హాసన సెక్స్‌ కుంభకోణం.. మోడీకి సీఎం సిద్ధరామయ్య కీలక లేఖ!

దీంతో... వెంటనే సిట్ దర్యాప్తు వేగం పుంజుకుందని అంటున్నారు!

Update: 2024-05-01 12:01 GMT

ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించినవిగా చెబుతున్న అభ్యంతరకర వీడియోల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కీలక పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ప్రజ్వల్‌ పై జేడీఎస్‌ ఇప్పటికే సస్పెన్షన్‌ వేటు వేయడం.. షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయడం తెలిసిందే. దీంతో... వెంటనే సిట్ దర్యాప్తు వేగం పుంజుకుందని అంటున్నారు!

ఇందులో భాగంగా... హొళెనరసీపుర ఠాణాలో ఫిర్యాదు చేసిన బాధితురాలి (47) వాంగ్మూలాన్ని నమోదు చేసిన సిట్... ఈ కేసులో ఏ1గా ఉన్న హెచ్‌.డీ. రేవణ్ణకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందిన 24 గంటల్లో విచారణకు హాజరు కావాలని సూచించింది. మరోవైపు ప్రజ్వల్‌ ను అరెస్టు చేసి విచారణ చేపట్టాలని కాంగ్రెస్‌, ఎన్‌.ఎస్‌.యూ.ఐ., విద్యార్థి సంఘాలు బెంగళూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.

ఈ సమయంలో ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఒక లేఖ విడుదల చేశారు. ఇందులో భాగంగా... తాను బెంగళూరులో లేనందున సిట్ విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో తనకు వారం రోజులు సమయం కావాలని.. అనంతరం సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.

ఇదే సమయంలో... బెంగళూరులోని సీఐడీ అధికారులకు తన లాయర్ ద్వారా సమాచారం అందించినట్లు తెలిపారు. అనంతరం... ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని చెప్పారు!

మోడీకి సిద్ధరామయ్య లేఖ!:

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారని అంటున్న నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య... ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇందులో భాగంగా... ప్రజ్వల్ రేవణ్ణను విదేశాల నుంచి రప్పించేందుకు చర్యలు చేపట్టాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజ్వల్ డిప్లమేటిక్ పాస్ పోర్ట్ రద్దుకు ఆదేశాలు జారీచేయాలని ప్రధానిని కోరారు.

కాగా... హసన్ లోక్ సభ నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీ అయిన ప్రజ్వల్... ఈ ఎన్నికల్లో బీజేపీ – జేడీఎస్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే.. లైంగిక వేధింపుల ఆరోపణలు రాగానే అతడు జర్మనీ వెళ్లిపోయినట్లు చెబుతున్నారు!

Tags:    

Similar News