హైకోర్టు ఆగ్రహిస్తోంది.. చంద్రబాబుకు ఇబ్బందే..!
ఇది ప్రభుత్వ పనితీరును, సినీయర్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును ఇబ్బందిలోకి నెట్టే పరిణామమే.
ఏపీలోని కూటమి సర్కారుపై తొలిసారి రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజానికి ప్రభుత్వం ఏర్పడి ఐదు మాసాలు కూడా కాలేదు. కానీ, ఇంతలోనే చాలా సీరియస్‌గా కోర్టు సర్కారును ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ``అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఏంటీ నిర్బంధాలు?`` అని గట్టిగానే ప్రశ్నిం చింది. దీనికి ప్రభుత్వం నుంచి వివరణ ఇచ్చినా.. కోర్టు ఆగ్రహం మాత్రం చల్లారలేదు. గతంలో వైసీపీ హయాంలో రెండేళ్ల తర్వాత.. చోటు చేసుకున్న పరిణామాలు తెలిసిందే.
అప్పట్లో ప్రభుత్వ తీరును ఎలా అయితే.. తప్పుబట్టిందో.. ఇప్పుడు కూటమి సర్కారును కేవలం ఐదు మాసాల్లోనే ప్రశ్నించింది. ఇది ప్రభుత్వ పనితీరును, సినీయర్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును ఇబ్బందిలోకి నెట్టే పరిణామమే. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్న పోస్టులు పెడుతున్న వారిపై సర్కారు చర్యలు తీసుకుంటోంది. అయితే.. ఈ క్రమంలో నిందితులుగా బావిస్తున్న వారిని అర్ధరాత్రి అదుపులోకి తీసుకుంటున్నారు.
ఇళ్లలో వారికి కనీస సమాచారం ఇవ్వకుండానే వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనికితోడు వారిని ఎక్కడ ఉంచుతున్నారో.. ఏం చేస్తున్నారో.. కూడా సమచారం ఇవ్వడం లేదు. ఈ పరిణామాలతో హైకోర్టు హెబియస్ కార్పస్(తమ వారిని కోర్టులో హాజరు పరిచేలా ఆదేశించాలని) పిటిషన్లు దాఖలయ్యారు. సుమారు 40 పిటిషన్లు దాఖలు కావడం .. హైకోర్టు చరిత్రలో ఇదే మొదటి సారి. దీంతో సర్కారుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అక్రమ నిర్బంధాలు పెరిగిపోతున్నాయని.. ఇలా ఎందుకు జరుగుతోందని, పోలీసులకు చట్టం గురించి పాఠాలు చెప్పాల్సిన అవసరం, అవగాహన కల్పించాల్సిన అవసరం వచ్చిందని కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇది.. చంద్రబాబు వంటి సీనియర్ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో తగదనేది ప్రజాస్వామ్య వాదులు చెబుతున్న మాట. గతంలో జగన్ ఉన్నప్పుడు కూడా ఇలానే జరిగితే.. అందరూ ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు తన విధానాన్ని సమీక్షించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.