కాంగ్రెస్ సర్కారు ఇమేజ్ డ్యామేజ్ చేసేటోళ్ల నోళ్లకు చెక్ చెప్పేయాలట!

పదేళ్లుగా అధికారంలో ఉండి.. వారి పాలనను వ్యతిరేకించేటోళ్లు ఉన్నట్లే.. ముచ్చట పడేటోళ్లు ఉంటారు

Update: 2023-12-05 03:51 GMT

పదేళ్లుగా అధికారంలో ఉండి.. వారి పాలనను వ్యతిరేకించేటోళ్లు ఉన్నట్లే.. ముచ్చట పడేటోళ్లు ఉంటారు. తెలంగాణ వాదాన్ని నమ్ముకునేటోళ్లు తాజాగా కాంగ్రెస్ కు ఓటు వేస్తే.. అందుకు భిన్నమైన వారంతా బీఆర్ఎస్ కు ఓటేశారన్న విశ్లేషణ ఒకటి ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. మామూలుగా అయితే.. ప్రజాతీర్పుకు తల వంచి.. వారి నిర్ణయాన్ని గౌరవించటం పాత పద్దతి. ఇప్పుడు ప్రభుత్వం పురుడు పోసుకున్నదో లేదో.. టార్గెట్ చేసేయటం.. అనవసర వ్యాఖ్యలు చేసేసి.. కొత్త భయాందోళనల్ని క్రియేట్ చేసే ధోరణి గడిచిన కొంతకాలంగా నడుస్తోంది.

తాజాగా అలాంటివి తెలంగాణలో కనిపిస్తున్నాయి. ప్రజాతీర్పు వెల్లడైన 24 గంటలు గడిచిందో లేదో.. తెలంగాణకు ఏదో నష్టం జరిగిపోతుందని.. దారుణాలు జరగటమే తరువాయి అన్నట్లుగా తీర్పులు ఇచ్చేసే ధోరణి సోషల్ మీడియాలో ఎక్కువ అవుతోంది. ఇలాంటి వారిపై కాంగ్రెస్ అండ్ కో దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి తీరును కేసీఆర్ సర్కారులో చేస్తే.. రెండో రోజుకు కేసులు చుట్టుకోవటమే కాదు.. నోరు తెరవకుండా ట్రీట్ మెంట్ గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతుందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

మాట్లాడే గొంతులకు స్వేచ్ఛను ఇద్దామన్న చిన్నపాటి ఆలోచనతో చూసిచూడనట్లుగా ఉండటమే కాంగ్రెస్ ప్రధమ తప్పిదంగా మారిందన్న వేదన వ్యక్తమవుతోంది. అధికారం చేతిలోకి రావటం అన్నది టెక్నికల్ మాత్రమే అయినప్పుడు.. తమకు వ్యతిరేకంగా.. తమ ప్రభుత్వ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసే వారిని వదిలేసే తీరుతో జరుగుతున్న నష్టాన్ని కాంగ్రెస్ ముఖ్యులు కొందరు గమనిస్తున్నట్లుగా చెబుతున్నారు.

కొందరు సెలబ్రిటీలు.. మరికొందరు గులాబీ భక్తులు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తీర్పులు ఇచ్చేస్తూ.. తమదైన విశ్లేషణలతో దెబ్బ తీసే ప్రయత్నాలు ముమ్మరం చేశారని.. ఇలాంటి వారిని యుద్ధ ప్రాతిపదికన తొక్కేయాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. అందుకు ఉదాహరణగా సినీ నటి మాధవిలతను చూపిస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వేళలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

వచ్చే ఐదేళ్లలో తెలంగాణలో జరిగే దారుణాలు ఇవేనంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాధవిలత. ''ఫుడ్ ఉండదు. ఉద్యోగాలు ఉండవు. మహిళలకు భద్రత ఉండదు. శాంతి అసలే ఉండదు. ఎంజాయ్ చేయండి. తెలంగాణ కాంగ్రెస్ లవర్స్ కు లక్. ఇక రావణ సామ్రాజ్యం మొదలు. కాంగ్రెస్ తో పోలిస్తే బీఆర్ఎస్ కు నా మార్కులు 99'' అంటూ చేసిన పోస్టుపై గయ్యిమంటున్నారు.

ఇలాంటి వ్యాఖ్యలతో నెగిటివ్ ప్రచారాన్ని చేయటాన్నిప్రశ్నిస్తున్నారు. ఈ తరహా ప్రచారానికి చెక్ పెట్టటమేకాదు.. ఇలాంటి వాళ్ల నోళ్లను అర్జెంట్ గా మూయించకపోతే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. రానున్న కొద్ది రోజుల్లో తీవ్రమైన చర్యల దిశగా అడుగులు పడే వీలుందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News