అండర్‌ వరల్డ్‌ డాన్‌ చోటా రాజన్‌ బ్రతికే ఉ‍న్నాడంట... పిక్ వైరల్!

అయితే... 2021లో చోటా రాజన్‌ కు కరోనా వైరస్‌ సోకడంతో ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌ లో చికిత్స పొందారు

Update: 2024-04-22 15:30 GMT

1993లో జరిగిన ముంబై బాంబు పేలుళ్ల ఘటన అనంతరం అంతర్గత వివాదాల వల్ల అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్ ఇబ్రహీంతో మరో డాన్ చోటా రాజన్‌ విడిపోవడం.. 1994లో చోటా రాజన్‌ పై పోలీసులు రెడ్‌ కార్నర్‌ నోటీసు విడుదల చేయడం తెలిసిందే. ఈ క్రమంలో 2015లో సిడ్ని నుంచి బయలుదేరిన చోటా రాజన్‌ బాలి ఎయిర్‌ పోర్టులో పోలీసులకు పట్టుబడ్డారు. నాటి నుంచి అదుపులోకి తీసుకున్న పోలీసులు చోటారాజన్‌ ను తీహార్‌ జైల్‌ కు తరలించారు!

అయితే... 2021లో చోటా రాజన్‌ కు కరోనా వైరస్‌ సోకడంతో ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌ లో చికిత్స పొందారు. ఇదే సమయంలో... చోటా రాజన్‌ తో పాటు కరోనా సోకిన బిహార్‌ మాఫీయా డాన్ షహబుద్దీన్ మరణించారు. దీంతో కరోనా ఎఫెక్ట్ తో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్‌ కూడా మృతి చెంది ఉంటారని పలు వదంతులు వ్యాపించాయి. ఈ సమయంలో అతడి ఫోటో ఒకటి తెరపైకి వచ్చింది.

అవును... చోటా రాజన్‌ కు సంబంధించినదిగా చెబుతున్న ఓ ఫొటో తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చోటా రాజన్‌ అరెస్ట్ అయ్యాక సుమారు తొమ్మిది సంవత్సరాల తర్వాత.. తాజాగా అతడి ఫొటో వెలుగులోకి రావటంతో ఒక్కసారిగా అతడి గురించిన చర్చ మరోసారి మొదలైంది. ఇందులో భాగంగా.. అతడు తీహార్‌ జైల్‌ లో మృతి చెందాడన్న వదంతులకు తెరపడినట్లు అయిందని అంటున్నారు.

కాగా... దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్ గ్యాంగ్ ల నుండి చోటా రాజన్ బెదిరింపులను ఎదుర్కొంటూ ఉన్నాడని చెబుతుంటారు. అనేక సందర్భాల్లో జైలులోనే రాజన్ ను చంపేస్తామని బెదిరించినట్లు ప్రచారం జరిగింది. అయితే... అక్టోబరు 2015లో భారత్ కు రప్పించినప్పటి నుండి రాజన్ తీహార్ జైలులో ఉన్నాడు. ఈ సమయంలో అతడి తాజా ఫోటో వెలుగులోకి రావడంతో... ఇతడు మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు!

Tags:    

Similar News