అస్త్రసన్యాసం చేసిన వారే.. అసలు దిక్కు!
ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. అసలు కాంగ్రెస్‌కు ఉన్న ప్రధాన ఇబ్బంది.. నాయకులు లేక పోవడం.
`వైనాట్ ఏపీ` అనే కొత్త పల్లవితో ఏపీలో అసెంబ్లీ ఎన్నికల రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. వచ్చే మూడు మాసాల్లో క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని పార్టీ పీసీసీ ఉన్నత స్థాయి కార్యనిర్వాహక వర్గం తాజాగా మూడు రోజుల సమావేశాల్లో తీర్మానం చేసింది. అంతేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా కూడా.. మేనిఫెస్టోను రూపొందించి.. వాటిని ప్రకటించాలని కూడా నిర్ణయించింది.
ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. అసలు కాంగ్రెస్‌కు ఉన్న ప్రధాన ఇబ్బంది.. నాయకులు లేక పోవడం. ఇప్పుడు ఉన్నవారిని చూసినా.. వారంతా అస్త్ర సన్యాసం తీసుకున్న వారే. నీలకంఠాపురం రఘువీరారెడ్డి, ఎంఎం పల్లంరాజు, జేడీ శీలం, షరీఫ్, ఖాన్ ఇలా.. కొందరి పేర్లుపైకి వచ్చినా.. వారంతా ఇప్పటికే ప్రజలకు చాలా దూరంగా ఉంటున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరుస పరాజయం పొందిన వారు కూడా.
పోనీ.. కొత్త మొహాలకు చాన్స్ ఇవ్వాలని పార్టీ భావిస్తున్నా.. వచ్చేవారు లేరు. పోయే వారు తప్ప! అన్నట్టుగా పార్టీ పరిస్తితి ఉంది. మరోవైపు.. తాము అధికారంలోకి వస్తే.. ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ వంటి అగ్రనేతలు నొక్కి వక్కాణిస్తున్నా.. కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి కాంగ్రెస్‌కు ఉందా? అనేది ప్రధాన ప్రశ్న. అయినప్పటికీ.. వైనాట్ ఏపీ నినాదంతో కాంగ్రెస్ నాయకులు కార్యాచరణకు ప్రిపేర్ అవుతున్నారు.
దక్షిణాదిలో కాంగ్రెస్‌గాలి బాగుందని.. కర్ణాటకలోను, తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చామని ఏపీ నాయకులు చెబుతున్నారు. వాస్తవమే. కానీ, అక్కడ ఆయా రాష్ట్రాల్లో రాజకీయాలు వ్యక్తి ఆధారంగా నే జరిగాయనేది నిష్టుర సత్యం. తెలంగాణలో రేవంత్‌రెడ్డి వంటి బలమైన నాయకుడు పూనుకొని పార్టీ ని పరుగులు పెట్టించారు. కర్ణాటకలో సిద్దరామయ్య, డీకే శివకుమార్ వంటి నాయకులు జోడెడ్లుగా కాంగ్రెస్‌ను పరుగులు పెట్టించారు. ఇలాంటి సమర్థత, సాహసం చేయగల నాయకులు ఏపీలో ఎవరున్నారు? అంతా అస్త్ర సన్యాసం చేసిన వీరులు తప్ప.. అనేది జనం టాక్.