండుల మధ్య రామ్మోహన్ ప్రమాణం చేశారు. ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణం చేస్తూంటే గ్యాలరీలలో కూర్చున్న టీడీపీ అధినేత చంద్రబాబు కళ్లలో ఒక ఆనందం కనిపించింది.
తాను రాజకీయంగా పెంచిన రామ్మోహన్ ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగి ఈ రోజు కేబినెట్ ర్యాంక్ హోదాతో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం పట్ల బాబు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషలలో అనర్గళంగా మాట్లాడే సత్తా రామ్మోహన్ కి ఉంది.
ఆయనను చూసినపుడు అందరికీ ఎర్రన్నాయుడే గుర్తుకు వస్తారు. బాబు ఎర్రన్నాయుడుల బంధం మూడు దశాబ్దాల నాటిది. తన స్నేహితుడు కుమారుడి వృద్ధిని బాబు స్వయంగా ఆస్వాదిస్తున్నారు. ఒక తండ్రిగా ఒక పార్టీ అధినేతగా ఒక రాజకీయ గురువుగా బాబు రామ్మోహన్ ని తీర్చిదిద్దిన వైనం అపూర్వం.
కేంద్రంలో టీడీపీ చేరుతుందని తెలియగానే బాబు రెండవ ఆప్షన్ లేకుండా రామ్మోహన్ పేరే చెప్పారు అంటే ఆ యువ నేత మీద ఉన్న గురి ఏంటో అర్ధం అవుతుంది. రామ్మోహన్ కూడా బాబుని గురు భావంతో చూస్తారు. మొత్తం మీద రామ్మోహన్ కేంద్ర మంత్రి కావడం అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రాతో పాటు ఏపీకి ఎంతో బలం, రాజకీయ లాభం అని అంతా అంటున్నారు. ఎంపీగా తానేంటో రుజువు చేసుకున్న ఈ బీసీ యువ నేత కేంద్ర మంత్రిగానూ నూరు మార్కులూ కొట్టేస్తారు అని అంతా ఆశిస్తున్నారు.