ఆ 14 రోజుల తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ పరిస్థితి ఏంటి?
చంద్రుడిపై సూర్యరశ్మి పడితేనే.. ఆ పడిన సమయంలోనే విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తమ విధులను నిర్వర్తించగలవు
జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ ను దింపిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 40 రోజులు సుదీర్ఘ ప్రయాణం తర్వాత చంద్రయాన్–3లోని విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపింది. ఇది జరిగిన కొన్ని గంటలకే అందులోని ప్రజ్ఞాన్ రోవర్ కూడా బయటకొచ్చి తన పని మొదలుపెట్టేసింది.
14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలాన్ని ప్రజ్ఞాన్ రోవర్ పరిశోధించనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఏడు రోజులు పూర్తయ్యాయి. మరో ఏడు రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది. రోవర్ పరిశీలించిన విశ్లేషణను ఇస్రో ఎప్పటికప్పుడు విడుదల చేస్తోంది. అలాగే అక్కడ రోవర్ తీసిన చిత్రాలను కూడా షేర్ చేస్తోంది.
మిగిలిపోయిన ఏడు రోజుల సమయం కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటివరకు రోవర్ 250 మీటర్ల మేర చంద్రుడి ఉపరితలంపై ప్రయాణం చేసింది. ఈ క్రమంలో సల్ఫర్, అల్యూమినియం, టైటానియం, క్రోమియం, కాల్షియం, మాంగనీస్, సిలికాన్, ఇనుము వంటివి ఉన్నట్టు కనిపెట్టింది. అలాగే అన్నింటికంటే ముఖ్యమైన ఆక్సిజన్ ఆనవాళ్లు కూడా ఉన్నాయని ఇస్రో వెల్లడించింది. హైడ్రోజన్ కోసం రోవర్ అన్వేషిస్తోందని తెలిపింది.
ఈ నేపథ్యంలో రోవర్ కు మిగిలిన ఏడు రోజులు అత్యంత కీలకమని ఇస్రో చెబుతోంది. రోవర్ చంద్రుడిపై దిగి ఏడు రోజులు పూర్తికాగా మిగిలిన ఏడు రోజుల కాలం కూడా పూర్తయితే చంద్రుడిపై చిమ్మచీకట్లు, విపరీతమైన మంచు కమ్ముకుంటాయి. ఇక అప్పుడు ల్యాండర్, రోవర్ పనిచేయడం కష్టమవుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
చంద్రుడిపై సూర్యరశ్మి పడితేనే.. ఆ పడిన సమయంలోనే విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తమ విధులను నిర్వర్తించగలవు. సూర్యరశ్మి లేకపోతే మైనస్ డిగ్రీల మంచులో అవి పనిచేయడం కష్టమవుతాయి. ఈ నేపథ్యంలో సోలార్ శక్తిని సంగ్రహించుకుని అవి పనిచేసేలా ఇస్రో వాటిని రూపొందించింది.
14 రోజులు మాత్రమే ల్యాండర్, రోవర్ పనిచేయడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా?.. భూమిపై 14 రోజుల కాలం చంద్రుడిపై ఒక్క రోజుతో సమానం. అంటే జాబిల్లి లెక్క ప్రకారం.. ల్యాండర్, రోవర్ అక్కడ ఒక్క రోజు మాత్రమే ఉంటాయి. చందమామపై ఒక్క రోజు తర్వాత వాతావరణం అత్యంత ప్రతికూలంగా మారుతుందని చెబుతున్నారు. చంద్రుడిపై ఈ ఒక్క రోజు అక్కడ సూర్యుడు అస్తమిస్తాడు. దీంతో మన మాదిరిగానే చంద్రుడిపైన చీకట్లు కమ్ముకుంటాయి. దీంతోపాటు ఉష్ణోగ్రతలు కూడా పడిపోతాయి. ఏకంగా మైనస్ 180 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు దిగజారతాయి.
ఈ నేపథ్యంలో మన లెక్క ప్రకారం భూమిపై 14 రోజులు చంద్రుడిపై ఒక్క రోజుకు సమానం కాబట్టి సూర్యుడు అస్తమించాక అక్కడ మొత్తం కారు చీకట్లు కమ్ముకుంటాయి. ఉష్ణోగ్రతలు కూడా మైనస్ 180 డిగ్రీలకు పడిపోవడంతో ఈ ప్రభావం ల్యాండర్, రోవర్ లపైన పడతాయి. ఈ రెండూ మంచులో గడ్డ కట్టుకుపోతాయి. మళ్లీ తిరిగి 14 రోజుల తర్వాతే చంద్రుడిపై సూర్యుడి కిరణాలు ప్రసరిస్తాయి. అప్పటికే గడ్డ కట్టుకుపోయి మంచులో కూరుకుపోయిన ల్యాండర్, రోవర్ తిరిగి పనిచేయడం ప్రారంభిస్తే అది అద్భుతమే అవుతుంది.
కాగా చంద్రుడి దక్షిణ ధ్రువంలో దిగిన విక్రమ్ ల్యాండర్, దాని నుంచి బయటకు వచ్చి చంద్రుడిపైన తిరుగుతున్న ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటికే తమ పనిని ఆరంభించాయి. పలు ఫొటోలను, వీడియోలను అవి భూమికి పంపాయి. 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలంపైన తిరుగుతూ అనేక వివరాలను భూమికి పంపనున్నాయి. వీటి ఆధారంగా చంద్రుడిపై ఉన్న ఖనిజ వనరుల వివరాలు, జీవం ఉనికికి అవకాశాలు, విశ్వం ఆవిర్భావం తదితర అంశాలను తెలుసుకోవడానికి వీలు పడుతుందని భావిస్తున్నారు.