హస్తం ఖమ్మం గుప్పిట విప్పనిది అందుకేనా..?

వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో 2019లో లోక్ సభ ఎన్నికలు తొలి దశ అయిన ఏప్రిల్ 11తో ముగిశాయి.

Update: 2024-04-08 00:30 GMT

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రక్రియ మొదలైపోయింది. ఏడు విడతలకు గాను తొలి విడత పోలింగ్ ఈ నెల 19న జరగనుంది. మార్చి 30తోనే దీనికి నామినేషన్ల ఉప సంహరణ గడువు పూర్తయింది. ఈ నెల 26, మే 7, 13, 20, 25, జూన్ 1 తేదీల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో 2019లో లోక్ సభ ఎన్నికలు తొలి దశ అయిన ఏప్రిల్ 11తో ముగిశాయి. ఈసారి మాత్రం 4వ దశలో మే 13న పోలింగ్ జరగనుంది. అంటే.. గతం కంటే 32 రోజులు ఆలస్యంగా అన్నమాట.

అక్కడ రెండో దశలోనే..

దక్షిణాదిలో కీలక రాష్ట్రం కేరళ. ఇక్కడ 20 సీట్లున్నాయి. అంతేగాక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి వరుసగా రెండోసారి పోటీ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కేరళ కొరకరాని కొయ్య. ఇలాంటి నేపథ్యంలో ఆ రాష్ట్రంపై కమలనాథులు గట్టిగా గురిపెట్టారు. ఇక కేరళలో ఈ నెల 26న పోలింగ్ జరగనుంది. గత నెల 28నే ఇక్కడ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 4తో నామినేషన్ల దాఖలు పూర్తయింది. 8వ తేదీతో ఉప సంహరణ కూడా జరిగిపోయింది.

మనది నాలుగో దశ

నాలుగో దశలో భాగంగా తెలగు రాష్ట్రాల్లో ఈ నెల 18 నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది. ఆ రోజు నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఈ నెల 25 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. 29తో ఉప సంహరణ కూడా పూర్తవుతుంది. ఈ లెక్కన కేరళలోని వాయనాడ్ లో పోలింగ్ కు ముందే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అక్కడి వాతావరణం తెలిసిపోతుంది. దీనిని చూశాక ఆయన నిర్ణయం మార్చుకునే వీలుందని తెలుస్తోంది.

వ్యూహాత్మక ఎత్తుగడలో

రాహుల్ ను ఓడించాలని వాయనాడ్ లో బీజేపీ జిత్తులు వేస్తోంది. కాంగ్రెస్ వారిని చేర్చుకుంటోంది. అయితే, రాహుల్ మరోసారి యూపీలోని అమేఠీలో బరిలో దిగితే కేంద్రమంత్రి స్మ్రతీ ఇరానీతో తలపడాల్సి ఉంటుంది. దానికంటే కూడా ఆయనను తెలంగాణలోని ఖమ్మం నుంచి బరిలో దింపాలని చూస్తున్నారు. ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట. ఇప్పటికే అక్కడ ముగ్గురు బలమైన నాయకులు మంత్రులుగా ఉన్నారు. వీరి బంధువులు, వారసులు పోటీకి సిద్ధం అంటున్నారు. అయితే, రాహుల్ బరిలో దిగితే వీరంతా పక్కకు తప్పుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి రాహుల్ వాయనాడ్ లో పరిస్థితిని చూసి ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఒక్కచోటనే పోటీ చేయాలనుకుంటే మాత్రం వాయనాడ్ తో సరిపెట్టుకోవచ్చు.

కొసమెరుపు: కాంగ్రెస్ అడ్డా.. కమ్యూనిస్టుల గడ్డ అయిన ఖమ్మంలో బీజేపీకి బలమే లేదు. జలగం వెంకట్రావు వంటి నేతలను చేర్చుకున్నా టికెట్ ఇవ్వలేదు. ఇలాంటిచోట రాహుల్ ను ఓడిచేందుకు బీజేపీ ఏ ప్రయత్నమూ చేయలేదు. దీంతోనే ఖమ్మం కాంగ్రెస్ కు చాలా సురక్షితమై సీటు. ఇలా ఆలోచించినందునే ఇప్పటివరకు ఎవరికీ కేటాయించకుండా అట్టిపెట్టినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News