క్లౌడ్ బరస్ట్‌లో వాస్తవమెంత..? ప్రపంచం కొత్త పాఠం నేర్వాల్సిందేనా..?

ఇందుకు మారుతున్న వాతావరణ పరిస్థితులే అని పర్యావరణ నిపుణులు అంటున్నారు. మనుషులు తమ స్వార్థం కోసం పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు.

Update: 2024-09-08 10:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాలను ఈసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. క్లౌడ్ బరస్ట్ జరిగిందా అన్నట్లు విజయవాడ, ఖమ్మం జిల్లాలు పెద్ద ఎత్తున వరదల్లో చిక్కుకుపోయాయి. అటు ఖమ్మంలో వేలాది ఎకరాల అడవి సైతం కొట్టుకుపోయింది. వేల సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. ఇవన్నీ దేనికి సంకేతం..? నిజంగానే క్లౌడ్ బరస్ట్ జరిగిందా..? దాని వెనుక ఉన్న కారణాలేంటి..? అనేది ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తున్న ప్రశ్న.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ, ఖమ్మం జిల్లాలో ఈ సారి నష్టాన్ని చవిచూశాయి. వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఇండ్లు నేలమట్టం అయ్యాయి. ఇంకా ఇళ్లన్నీ బురదలోనే ఉండిపోయాయి. వారం గడుస్తున్నప్పటికీ ఇంకా ప్రజలు భారీ వరదల నుంచి తేరుకోలేకపోతున్నారు.

అయితే.. ఈ వర్షాలపై అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఎన్నో విపత్తులను చూశాం కానీ.. ఇంతటి వరదల విలయాన్ని చూడలేదని అభిప్రాయపడ్డారు. ఎప్పుడూ ఒక్క గుజరాత్‌లోనే వరద విలయం కనిపిస్తూ ఉంటుంది. కానీ.. ఈసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఆ పరిస్థితి చూశాం. ఇంతటి భారీ వర్షాలకు గల కారణాలనూ ఆయన వెతికే పనిలో పడినట్లుగా సమాచారం.

ఎల్‌నినో ప్రభావం వల్ల గతేడాది పెద్దగా వర్షాలు పడలేదు. ఈసారి మాత్రం రుతుపవనాలు రివర్స్ అటాక్ చేశారు. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే.. ఈ వర్షం దేశవ్యాప్తంగా పడితే అంతగా చర్చకు దారితీసే అవకాశం ఉండేది కాదు. కానీ.. ఒకటి రెండు చోట్ల మాత్రమే కురియడం ఆందోళన కలిగించే అంశం. ఆకాశానికి రంధ్రం పడిందా అన్నట్లుగా ఒకేచోట కుండపోత కురుస్తోంది. అటు గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ ఈ క్లౌడ్ బరస్ట్‌లు కనిపించాయి. మరోవైపు.. కేరళలోని వయనాడ్‌లోనూ క్లౌడ్ బరస్ట్ ఏ స్థాయిలో ప్రభావం చూపిందో చూశాం. గతంలోనూ ఈ క్లౌడ్ బరస్ట్‌లపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ఆరోపణలు ఉన్నాయి. వాటి వెనుక విదేశాల కుట్ర అనుమానం వ్యక్తం చేశారు. ఒకేచోట కుండపోతలా వర్షం కురియడం ఏంటని ప్రశ్నించారు.

ఇవన్నీ ఇలా ఉంటే.. దుబాయి వంటి నగరాలు సైతం ఇప్పుడు వరదలతో మునిగిపోతున్నాయి. అక్కడ అసలే వర్షాలు పడవు అని ఇప్పటివరకు మనకు తెలిసిన అంశమే. దానిని పుస్తకాల్లోనూ చదువుకున్నాం. అలాంటి నగరంలోనూ వర్షాలు ముంచెత్తుతున్నాయి. చైనాలోనూ ఇప్పుడు యాగీ అనే ప్రాంతం వరదలతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. అటు బంగ్లాదేశ్‌లోనూ తుపాను బీభత్సం సృష్టించింది. ఇలా ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈ క్లౌడ్ బరస్ట్ ప్రభావం కనిపిస్తూనే ఉంది. ప్రకృతి విపత్తులు కామన్ అయిపోయాయి. దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే.. క్లౌడ్ బరస్ట్ ‌కు ఆ ప్రాంతం.. ఈ ఏరియా అన్నట్లు కాకుండా ఎక్కడైనా.. ఎప్పుడైనా జరగొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇందుకు మారుతున్న వాతావరణ పరిస్థితులే అని పర్యావరణ నిపుణులు అంటున్నారు. మనుషులు తమ స్వార్థం కోసం పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు. పెద్ద స్థాయిలో డ్యామేజీ చేస్తున్నారు. అందుకే.. ఇలాంటి క్లౌడ్ బరస్టులతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందుముందు కూడా ఇలాంటి క్లౌడ్ బరస్టులు ఇంకా చూస్తామని సూచిస్తున్నారు. అయితే.. వీటి బారి నుంచి తప్పించుకోవాలంటే కొత్త కొత్త ప్రయోగాలు, ప్రయత్నాలు సాగాల్సిందేనని అంటున్నారు.

Tags:    

Similar News