చంద్రబాబే ప్రధాన నిందితుడు... పక్కా ఆధారాలు ఉన్నాయ్: సీఐడీ చీఫ్
ఈ రోజు ఉదయం సీఐడీ చీఫ్ మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ప్రధాన నిందితుడు అని తాము అనవసరంగా పేర్కొనలేదని, పక్కా ఆధారాలతోనే తాము నిర్ధారణకు వచ్చామన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ నిర్ధారించారు. ఈ రోజు(శనివా రం) ఉదయం 6 గంటల తర్వాత చంద్రబాబు అనుమతి మేరకు ఆయనను అరెస్టు చేసినట్టు చెప్పారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో దాదాపు రూ.550 కోట్ల వరకు అవినీతి జరిగిందని సీఐడీ చీఫ్ సంజయ్ వెల్లడించారు. చంద్రబాబుకు అన్ని విషయాలు తెలిసే జరిగాయని.. ఆయన పాత్ర చాలా పెద్దదని వ్యాఖ్యానించారు.
ఈ రోజు ఉదయం సీఐడీ చీఫ్ మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ప్రధాన నిందితుడు అని తాము అనవసరంగా పేర్కొనలేదని, పక్కా ఆధారాలతోనే తాము నిర్ధారణకు వచ్చామన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అయినప్పటికీ... చివరకు అప్పటి సీఎం చంద్రబాబుకు అన్నీ తెలిసే ఆర్థిక అవకతవకలు జరిగాయని, ఈ కేసులో ఆయనపై ఆరోపణలు నిరూపితమైతే పదేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చని తెలిపారు.
ఈ స్కాంలో చంద్రబాబు పాత్ర గురించి మరిన్ని వివరాలు రాబట్టేందుకే ఆయన్ను అదుపులోకి తీసుకున్న ట్లు పేర్కొన్నారు. స్కిల్ డెవలప్‌మెంటులో పనిచేసిన ఎండీ సహా.. అప్పటి సలహాదారు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టు సమాచారం అందిందని, వారిని తీసుకువచ్చేందుకు సీఐడీ ప్రత్యేక బృందాలను దుబాయ్, అమెరికాలకు పంపించనున్నట్టు సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు.
చంద్రబాబు హోదాను, ఆయన వయసును దృష్టిలో పెట్టుకునే ఆయనను ప్రశ్నించనున్నట్టు సీఐడీ చీఫ్ చెప్పారు. ఇక, నారాలోకేష్ పాత్రపైనా నిశితంగా దృష్టి పెట్టినట్టు చెప్పారు. కేవలం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులోనే కాకుండా.. ఫైబర్ నెట్, అమరావతి రింగ్ రోడ్డు ఎక్స్‌టెన్షన్ వంటి కేసుల్లోనూ నారా లోకేష్ పాత్ర ఉందని, దీనిపై నిశితంగా దర్యాప్తు జరుగుతోందని సీఐడీ చీఫ్ తెలిపారు. ఎట్టి పరిస్థితిలోనూ ఎవరినీ వదిలి పెట్టేది లేదన్నారు.