ఇంతమంది సీఎం అభ్యర్ధులా...వైసీపీ కి అదే ప్లస్ పాయింట్...?
ఇలా విపక్ష కూటమి నుంచి నలుగురు సీఎం క్యాండిడేట్స్ రెడీగా ఉన్నారని అంటున్నారు.
వైసీపీని అధికారంలో ఉండనీయం, గద్దె దించుతాం, అందుకోసం వైసీపీ వ్యతిరేక ఓటుని ఒక్కటి కూడా చీలకుండా అంతా ఒడిసిపట్టుకుంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. ఏపీలో ఈసారి పొత్తులకు టీడీపీ సుముఖం అనే అంటున్నారు. ఆ పార్టీ పొత్తుల గురించి ఎక్కడా బయటకు చెప్పకపోయినా మ్యాటర్ అయితే అదే. ఎందుకంటే 2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు టీడీపీవే భారీ ఎత్తున చీలిపోయాయి. దాంతో ఆ చేదు అనుభవం కళ్ల ముందు ఉంది టీడీపీకి.
ఇక బీజేపీ ఏపీలో పొత్తుల మీదనే ఆధారపడుతోంది. అయితే ఆ పొత్తులకు కూడా కండిషన్లు వర్తిస్థాయి అన్నది కమలం పార్టీ విధానంగా ఉంది. ప్రస్తుతానికి జనసేనతో పొత్తు ఉన్నా ఎన్నికల వేళకు టీడీపీతో బీజేపీ కలుస్తుంది అని అంటున్నారు. అయితే అదంతా వ్యూహాత్మకంగా సాగుతుంది అని అంటున్నారు. అందుకోసమే ఈ దూరాలు ఎడబాట్లూ అని అంటున్నారు.
ఇక వైసీపీ గెలిస్తే ఆ పార్టీకి జనాలు ఫుల్ మెజారిటీ ఇస్తే సీఎం ఎవరు అన్నది కచ్చితంగా తెలుసు. జగన్ తప్ప వైసీపీ నుంచి మరోకరు లేరు. ఉండబోరు. అది ఆయన సొంత పార్టీ. అందువల్ల తానే ముఖ్యమంత్రి అని జగన్ చెప్పుకుంటారు. అలాగే ఓట్లు అడుగుతారు. కానీ విపక్షాలు అన్నీ కలసి కూటమి కడితే అలా జరుగుతుందా అంటే ఆయా పార్టీలు ఇస్తున్న స్టేట్మెంట్స్ బట్టి చూస్తే కాదు అనే అంటున్నారు.
టీడీపీ నుంచి చంద్రబాబు సీఎం అభ్యర్ధిగా ఎటూ ఉంటారు. ఆయనే సీఎం. ఆయన వస్తేనే తప్ప ఏపీ బాగుపడదు అన్న సెక్షన్ ఒకటి ఉంది. అలాగే బాబు కూడా 2024లో గెలిచి తాను చేయబోయే కార్యక్రమాలు ఏంటి అన్నది కూడా మ్యానిఫేస్టోలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. బాబే సీఎం అంటూ నెలలు రోజులు గంటలు కూడా ఆ పార్టీ కౌంట్ డౌన్ అంటూ చెప్పుకొస్తోంది. సో బాబుని కాదని ఎవరూ ఏమీ చేయలేరు.
ఈసారి అధికారంలో తమకూ వాటా కావాలని జనసేన కచ్చితంగా కోరుకుంటుంది అని అంటున్నారు. వారాహి యాత్రతో తమ బలం పెరిగింది కాబట్టి తమకు సీట్లూ ఎక్కువ కావాలని డిమాండ్ చేయవచ్చు. ఆ సీట్లలో గెలిస్తే సీఎం పదవిని కూడా కోరతారు అని అంటున్నారు. ఎందుకంటే జనసైనికులు పవన్ని సీఎం గా చూడాలని అనుకునంటున్నట్లుగా స్వయంగా ఆయనే చెప్పుకొచ్చారు. కాబట్టి.
ఇక బీజేపీ వైపు నుంచి చూస్తే కొత్త పేరు ఇపుడు తెర ముందుకు వస్తోంది. ఆమె ఎవరోకాదు దగ్గుబాటి పురంధేశ్వరి. అదలు ఆమెకు ప్రెసిడెంట్ పోస్టుకు ఎంపిక చేయడం వెనక చాలా వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీలో విపక్ష కూటమి గెలిచినట్లు అయితే బీజేపీ కూడా తమ అభ్యర్ధి అంటూ నందమూరి వారి ఆడపడుచుని ముందు పెట్టి క్లెయిం చేస్తుంది అని అంటున్నారు. ఆమె ఎన్టీయార్ తనయ.
అదే విధంగా టీడీపీ వారి పార్టీ. అందువల్ల ఏమైనా అనూహ్య పరిణామాలు జరిగితే ఉమ్మడి అభ్యర్ధిగా పురంధేశ్వరి ఉంటారని దానికి నందమూరి వంశం మద్దతు కూడా పుష్కలంగా దక్కుతుంది అన్న ఆలోచనతోనే బీజేపీ ఈ విధంగా పావులు కదిపింది అని అంటున్నారు
ఇక చివరిగా మరో ఇంటరెస్టింగ్ మ్యాటర్ ఉంది. ఏపీ అంతా కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు చినబాబు లోకేష్. ఆయనదీ సీఎం ఆశే. అది కూడా 2024 నుంచి 2029 టెన్యూర్ లోనే అని అంటున్నారు. అసలు చంద్రబాబు బాధ అంతా కుమారుడిని సీఎం గా చూడడం కోసమే అని అంటారు. ఆ విధంగా చెప్పుకుంటే లోకేష్ కూడా సీఎం క్యాండిడేట్ గా ముందుకు వస్తున్నారు అనే అనుకోవాలి. ఇలా విపక్ష కూటమి నుంచి నలుగురు సీఎం క్యాండిడేట్స్ రెడీగా ఉన్నారని అంటున్నారు.
నిజంగా ఇప్పటిదాకా చూస్తే ఉమ్మడి ఏపీలో కానీ విభజన ఏపీలో కానీ జరిగిన ఎన్నికల్లో చూస్తే అటూ ఇటూ చెరొకరు సీఎం క్యాండిడేట్ అని ప్రచారంలో ఉండేది. 2014 లో కూటమి ఉమ్మడి అభ్యర్ధిగా చంద్రబాబే ఉన్నారు. కానీ 2024 డిఫరెంట్ ఎలెక్షన్ గా ఉంటుందా అదే జరిగితే విపక్ష కూటమిలో కుర్చీ కోసం కుమ్ములాట సాగుతోంది అని వైసీపీ తెలివిగా ప్రచారం చేసే అవకాశం ఎటూ ఉంటుంది.
స్థిరమైన ప్రభుత్వం కావాలా లేక అనేక మంది కుర్చీ కోసం పోటీ పడే విపక్ష కూటమి కావాలా అని వైసీపీ ఒక స్ట్రైట్ పాయింట్ ని రైజ్ చేస్తే కనుక జనాల ఆలోచనల్లోనూ భారీ మార్పు వచ్చే అవకాశమూ ఉంది. సో ఏపీకి కాబోయే సీఎం ల జాబితా విపక్షంలో పెరగడం మీదనే చర్చ అయితే సాగుతోంది మరి.