చిరంజీవిని రాజ్యసభ ఎంపీని చేసేస్తే కాపుల ఓట్లు పడిపోతాయా ?
అయితే చిరంజీవిని యూపీ నుండి రాజ్యసభకు నామినేట్ చేస్తే పార్టీకి జరిగే ఉపయోగం ఏమిటో అర్ధంకావటంలేదు.
లాజిక్కుకు అందని ఎన్నో విచిత్రాలు రాజకీయాల్లో జరిగిపోతుంటాయి. అలాంటి ఒక విచిత్రం గురించే ఇపుడు మీడియా, సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం మొదలైంది. ఇంతకీ విషయం ఏమిటంటే సినీనటుడు చిరంజీవిని బీజేపీ అగ్రనాయకత్వం రాజ్యసభ ఎంపీని చేయబోతోందట. అదికూడా ఉత్తరప్రదేశ్ కోటాలో చేయబోతోందనే ప్రచారమే కాస్త అనుమానంగా ఉంది. రాజ్యసభకు ఎవరిని ఎక్కడనుండి పంపించాలన్నది నాయకత్వం నిర్ణయం. అయితే చిరంజీవిని యూపీ నుండి రాజ్యసభకు నామినేట్ చేస్తే పార్టీకి జరిగే ఉపయోగం ఏమిటో అర్ధంకావటంలేదు.
ఇపుడు జీవీఎల్ నరసింహారావు కూడా యూపీ నుండి నామినేట్ అయిన రాజ్యసభ ఎంపీనే. అయితే జీవీఎల్ చాలాకాలంగా పార్టీలో ఫుల్ టైమర్ గా పనిచేస్తున్నారు. కాబట్టి యూపీ నుండి నామినేట్ చేసింది. కాని చిరంజీవి పరిస్దితి అదికాదు. ముందు రాజ్యసభ ఎంపీని చేసి తర్వాత కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. మొన్న అయోధ్య బాలరాముడి ప్రతిష్టకు ఆహ్వానం అందటం, తర్వాత పద్మవిభూషణ్ పురస్కారం, ఇపుడు రాజ్యసభ నామినేషన్ అనే ప్రచారం చూస్తుంటే ఏదో ప్లాన్ ఉన్నట్లే అర్ధమవుతోంది.
ఇంతకీ ఆ ప్లాన్ ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో కాపుల ఓట్లకు చిరంజీవి ద్వారా గాలమేయటమట. చిరంజీవికి బీజేపీ రాజ్యసభ పదవి ఇస్తే రాష్ట్రంలోని కాపులంతా కమలంపార్టీకి ఓట్లేస్తారని బీజేపీ అగ్రనేతలు ఎలాగ అనుకున్నారో అర్ధంకావటంలేదు. ఒకపుడు చిరంజీవి ప్రజారాజ్యపార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీచేస్తేనే దిక్కులేకుండా పోయింది. రెండుచోట్ల పోటీచేసిన చిరంజీవి పాలకొల్లులో ఓడిపోయి తిరుపతిలో అతికష్టం మీద గెలిచారు.
చిరంజీవి పార్టీ పెడితేనే కాపులందరు ప్రజారాజ్యంపార్టీకి ఓట్లేయలేదు. జనసేన పార్టీ పెట్టుకుని 2019 ఎన్నికల్లో పోటీచేస్తే పవన్ కల్యాణ్ చతికలపడ్డారు. పోటీచేసిన రెండు నియోజకవర్గాలు గాజువాక, భీమవరంలో పవన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. తమకున్న సినీగ్లామర్ ను పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లోకి వస్తేనే అన్నదమ్ములను జనాలు పట్టించుకోలేదు. అలాంటిది బీజేపీ తరపున చిరంజీవిని రాజ్యసభ ఎంపీని చేసేస్తే కాపుల ఓట్లు కమలంపార్టీకి పడిపోతాయా ? ఏమిటో ఇది ఎవరికి పుట్టిన ఆలోచనో అర్ధంకావటంలేదు.