చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ వెనుక విశాఖ వాసి!

చంద్రయాన్-3 విజయవంతంగా చందమామను చేరింది. దీంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా భారత్ వైపు చూసింది

Update: 2023-08-24 06:52 GMT

చంద్రయాన్-3 విజయవంతంగా చందమామను చేరింది. దీంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా భారత్ వైపు చూసింది. ఈ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం అనంతరం ఇస్రో చైర్మన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ మిషన్ వెనుకున్న కీలక వ్యక్తుల్ని ప్రపంచానికి పరిచయం చేసారు. వారిలో ఏకైక తెలుగు శాస్త్రజ్ఞుడు మోటమర్రి శ్రీకాంత్ తాజాగా హాట్ టాపిక్ గా మారారు!

అవును... చంద్రయాన్‌-3లో మిషన్‌ డైరెక్టర్‌ గా పనిచేసిన శ్రీకాంత్‌ మోటమర్రి.. స్వస్థలం విశాఖపట్నం సీతమ్మధార. దీంతో తెలుగు వారి ఆనందానికి అవధులు లేకుండా పోయిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈయన తండ్రి ఎం.ఎస్‌.ఎన్‌. మూర్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో ఇంజినీర్‌ గా పనిచేసి బెంగళూరులో స్థిరపడ్డారు.

శ్రీకాంత్ గ్రాడ్యుయేషన్ మొత్తం ఆంధ్రప్రాంతంలోనే జరిగింది. ఇందులో భాగంగా.. మచిలీపట్నంలో డిగ్రీ ప్రథమ సంవత్సరం, విశాఖ ఏవీఎన్‌ కాలేజ్‌ లో డిగ్రీ సెంకడ్‌, ఫైనలియర్‌ చదివారు. తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఎస్‌సీ (ఎలక్ట్రికల్‌) చేశారు. అనంతరం మధ్రప్రదేశ్‌ లోని ఇండోర్‌ లో ఎంటెక్‌ చేశారు.

ఎంటెక్ అనంతరం బెంగళూరు ఇస్రోలో సైంటిస్ట్‌ గా చేరిన శ్రీకాంత్... ఇస్రోలో అంచలంచెలుగా ఎదుగుతూ వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ క్రమంలో మార్స్‌ మిషన్‌ కు ఆపరేషన్‌ డైరెక్టర్‌ గా పనిచేశారు. చంద్రయాన్‌ 2కు డిప్యూటీ మిషన్‌ డైరెక్టర్‌ గా పనిచేశారు.

ఈ క్రమంలో తాజాగా చంద్రయాన్‌ 3కి మిషన్‌ డైరెక్టర్‌ గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన భార్య మాధురి స్పందించారు. చంద్రయాన్‌ 3 నింగిలోకి ఎగిరిన జూలై 14 నుంచి ఇప్పటి వరకు తన భర్త శ్రీకాంత్‌ ఇంటికి పది సార్లే వచ్చారని ఉద్వేగంగా చెప్పారు. చంద్రయాన్‌ విజయంలో తన భర్త పాత్ర ఉండడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

ఇక, శ్రీకాంత్ తండ్రి మూర్తి.. కొద్ది సంవత్సరాలు కిందట చనిపోయారు. ప్రస్తుతం మాయన తల్లి రజని, భార్య మాధురి, కూతుర్లు వర్ష, అంజన తో కలిసి బెంగళూరులో ఉంటున్నారు.

Tags:    

Similar News