వ‌దిలించుకునేందుకు వినూత్న ప‌ద్ధ‌తి.. టెక్ కంపెనీల దుష్ట‌బుద్ధి!

ఎప్పుడు ఏక్షణంలో ఫోన్ వ‌స్తుందో లేక మెసేజ్ వ‌స్తుందో తెలియ‌ని తీవ్ర గంద‌ర‌గోళ ప‌రిస్థితిలో ఉద్యోగాన్ని చేస్తున్నారు. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు కామ‌న్‌గా ఉంది.

Update: 2024-04-23 01:30 GMT

ఆర్థిక కార‌ణాలో.. లేక‌.. ఏఐ(ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌) మ‌హిమో.. ఏదేమైనా.. టెక్ కంపెనీల్లో ప్ర‌తి ఆరు మాసాల‌కూ.. ఉద్యోగాలను త‌గ్గిస్తూ వ‌స్తున్న విష‌యం తెలిస్తే. సాఫ్ట్‌వేర్‌లో అయితే.. ఈ ప్ర‌భావం మ‌రింత ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఈ రోజు ఆఫీసుకు వెళ్లి.. ఇంటికి తిరిగివ‌చ్చిన వారు.. తెల్ల‌వారి ఆఫీసుకు వెళ్లే వ‌ర‌కు డౌటే. ఎప్పుడు ఏక్షణంలో ఫోన్ వ‌స్తుందో లేక మెసేజ్ వ‌స్తుందో తెలియ‌ని తీవ్ర గంద‌ర‌గోళ ప‌రిస్థితిలో ఉద్యోగాన్ని చేస్తున్నారు. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు కామ‌న్‌గా ఉంది.

ఇలా ఉద్యోగాన్ని తీసేస్తున్న కంపెనీలు.. మూడు నెల‌ల వేత‌నాన్ని ఇవ్వ‌డం.. ఎర్న్‌డ్ లీవ్స్‌ను ఎన్ క్యాష్ చేయ‌డం.. పీఎఫ్ వంటివాటిని సెటిల్ చేయ‌డం.. బోన‌స్ ఉంటే ఇచ్చేయ‌డం వంటివి చేస్తున్నాయి. దీంతో క‌నీసం.. ప్ర‌స్తుతం చేస్తున్న‌ ఉద్యోగం పోయి.. కొత్త ఉద్యోగం వెతుక్కునే వ‌ర‌కైనా.. వారు.. కొంత ఆర్థికంగా చేయి తిరిగే ప‌రిస్థితిలో ఉంటున్నారు. ఉద్యోగం పోయింద‌నే ఆవేద‌న కామ‌నే అయినా.. పూర్తిగా అయితే.. చేతిలో చిల్లిగ‌వ్వ‌లేకుండాఅయితే ఉండే ప‌రిస్థితి లేదు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఈ అవ‌కాశం కూడా లేకుండా.. టెక్ కంపెనీలు దుష్ట బుద్ధిని ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. అంటే.. ఉద్యోగుల‌ను తీసేయ‌డం కామ‌నే అయినా.. ఈ క్ర‌మంలో కంపెనీలు వినూత్న ప‌ద్ద‌తిని అవ‌లంబి స్తున్నాయి. ఈ విధానంలో ఉద్యోగుల‌ను నేరుగా పొమ్మ‌ని, నువ్వు రేప‌టి నుంచి రావాల్సిన అవ‌స‌రం లేద ని చెప్ప‌రు. మ‌రో రూపంలో వేధింపుల‌కు గురి చేస్తారు. ఈ వేధింపులు కూడా అలా ఇలా ఉండ‌వు.. మాన‌సికంగా.. ఆర్థికంగా.. కూడా తీవ్ర‌స్థాయిలో వేధింపుల‌కు గురి చేస్తున్నారు.

ఎలాగైనా వ‌దిలించుకోవాల‌ని భావించిన ఉద్యోగుల జాబితాను సంబంధిత మేనేజ‌ర్ల‌కు పంపిస్తారు. ఇక‌, అక్క‌డి నుంచి మేనేజ‌ర్ల‌కు పూర్తి హ‌క్కులు క‌ల్పిస్తారు. అలాగ‌ని తీసేయాల‌ని అనుకున్న ఉద్యోగుల పేర్లు కూడా బ‌య‌ట‌కు చెప్ప‌రు. కానీ, ఆ రోజు నుంచి వారికి సెల‌వులు ఇవ్వ‌రు. కుదిరితే వీక్ ఆఫ్ రోజుల్లోనూ ఇంటి నుంచి ప‌నిచేయాలంటూ.. క్ష‌ణం తీరిక‌లేకుండా ప‌నిచెబుతారు. పోనీ అది కూడా చేశార‌నుకోండి.. అస‌లు అప్ప‌టి వ‌ర‌కు ట‌చ్‌లేని ప‌నిని అప్ప‌గిస్తారు.

అది ఎలాగూ.. ఉద్యోగికి చేయ‌డం రాదు కాబ‌ట్టి.. సూటి పోటి మాట‌ల‌తో వేధిస్తారు. ఇత‌ర ఉద్యోగుల‌కు ఇచ్చిన‌ట్టు ఇంక్రిమెంట్లు ఇవ్వ‌రు. బోన‌స్‌లు వేయ‌రు. స‌మ‌యానికి వేత‌నం కూడా ఇవ్వ‌రు. పోనీ.. ప్ర‌శ్నిద్దామంటే.. ఆ అవ‌కాశం కూడా లేకుండా చేస్తారు. ఇక‌, ఉద్యోగుల‌కు.. ఇచ్చే టీ,కాఫీ వంటి వాటిని టార్గెటెడ్ ఉద్యోగుల‌కు క‌ట్ చేస్తారు. స‌మ‌య పాల‌న నిబంధ‌న‌ను మ‌రింత క‌ఠినం చేస్తారు. ఒక్క నిముషం లేటైనా.. ప‌నిష్మెంట్ అంటారు. ఇలా మాన‌సికంగా వేధింపుల‌కు గురి చేసి.. ఉద్యోగి పూర్తిగా విసుగు.. చిరాకు చెందేలా చేస్తారు. దీంతో ఇక నా వ‌ల్ల కాదంటూ.. స‌ద‌రు ఉద్యోగి త‌నంత‌ట త‌నే ఉద్యోగాన్ని వ‌దిలేసేలా చేస్తారు.

ఇదీ.. ప్ర‌స్తుతం 2024లో టెక్ కంపెనీలు అనుస‌రిస్తున్న విధానం. దీనివ‌ల్ల కంపెనీల‌కు లాభ‌మేంట‌నే ప్ర‌శ్న ఉంటుంది. ఇక్క‌డే ఉంది అస‌లు కిటుకు. త‌మంత‌ట తాము ఉద్యోగం నుంచి తీసేస్తే.. పైన చెప్పుకొన్న మూడు నెల‌ల వేత‌నంతోపాటు.. ఇత‌ర బెనిఫిట్లు ఇవ్వాలి. అలా కాకుండా.. ఉద్యోగే త‌నంత‌ట తాను మానేస్తే.. ఇవ‌న్నీ.. కంపెనీకి మిగిలిపోతాయి. అందుకే.. ఈ విధానం ఎంచుకుంటున్నార‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనినే క్వైట్ ఫైర్ అని పిలుస్తున్నారు.

Tags:    

Similar News