జంపింగ్ ఎమ్మెల్యే టార్గెట్.. కాంగ్రెస్ ప్రచారం అదిరిపోతోందిగా!
"ఆ 12 మంది ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ గేటు కూడా తాకడానికి వీల్లేదు. ఆ రకంగా.. తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పాలి" అని రేవంత్ పిలుపునిచ్చారు.
ఒక పార్టీలో గెలిచి.. మరో పార్టీకి జై కొట్టే సంస్కృతి కొన్నాళ్లుగా దేశంలో పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఒక పార్టీ నమ్మి నాయకులకు టికెట్ ఇవ్వడం.. వారు గెలవడం.. ఆ తర్వాత.. వేరే పార్టీ అదికారంలోకి రావడంతో ఆ పార్టీలోకి జంప్ చేయడం.. ఇలాంటి ఘటనలు.. దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అయితే.. ఇప్పుడు తెలంగాణలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వస్తోంది. ఇలా జంప్ చేసిన ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితిలోనూ ఈ దఫా గెలవకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది.
అసలు ఎన్నికలు అంటేనే టికెట్ దక్కించుకోవడం కోసం నాయకులు అనేక తంటాలు పడతారు. ఇక, పార్టీలు కూడా ఆచి తూచి టికెట్లు ఇస్తుంటాయి. ఎంతో మంది ఆశావహులను సైతం బుజ్జగించి, లాలించి.. పక్కన పెట్టి.. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తుంటాయి. మరి ఇలాంటి వారు గెలిచిన తర్వాత.. తమకు టికెట్ ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిచి వేరే పార్టీలోకి జంప్ చేస్తే.. ఎవరికి మాత్రం కోపం ఉండదు. అందుకే.. ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో ఇదే విషయం చర్చకు వస్తోంది. 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం దక్కించుకున్న 12 మంది ఎమ్మెల్యేలు.. తర్వాత కాలంలో పార్టీ నుంచి జంప్ చేసి.. అధికార పార్టీ బీఆర్ ఎస్‌కు జై కొట్టారు.
ఇలాంటి వారిలో సబితా ఇంద్రారెడ్డి(మహేశ్వరం), కందాల ఉపేందర్‌రెడ్డి(పాలేరు) సహా మొత్తం 12 మంది ఉన్నారు. వీరిలో కొందరికి కేసీఆర్ మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అయితే.. ఈ పరిణామాలు చూసిన తర్వాత.. తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ నాయకులు అంటే.. ఈ పార్టీలో గెలిచి.. ఆ తర్వాత బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకుంటారనే మాట స్థిరపడిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇదే విషయాన్ని ఇటీవల కేసీఆర్ కూడా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌లో గెలిచి.. బీఆర్ ఎస్‌లోకి వచ్చేవారికి ఈ సారి కండువా కప్పబోమన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్‌లో గెలిచి.. వేరే పార్టీలోకి వెళ్లేవారికి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. "ఆ 12 మంది ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ గేటు కూడా తాకడానికి వీల్లేదు. ఆ రకంగా.. తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పాలి" అని రేవంత్ పిలుపునిచ్చారు. ఇప్పుడు అదే కసితో ఆయన ప్రచారం చేస్తున్నారు. ఆ జంపింగ్ ఎమ్మెల్యేల ఓటమి కళ్లారా చూడాలని,.. వారిని చిత్తుగా ఓడించి.. తగిన శాస్తి చేయాలనే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనేఆయా నియోజకవర్గాల్లో బలమైన నాయకులను నిలబెట్టింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇదే కనుక సక్సెస్ అయితే.. ఇలా పార్టీలు మారేవారికి కొంత బ్రేకులు వేసినట్టేనని అంటున్నారు పరిశీలకులు.