కాంగ్రెస్ ప్లస్ కామ్రేడ్స్...ఏపీలో కొత్త కూటమి...!

ఈ మూడు పార్టీలలో దేనికి ఓటు వేసినా అది బీజేపీకే వెళ్తుందని ఆయన విమర్శించారు.

Update: 2024-02-15 02:30 GMT

ఏపీలో సీపీఎం పోటీ చేసే సీట్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5, 6 తేదీలలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఏపీలో ఎన్నికల్లో పోటీ మీద కీలక డెసిషన్ తీసుకుంది. మొత్తం 175 సీట్లకు గానూ 26 సీట్లకు అలాగే 25 ఎంపీ సీట్లకు గానూ 3 సీట్లకు పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించింది.

ఏపీలో అధికార వైసీపీ విపక్ష తెలుగుదేశం జనసేన మూడూ కూడా బీజేపీతోనే ఉన్నాయని దాసోహం అంటున్నాయని రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అంటున్నారు. ఈ మూడు పార్టీలలో దేనికి ఓటు వేసినా అది బీజేపీకే వెళ్తుందని ఆయన విమర్శించారు.

ఏపీకి ఏమీ చేయని బీజేపీని ఈ మూడు పార్టీలు భుజాన మోస్తున్నాయని అంటున్నారు. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని, విభజన హామీలు అమలు చేయలేదని, అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని కూడా ప్రైవేటీకరించింది అని ఆయన విమర్శించారు. ఇంతచేసినా బీజేపీతోనే పొత్తులు అంటూ తిరుగుతున్న ఈ పార్టీలను అన్నింటినీ ఓడించాలని ఆయన అన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ని తాము అధికారంలోకి వస్తే కొంటామని లోకేష్ చెబుతున్నారని అంటే బీజేపీ ప్రైవేటీకరణకు అంగీకరించినట్లేనా అని ఆయన ప్రశ్నించారు. రాజధాని విషయంలో వైసీపీ డ్రామాలు ఆడుతోందని ఆయన నిందించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని వైసీపీ నేతలు అనడమేంటి అని వి శ్రీనివాసరావు మండిపడ్డారు.

విశాఖ కర్నూల్ రాజధానులు అని చెప్పినా అమరావతితో సహా మూడింటిలోనూ అభివృద్ధి చేయని వైసీపీ ఇపుడు ఉమ్మడి రాజధాని పేరుతో కొత్త నాటకం ఆడుతోందని ఆయన తప్పు పట్టారు. రాజధాని పేరుతో రియల్ దందాలకు తెర లేపడం తప్ప నిజంగా జరిగింది ఏమీ లేదని ఆయన విమర్శించారు.

ఇదిలా ఉంటే ఏపీ అభివృద్ధిని కోరుకునే శక్తులు రాజకీయ పార్టీలతో తాము కలసి పనిచేస్తామని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా సహా ఏపీకి విభజన చట్టం మేరకు రావాల్సిన వాటి విషయంలో తాము కృషి చేస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ తో కలసి వెళ్లేందుకు సీపీఎం కి ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు ఇతర పార్టీలు వస్తే సీట్ల సర్దుబాటు చేసుకుని పొత్తులతో ముందుకు సాగుతామని ఆయన అంటున్నారు.

సీపీఎం అయితే కాంగ్రెస్ తో సై అంటోంది. ఇపుడు సీపీఐ చెప్పాల్సి ఉంది. ఆ పార్టీ ఈ నెల 20న తన పార్టీ రాష్ట్ర కమిటీ మీటింగులో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూస్తూంటే ఏపీలో కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కొత్త కూటమి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

కాంగ్రెస్ కి షర్మిల నాయకత్వం వహిస్తున్నారు. కొంత ఊపు వచ్చింది. దాంతో వామపక్షాలు కూడా తోడు అయితే ఇండియా కూటమి ఏపీలో ఆవిర్భవిస్తుంది. అదే టైం లో బీజేపీ జనసేన టీడీపీతో ఎన్డీయే కూటమి మరో వైపు ఉండనుంది. వైసీపీ ఒంటరి పోరు చేయనుంది.

Tags:    

Similar News