ఎన్డీయేలో కీలకం కానున్న చంద్రబాబు...!
ఆయన నివాసంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయి దాదాపుగా గంట పాటు చర్చించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుని ఎన్డీయేలోకి కేంద్ర హోం మంత్రి బీజేపీ అగ్ర నేత అమిత్ షా స్వయంగా అహ్వానించారు. ఆయన నివాసంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయి దాదాపుగా గంట పాటు చర్చించారు. అన్ని అంశాలు కూడా ఈ సందర్భంగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో పొత్తులు మూడు పార్టీల మధ్య కుదిరినట్లుగా గెలుస్తోంది. బీజేపీకి జనసేనకు కలిపి 30 దాకా ఎమ్మెల్యే సీట్లు, అలాగే ఎనిమిది దాకా ఎంపీ సీట్లు ఇవ్వాలని చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు ఆమోదం లభించినట్లుగా తెలుస్తోంది. బీజపీ ఆరు దాకా ఎంపీ సీట్లకు పోటీ చేస్తుంది, ఆ మిగిలిన రెండు ఎంపీ సీట్లు జనసేన పోటీ చేయనుంది అని అంటున్నారు
అదే విధంగా చూస్తే బీజేపీ ఆరు అసెంబ్లీ సీట్లు జనసేన ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేస్తుందని అంటున్నారు. ఈ నేపధ్యంలో మూడు పార్టీలు 2024 ఎన్నికల్లో సమిష్టిగా పోటీ చేస్తాయని అంటున్నారు. మరో వైపు చూస్తే గురువారం రాత్రి జరిగిన భేటీ తరువాత శనివారం జరిగిన ఈ భేటీ అత్యంత కీలకమైనదిగా చెబుతున్నారు.
ఈ భేటీ దాదాపుగా గంట పాటు జరిగింది అని అంటున్నారు. ఈ భేటీ తరువాత ఇక చంద్రబాబు ఎన్డీయే మెంబర్ అయినట్లే అంటున్నారు. 2018 మార్చి నెలలోనే చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. సరిగ్గా ఆరేళ్ల తరువాత బాబు మళ్లీ ఎన్డీయేలో కీలక భాగస్వామిగా మారుతున్నారు అని అంటున్నారు.
ఈ నెల 14న ఢిల్లీలో జరిగే ఎన్డీయే సమావేశానికి బాబుకు అమిత్ షా ఆహ్వానం అందించారు అని అంటున్నారు. గత ఏడాది జరిగిన ఎన్డీయే భేటీకి ఏపీ నుంచి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ మాత్రమే హాజరయ్యారు. ఈసారి మాత్రం చంద్రబాబు హాజరు అవుతారు అని అంటున్నారు.
బీజేపీ గత ఏడాది కాలంలో ఎన్డీయేను బలోపేతం చేస్తూ వస్తోంది. అందులో భాగంగా దేశంలో గతంలో ఎన్డీయేలో పనిచేసి ఆ తరువాత బయటకు వెళ్ళిన వారిని తిరిగి ఎన్డీయే కూటమిలోకి తీసుకుంటోంది. బీహార్ నుంచి నితీష్ కుమార్ అలాగే ఇటీవల చేరారు. అదే విధంగా ఒడిషాలో బిజూ జనతాదళ్ కూడా ఎన్డీయేలో చేరుతోంది.
ఇపుడు ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీ చేరడంతో ఎన్డీయే మిత్రుల సంఖ్య ముప్పయి అయిదు కంటే ఇంకా ఎక్కువగా పెరగనుంది. ఇక ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన కలసి పోటీ చేయడం ఇది రెండవసారి అవుతుంది. 2014లో ఈ మూడు పార్టీలు కలిసాయి. అయితే ఆనాడు జనసేన పోటీకి దూరంగా ఉంది. ఈసారి మాత్రం ఆ పార్టీ కూడా పోటీ పడుతోంది.
ఏపీలో ఈ కూటమి అధికారంలో ఉన్న వైసీపీని ఓడిస్తుందని మూడు పార్టీల నేతలు ధీమాగా ఉన్నారు. మొత్తానికి గత మూడు రోజులుగా ఢిల్లీలో సాగుతున్న పరిణామాలు ఈ రోజుకు ఒక కొలిక్కి వచ్చాయి. పొత్తులు తేలాయి కాబట్టి ఇక ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది కూడా మరోసారి అనుకుని అధికారిక ప్రకటన విడుదల చేస్తారు అని అంటున్నారు.