ఓ వైపు వరదలు.. మరోవైపు తండ్రి బాధ్యత.. గుండెలు పిండేసే సీన్!

చాలా మంది ఎత్తు భవనాల పైకి ఎత్తి ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు.

Update: 2024-09-04 07:39 GMT

తెలుగు రాష్ట్రాల్లో వరదలు సృష్టించిన జలప్రళయం అంతాఇంతా కాదు. ప్రాజెక్టులు గేట్లు తెరుచుకున్నాయి. చెరువులు, కుంటలు మత్తుళ్లు దూకుతున్నాయి. చాలాచోట్ల ఇళ్లు నీట మునిగాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు పడిన ఇబ్బందులు చెప్పలేనివి. చిన్నపిల్లల్ని కాపాడుకునేందుకు ఎన్నో ప్రయాసాలకోర్చారు. ఇక బెజవాడను వరదలు ఏ స్థాయిలో ముంచెత్తాయో చూశాం. అక్కడి ప్రజలు ఆ నాలుగు రోజులు నిద్రలేని రాత్రులు గడిపారు. ఇప్పటికీ ఇంకా వరదలోనే ఉండిపోయారు కూడా. రాత్రికిరాత్రే ఊహించని స్థాయిలో వరదలు రావడంతో.. పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు కూడా నీటి ప్రవాహంలో చిక్కుకున్నాయి. చాలా మంది ఎత్తు భవనాల పైకి ఎత్తి ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బెజవాడను పెద్ద ఎత్తున వరదలు ముంచెత్తాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు బిక్కుబిక్కుమంటూ గడిపారు. పడవల్లో ప్రయాణిస్తూ ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం పడవలే కాదు.. డ్రమ్ములు, ట్యూబులు ధరించి ఈదుకుంటూ వరద నుంచి బయటపడ్డారు. కాపాడు భగవంతుడా.. కాపాడు దుర్గమ్మ తల్లి అంటూ వేడుకుంటూ అదే వరదలో ముందుకు సాగారు. కొందరేమో ఎన్డీఆర్ఎఫ్ సాయంతో పునరావాస కేంద్రాలకు తరలారు.

అయితే.. ఈ వరదల్లో ఓ బాహుబలి సీన్ కనిపించింది. ఆ సినిమాలో రమ్యకృష్ణ నది ప్రవాహం నుంచి బాహుబలిని ఏ విధంగా అయితే రక్షించిందో.. అదే విధంగా ఓ తండ్రి తన నెలల చిన్నారిని కాపాడుకున్నాడు. విజయవాడలోని సింగ్‌నగర్ ప్రాంతంలో ఓ వైపు వరద ప్రవాహం భయపెడుతున్నా.. చెక్కుచెదరని మనోధైర్యంతో తన చిన్నారిని తీసుకెళ్లాడు. ఓ ప్లాస్టిక్ డబ్బాలో తన నెలల చిన్నారిని పడుకోబెట్టి నీటి ప్రవాహం నుంచి సేఫ్ జోన్‌కు తీసుకెళ్లాడు. ఈ దృశ్యాన్ని చూసిన అందరి కళ్లలో నీళ్లు చెమ్మగిల్లాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో అందరి గుండెల్ని పిండేస్తోంది. చిన్నారికి, ఆ తండ్రికి ఎంత కష్టం వచ్చింది దేవుడా అంటూ సానుభూతి తెలుపుతున్నారు.

Full View
Tags:    

Similar News