రూట్ చెబుతున్న ఇస్రో... భారీ గొయ్యిని తప్పించుకున్న రోవర్!
అవును... చంద్రుడి దక్షిణ ధ్రువానికి సంబంధించి సమాచారాన్ని సేకరిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ కు ఓ ప్రమాదం ఎదురయ్యింది
జాబిల్లి ఉపరితలంపై చంద్రయాన్-3 ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ సమయంలో చంద్రుడిపై పయనిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ పెను ప్రమాదం ఎదురైంది. అయితే ఇస్రో అప్రమత్తం చేయడంతో రోవర్ సేఫ్ గా బయటపడింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇస్రో విడుదల చేసింది.
అవును... చంద్రుడి దక్షిణ ధ్రువానికి సంబంధించి సమాచారాన్ని సేకరిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ కు ఓ ప్రమాదం ఎదురయ్యింది. రోవర్ ప్రయాణిస్తున్న మార్గంలో నాలుగు మీటర్ల వెడల్పున్న ఒక గొయ్యి కనిపించింది. వెంటనే అప్రమత్తమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు.. సురక్షితమైన మరో మార్గంలో ప్రయాణించేలా రోవర్ కు ఆదేశాలిచ్చారు.
దీంతో... ఇస్రో సూచనలు అనుసరించి దారి మార్చుకుని సురక్షిత మార్గంలో ప్రయాణం ముందుకు వెళుతోంది. రోవర్ వేసే అడుగులను ఇస్రో చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ప్రజ్ఞాన్ వెళ్లే మార్గంలో గొయ్యి మరో 3 మీటర్ల దూరంలో ఉందనగా, ఇస్రో గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుంచి రోవర్ కు రూట్ మార్చుకోమని సంకేతాలు పంపింది.
ప్రజ్ఞాన్ ప్రయాణం సవాళ్ల మధ్య సాగుతోందనడానికి తాజా ఉదంతమే నిదర్శనం. ఇదే సమయంలో శనివారం 100 మి.మీ.ల లోతున్న గొయ్యిని గుర్తించినా.. విజయవంతంగా దాన్ని దాటేసింది. అయితే... మార్గ ప్రణాళికల కోసం రోవర్ లోని నేవిగేషన్ కెమెరాలు ఐదు మీటర్ల దూరాన్ని మాత్రమే చిత్రీకరించగలగడంతో... ప్రతీ నిమిషం అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది!
కాగా... చంద్రునిపై దిగిన తర్వాత ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై స్థిరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. రోవర్ ఆ సమీపంలో తిరిగి అక్కడి సమాచారాన్ని అంతటినీ ల్యాండర్ కు పంపుతుంది. ల్యాండర్ నుంచి సమాచారం ఇస్రోకు అందుతుంది. ఆరు చక్రాలు ఉన్న ఈ రోవర్ చంద్రుడి ఉపరితలంపై ఒక లూనార్ డే (14 భూ దినాలు) పాటు తిరుగుతుంది.