నాడు బాలయ్య, నేడు చంద్రబాబు... ఎవరీ సంజయ్ ఐపీఎస్!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన విషయం ఇది.

Update: 2023-09-10 09:32 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన విషయం ఇది. నాడు బాలకృష్ణను.. ఆయన బావ, వియ్యంకుడు అయిన చంద్రబాబును అరెస్ట్ చేసింది ఒకరే అధికారి. ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ అవుతుంది. కేసు నిలబడి బలపడితే లోకేష్ ను కూడా అరెస్ట్ చేసేది ఈయనేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో చంద్రబాబు అరెస్ట్ అవ్వడం చిన్న విషయం కాదనే కామెట్లు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే చంద్రబాబును ఎవరూ అరెస్టు చెయ్యలేకపోయిన సంగతి తెలిసిందే. తనపై 27 కేసులు పెట్టినా ఏమీ చెయ్యలేకపోయారని స్వయంగా చంద్రబాబే పలుమార్లు చెప్పుకున్న పరిస్థితి.

అలాంటి ఆయన్ని.. ఓ సీఐడీ అధికారి పక్కా సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆయనపేరు ఎన్. సంజయ్! సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఏపీ సీఐడీ చీఫ్ అయిన సంజయ్ గురించిన సెర్చ్ ఇప్పుడు ఆన్ లైన్ వేదికగా బలంగా సాగుతుందని అంటున్నారు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... గతంలో నందమూరి బాలకృష్ణను కూడా అరెస్ట్ చేసింది ఈ అధికారే కావడం గమనార్హం. అవును... 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నందమూరి బాలకృష్ణ కాల్పుల కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. నాడు బాలయ్యను అరెస్ట్ చేసింది కూడా సంజయ్ కావడం గమనార్హం.

సరిగ్గా ఇంతకాలం తర్వాత వైఎస్సార్ కుమారుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో చంద్రబాబుని అరెస్ట్ చేసింది కూడా ఈ సంజయే! కాగా... సెప్టెంబర్ 9న తెల్లారి 6 గంటల సమయంలో చంద్రబాబును అరెస్టు చెయ్యడంతోనే ఆయన పేరు మారుమోగింది. ఆ ఆఫీసర్ ఎవరా అంటూ చాలా మంది గూగుల్‌ లో సెర్చ్ చేశారు.

సంజయ్.. 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (ఏపీసీఐడీ)కి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ గా వ్యవహరిస్తున్నారు. బాలకృష్ణను కాల్పుల కేసులో అరెస్ట్ చేసిన సమయంలో ఈయన... హైదరాబాద్ వెస్ట్ జోన్‌ లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)గా ఉన్నారు.

Tags:    

Similar News